Telugu Global
MOVIE REVIEWS

Yatra-2 Movie Review: యాత్ర -2 రివ్యూ!{2.75/5}

2019 లో డా. వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ గా ఇదే దర్శకుడు మహి వి రాఘవ్ ‘యాత్ర’ తీశాడు

Yatra-2 Movie Review: యాత్ర -2 రివ్యూ!{2.75/5}
X

చిత్రం: యాత్ర -2

రచన –దర్శకత్వం : మహి రాఘవ్

తారాగణం : మమ్ముట్టి, జీవా, సుజాన్ బెర్నెర్ట్, కేతకీ నారాయణ్, ఆశ్రితా వేముగంటి నండూరి, మహేష్ మంజ్రేకర్, శుభలేఖ సుధాకర్ తదితరులు

సంగీతం : సంతోష్ నారాయణ్, ఛాయాగ్రహణం : మాధీ

బ్యానర్ : త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్

నిర్మాత : సెల్వ కుమార్

విడుదల : ఫిబ్రవరి 8, 2024

2.75/5

2019 లో డా. వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ గా ఇదే దర్శకుడు మహి వి రాఘవ్ ‘యాత్ర’ తీశాడు. ఇందులో వై ఎస్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించాడు. ఇది మంచి హిట్టయ్యింది. ఇప్పుడు ఇదే దర్శకుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ గా ‘యాత్ర 2’ తీశాడు. ఇందులో మమ్ముట్టితో బాటు జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటించాడు. ఆంధ్రప్రదేశ్ శాసన సభతో బాటు లోక్ సభ ఎన్నికలు త్వరలో జరగను

న్నాయి. ఈ ఎన్నికల సీజన్ లో ‘యాత్ర 2’ విడుదలైంది. 2019 ఎన్నికల్లో 175లో 151 అసెంబ్లీ సీట్లు, 25 లో 22 ఎంపీ సీట్లూ రికార్డు స్థాయిలో గెలుచుకుని సూపర్ హిట్టయిన జగన్ పార్టీని, ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ ఇదే స్థాయిలో సూపర్ హిట్ చేస్తుందా? అందుకు అసలు సినిమా హిట్టయ్యేందుకు అవసరమైన విషయం ఇందులో వుందా? రానున్న ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని పార్టీని గెలిపించడానికి ఈ సినిమా ద్వారా రాష్ట్ర ప్రజల మీదికి విసిరిన సరికొత్త సమ్మోహనాస్త్రమేమిటి? ఇవి పరిశీలిద్దాం...

కథ

2009 లో హెలికాప్టర్ దుర్ఘటనలో వైఎస్సార్ మరణానంతర సంఘటనలతో కథ ప్రారంభమవుతుంది. వైఎస్సార్ ని అభిమానించే ఎన్నో వేల గుండెలు ఆగిపోవడంతో ఆ కుటుంబాల్ని ఓదార్చదానికి వైఎస్ జగన్ (జీవా) ఓదార్పు యాత్ర చేపడతాడు. ఆ యాత్ర‌లో జ‌గ‌న్‌కి లభిస్తున్న విశేష ఆదరణ చూసి ఢిల్లీ హైకమాండ్ అప్రమత్తమవుతుంది. హైకమాండ్ మేడమ్ ని ఎదిరించి యాత్ర కొనసాగిస్తాడు జగన్. ఇక మేడమ్ నుంచి వస్తున్న వార్నింగ్స్ తట్టుకోలేక పార్టీకి రాజీనామా చేసి అదే పులివెందుల ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుస్తాడు. ఇది చూసి మేడమ్ ఇంకా పగసాధింపుగా జ‌గ‌న్‌ ని అక్ర‌మ ఆస్తుల కేసుల్లో జైలుకి పంపిస్తుంది. ఇప్పుడు జగన్ ఏం చేశాడు? జైలు నుంచి బ‌య‌టకెలా వ‌చ్చాడు? 2019 ఎన్నిక‌ల్లో ఎలా గెలిచాడు? అస‌లు 2014 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఓడిపోవ‌డానికి కారణమేమిటి? ఇవి మిగతా కథలో తెలిసే విషయాలు.

ఎలావుంది కథ

సినిమా కథకి అవసరమైన మలుపులన్నీ జగన్ బయోపిక్ లో వున్నాయి. ఎట్టి పరిస్థితిలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్న హీరో పాత్ర పట్టుదల అంతా వుంది. ఈ లక్ష్య సాధనలో ప్రత్యర్ధి పాత్రలతో సంఘర్షణ, ఓటమి, మళ్ళీ సంఘర్షణ, ఇంకో ఓటమి, మళ్ళీ సంఘర్షణ - దాంతో విజయమూ అన్న నాయకత్వ లక్షణాలతో ఏకత్రాటిపై కథ నడిపినప్పుడు, పక్కదోవ పట్టించే సంఘటనల జోలికి పోలేదు. అటెన్ బరో ‘గాంధీ’ తీసినప్పుడు మహాత్మాగాంధీ వ్యక్తిగత జీవితంలోకి పోకుండా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన రాజకీయ జీవితాన్ని మాత్రమే చూపించాడు. తర్వాత ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ ‘గాంధీ మై ఫాదర్’ తీసినప్పుడు గాంధీ వ్యక్తిగత జీవితం మాత్రమే చూపించాడు. ఇది చూస్తే కొడుకుతో గాంధీ వ్యవహరించిన తీరుకి మనకు కోపం కూడా వస్తుంది.

