Telugu Global
MOVIE REVIEWS

Vimanam Movie Review: విమానం మూవీ రివ్యూ {2.25/5}

Vimanam Movie Review: ఈ వేసవి స్టార్ సినిమాలు విడుదల కాకపోవడంతో చిన్న సినిమాలతో ప్రేక్షకులు సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

Vimanam Movie Review: విమానం మూవీ రివ్యూ {2.25/5}
X

Vimanam Movie Review: విమానం మూవీ రివ్యూ {2.25/5}

చిత్రం: విమానం

రచన -దర్శకత్వం : వై. శివ ప్రసాద్

తారాగణం : : స‌ముద్రకని, అన‌సూయా భ‌ర‌ద్వాజ్‌, మాస్ట‌ర్ ధృవ‌న్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, ధనరాజ్, తదితరులు

సంగీతం : చరణ్ అర్జున్, ఛాయాగ్రహణం : వివేక్ కాలెపు

బ్యానర్స్ : జీ స్టూడియోస్‌, కిర‌ణ్‌ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్

నిర్మాత : కిర‌ణ్‌ కొర్ర‌పాటి

విడుదల : జూన్ 9, 2023

రేటింగ్: 2.25/5

ఈ వేసవి స్టార్ సినిమాలు విడుదల కాకపోవడంతో చిన్న సినిమాలతో ప్రేక్షకులు సరిపెట్టుకోవాల్సి వస్తోంది. చిన్న సినిమాల్లో కమర్షియల్ సినిమాలు, రియలిస్టిక్ సినిమాలు అనే రెండు కేటగిరీల్లో ప్రేక్షకులకి లభిస్తున్నాయి. అయితే కమర్షియల్ సినిమాల పట్ల చూపే ఎంతో కొంత ఆదరణ రియలిస్టిక్ సినిమాలు -అందులోనూ కన్నీటి కథలతో వుండే వాస్తవిక సినిమాల పట్ల చూపించడం లేదు. ఇది తెలిసికూడా కన్నీటి కథల్ని వినోదాత్మకంగా చూపించే ఆలోచనకి దూరంగా వుంటున్నారు మేకర్లు. చార్లీ చాప్లిన్ సినిమాలు కన్నీటి కథలే, కానీ నవ్విస్తాయి. అప్పుడే వ్యాపార విలువ. ఇలా కాకుండా ‘విమానం’ అనే వాస్తవిక సినిమాని విషాదంగానే తీసినప్పుడు బాక్సాఫీసు తలుపులు ఏ మేరకు బార్లా తెరచుకున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కథ

హైదరాబాద్ లో వీరయ్య (సముద్రకని) సులభ్ కాంపెక్స్ నడుపుకుంటూ జీవనం సాగిస్తూంటాడు. అతను వికలాంగుడు. అతడికో స్కూలు కెళ్ళే కొడుకు రాజు (మాస్టర్ దృవన్) వుంటాడు. రాజుకి విమానాల పిచ్చి. విమానం ఎక్కాలంటే పైలట్ కావాలని కలలు గంటూ వుంటాడు. తిండికే ఇబ్బంది పడుతున్న వీరయ్య కొడుకుని భవిష్యత్తులో పైలట్ గా ఎలా పంపుతాడో మధన పడుతున్న సందర్భంలో, కొడుకు బ్లడ్ క్యాన్సర్ బారిన పడతాడు. అదే సమయంలో రోడ్డు విస్తరణలో భాగంగా సులభ్ కాంప్లెక్స్ ని కూల్చేస్తారు. వీరయ్యకి దిక్కుతోచదు. ఒకవైపు కొడుక్కి ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్, మరో వైపు జీవనాధారం సమస్య. అయితే పైలట్ సంగతేమో గానీ, ముందు బ్లడ్ క్యాన్సర్ తో వున్న కొడుక్కి విమానం ఎక్కించి కోరిక తీర్చాలన్న తపనతో వీరయ్య డబ్బుకోసం ప్రయత్నాలు మొదలెడతాడు. ఇప్పుడు ఈ ప్రయత్నాల్లో ఎన్ని కష్టాలకి, ఎన్ని మోసాలకి లోనయ్యాడనేది మిగతా కథ. ఆఖరికి కొడుకుని విమానం ఎక్కించాడా లేదా అన్నది ప్రశ్న.

ఎలావుంది కథ

ఇలాటిదే ‘ప్రేమ విమానం’ అని వెబ్ మూవీ గత నెల జీ5 లో విడుదలైంది. ఒకేలాటి కథలతో జీ5 ఈ రెండు సినిమాలు నిర్మించింది. అయితే ‘ప్రేమ విమానం’ కామెడీ కథ. ఇందులో విమానం ఎక్కాలన్న ఇద్దరు పిల్లల కలలు, వీళ్ళిద్దరికి ఇంకో ఇద్దరు ప్రేమికులు కలవడం, వీళ్ళందరికీ ఇంకో ఇద్దరు పెద్దలు కలిసి, మొత్తం అందరూ విమానమెక్కే కోర్కెని తీర్చుకునే కథ.

అయితే ప్రస్తుత ‘విమానం’ విషాద కథ. అసలే తారాగణ బలం లేని లోబడ్జెట్ మూవీ, పైగా కష్టాలూ కన్నీళ్ళ ఆర్ట్ సినిమా బాపతు వాస్తవిక సినిమా. దీంతో దీని మార్కెట్ యాస్పెక్ట్ ఓటీటీకే తప్ప థియేట్రికల్ రిలీజుకి కాకుండా పోయింది. పేదరికంలో పెద్ద కోరికల్ని హాస్యభరితంగా చూపించి సినిమాని థియేటర్ సినిమాగా మల్చవచ్చు. ఇలా చూపించిన సినిమాల్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు, అవార్డులు కూడా వచ్చాయి.

తమిళంలో ఇద్దరు పేద బస్తీ పిల్లల పిజ్జా తినాలన్న కోరికతో ‘కాకిముట్టై’, గుజరాతీలో సినిమా వేసుకుని చూడాలన్న ప్రయత్నాలతో పేద పిల్లల ‘చెల్లో షో’, మరాఠీలో దేశంలో తొలి సినిమా తీయాలన్న దాదా సాహెబ్ ఫాల్కే కోర్కెతో ‘హరిశ్చంద్రాచీ ఫ్యాక్టరీ’, కన్నడలో చావు కథతో ‘తిధి’...ఇవన్నీ నవ్వించే- వినోదాత్మక వాస్తవిక సినిమాలే. ‘హరిశ్చంద్రాచీ ఫ్యాక్టరీ’ లో ఫాల్కే కష్టాలు ఎంత కామెడీగా వుంటాయో చెప్పక్కర్లేదు. ఇవి పైకి నవ్వించినా అంతర్లీనంగా వాస్తవంగా వున్న విషాదాన్ని ఫీలవుతూంటాం. ఈ ద్వంద్వాల పోషణే వీటి బలం కమర్షియల్ గా కూడా.

‘విమానం’ ఫ్లాట్ గా విషాదాన్నే చూపిస్తూ పోయింది. ఫస్టాఫ్ లో విమానాల పిచ్చితో కొడుకు సన్నివేశాలు, వాడి స్కూల్ మేట్స్ సన్నివేశాలూ హస్యంగానే వున్నా, తీరా కథలోకి వెళ్ళాక అంతా సీరియెస్సే. ఫస్టాఫ్ లో తండ్రీ కొడుకుల పాత్రల పరిచయం, పరిస్థితి, మరో వేశ్య పాత్ర పరిచయం, చెప్పులు కుట్టే వాడి పరిచయం, ఒక ఆటో డ్రైవర్ పరిచయం... ఇలా సాగుతూ ఇంటర్వెల్లో కథలోకి ప్రవేశిస్తుంది సినిమా. ఇక్కడ కొడుక్కి బ్లడ్ క్యాన్సర్ అనే మలుపు. అయితే ఇక్కడే సెకండాఫ్ లో కథ ఎలా వుండబోతోందో తెలిసి పోతుంది.