అలాగే ‘యాత్ర 2’ లో సూటిగా జగన్ రాజకీయ జీవితం తప్ప, ఎలాటి వ్యక్తిగత విషయాల జోలికీ వెళ్ళలేదు. 2009 లో ఓదార్పు యాత్రతో ప్రారంభమయిన సంఘర్షణ 2019 లో పాదయాత్ర ఫలితంగా సీఎం అవడంతో బయోపిక్ ముగుస్తుంది. కాబట్టి ఆ తర్వాత పరిపాలన గురించి వుండదు. అందుకని మళ్ళీ జగన్ కి ఎందుకు ఓటెయ్యాలన్న అర్ధంలో సమ్మోహనాస్త్రాలు ఈ సినిమా వుండవు. కథా ప్రయోజనం వుండదు.

అధికారాన్ని అందుకోవడానికి జగన్ చేసిన రాజకీయ యాత్ర ని డాక్యుమెంటరీగా తెలిసిన విషయాలతోనే ఈ బయోపిక్ వుండడంతో, పార్టీ వర్గాల్ని మెప్పించడం తప్ప ప్రజలకి తెలియాల్సిన కొత్త విషయలుగానీ, ఐడియాలజీ గానీ వుండవు. సినిమాటిక్ గా తండ్రి కిచ్చిన మాట కోసం లక్ష్యానికి కట్టుబడ్డ పాత్రగా జగన్ సాగించే ఎమోషనల్ జర్నీ ప్రధానంగా ఈ కథ సాగుతుంది. అయితే మొదటి బయోపిక్ ‘యాత్ర’ హిట్టవడానికి వైఎస్సార్ కి ప్రజలతో వున్న భావోద్వేగ బంధాన్ని సమర్ధవంతంగా చిత్రీకరించాడు దర్శకుడు. ‘యాత్ర 2’ లో జగన్ పాత్రతో అలాటి భావోద్వేగ ధారని సృష్టించలేకపోయాడు. పేరుకే ఎమోషన్ తప్ప కథనమంతా ఫ్లాట్ గా వుంటుంది.

నటనలు- సాంకేతికాలు

వైఎస్సార్ పాత్రలో మళ్ళీ మమ్ముట్టి ఆకట్టుకుంటాడు. అయితే పాత్ర ప్రారంభంలో కొద్ది సెపే వుంటుంది. ఉన్న కొద్ది సేపూ వెంటాడే వైఎస్ మూర్తిమత్వాన్ని సృష్టించి వదిలాడు. తర్వాత జగన్ పాత్రలో జీవా అంతే దీటుగా నటించాడు. జగన్ బాడీ లాంగ్వేజ్ ని, మాట్లాడే విధానాన్నీ సులభంగా ఇమిటేట్ చేశాడు. నటనా పరంగా ఈ ఇద్దరూ సినిమాకి క్వాలిటీ తెచ్చారు- విషయపరంగా బలంగా లేకపోయినా.

మేడమ్ గా సోనియా గాంధీ పాత్రలో సుజాన్ బెర్నెర్ట్ అచ్చం సోనియా గాంధీ లాగే వుంది. వైఎస్ భారతీగా కేతకీ నారాయణ్, విజయమ్మగా ఆశ్రితా వేముగంటి నండూరి సంక్షిప్త పాత్రల్ని నటించారు. చంద్రబాబు నాయుడిగా మహేష్ మంజ్రేకర్ సరిపోయాడు. ఇంకో కీలక పాత్రలో శుభలేఖ సుధాకర్ కనిపిస్తాడు. రాజకీయ సినిమా అని సినిమా అంతా నటీనటులతో నింపెయ్యకుండా పరిమిత తారాగణంతో నీటుగా వుంచారు. ప్రత్యర్ధి నాయకుల మీద, పార్టీల మీద రాజకీయ కామెంట్ల జోలికి పోలేదు. వివాదాలకి అవకాశం లేకుండా మొదటి బయోపిక్ లాగే క్లీన్ గా వుంచారు.

సంగీతం, ఛాయాగ్రహణం వంటి సాంకేతికాంశాలు ఉన్నతంగా వున్నాయి. ఈ బయోపిక్ ఏం చెప్తుందంటే, పట్టుదల వుంటే ఏదైనా సాధించగలమని. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తామని కాదు. రాహుల్ గాంధీ ఇది ఎన్నికల యాత్ర కాదని చెప్తూ ఎలా న్యాయ యాత్ర చేస్తున్నాడో, అలా ఇది ఎన్నికల సినిమా కాదన్నట్టు జరిగిపోయిన విషయాల్ని రిపీట్ చేస్తూ ‘యాత్ర2’ తీశారు.

First Published:  8 Feb 2024 1:48 PM GMT
Next Story