దీంతో సెకండాఫ్ లో కొడుకు కోరిక కోసం వీరయ్య పడే కష్టాలు వూహకందే విధంగానే వుంటాయి. సులభ్ కాంప్లెక్స్ కోల్పోయి వెరే ఉద్యోగంలో చేరిన వీరయ్య దొంగతనం ఆరోపణతో పోలీసుల చేతిలో దెబ్బలు తినడం, తర్వాత జోకర్ వేషం వేసి డబ్బులు సంపాయిస్తే దుండగులు లాక్కోవడం లాంటి సన్నివేశాలు బాధపెట్టినా, సెకండాఫ్ లో వేరే మలుపు తీసుకోక కథలో ఈ కష్టాలే రిపీట్ అవడంతో, వీరయ్య కంటే మనమే ఇబ్బంది పడతాం చూడలేక.

ఈ కష్టాలకి తగ్గట్టు కథా నడక మందగించడం ఇంకో సమస్య. అయితే ముగింపులో ఇచ్చిన వూహకందని ట్విస్టు బావుంది. అయితే ఇది వీరయ్య పాత్రని మాత్రం జస్టిఫై చేయదు.

నటనలు- సాంకేతికాలు

ఈ మధ్య తెలుగు సినిమాల్లో తరచుగా కన్పిస్తున్న సముద్రకని వికలాంగుడి పాత్రలో కొన్ని చోట్ల ప్రేక్షకుల్ని ఏడ్పిస్తాడు. కొడుకుతో బాండింగ్ కి సంబంధించిన సన్నివేశాలు కొన్ని భావోద్వేగాల లోతుతో కట్టి పడేస్తాయి. ఇవి కొన్ని చోట్ల మాత్రమే వుంటే సరిపోతుంది. అదే పనిగా చూపిస్తే వర్కౌట్ అవదు. కొడుకు పాత్రలో మాస్టర్ దృవన్ ఒక మంచి బాల నటుడు. అతడికి మార్కులు పడతాయి.

వేశ్య పాత్రలో అనసూయ ఒక టెర్రిఫిక్ నటి. పచ్చి వేశ్యలు కూడా అలా వుండరేమో, అలా నటించింది. చెప్పులు కుట్టే వాడి పాత్రలో రాహుల్ రామకృష్ణ. అయితే వీళ్ళిద్దరి మధ్య ట్రాకు మాత్రం అరకొరగానే వుంటుంది. ఆటో డ్రైవర్ గా ధన రాజ్ కి కూడా పూర్తి స్థాయి పాత్ర దక్కలేదు.

సినిమాలో మొత్తం అన్ని పాత్రలకీ పాత్ర చిత్రణ లోపం కన్పిస్తుంది. కంటెంట్ పరంగా విషాదంగా, భారంగా వున్న ఈ సినిమా సంగీతం (చరణ్ అర్జున్0, ఛాయాగ్రహణం (వివేక్ ), ఇంకా ఇతర ప్రొడక్షన్ విలువలు బావున్నాయి.

పోతే, సినిమా పేదరికాన్ని ఒక టెంప్లెట్ గా తరతరాలుగా మార్పులేకుండా అదే విధంగా చూపిస్తున్నారు. దీంతో కాలమొకటి, పాత్రలు వేరొకటిగా అసహజంగా తెరకెక్కుతున్నాయి. కోవిడ్ లాక్ డౌన్ల దెబ్బతో మధ్య తరగతి పేద తరగతికీ, పేద తరగతి కటిక దారిద్ర్యానికీ జారిపోయారు. ఇలాటి ఒకప్పుడు బాగానే బ్రతికి, పతనమైన మధ్య తరగతి జీవిగా వీరయ్యని చూపించి వుంటే, ప్రేక్షకులు ఐడెంటిఫై చేసుకుని -ఓన్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశముండేది.



First Published:  9 Jun 2023 9:44 AM GMT
Next Story