Telugu Global
MOVIE REVIEWS

Nanpakal Nerathu Mayakkam Review: మమ్ముట్టి 'పగటికల' నిజమైందా? నన్‌పకల్ నేరతు మయక్కమ్ - రివ్యూ {3.5/5}

Nanpakal Nerathu Mayakkam Movie Review, Netflix లో స్ట్రీమింగ్ అవుతున్న నన్‌పకల్ నేరతు మయక్కమ్ మలయాళంలో థియెట్రికల్‌గానూ హిట్టయ్యింది.

Nanpakal Nerathu Mayakkam Movie Review
X

మమ్ముట్టి 'పగటికల' నిజమైందా? నన్‌పకల్ నేరతు మయక్కమ్ - రివ్యూ {3.5/5}

ఎండాకాలం అదీ మిట్టమధ్యాహ్నం మంచి నిద్రలో ఉన్నప్పుడు, మనింట్లోకి పర పురుషుడెవరో వచ్చి, కొద్దికాలం క్రితం చనిపోయిన లేదా అదృశ్యమైపోయిన మనింట్లో కొడుకులాగానో, భర్తలాగానో, తండ్రిలాగానో ప్రవర్తిస్తుంటే మనకెలా ఉంటుంది? అదేసమయంలో అతడి భార్యా పిల్లలు అతడ్ని వెదుక్కుంటూ వచ్చి.. అతడి ప్రవర్తన చూసి తల్లడిల్లిపోతుంటే రెండు కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుంది? చివరికి ఏం చేయాలి? అచ్చం మన మధ్య లేకుండా పోయిన మనవాడిలాగానే ప్రవర్తిస్తున్న అపరిచితుని మన ఇంట్లో అలాగే శాశ్వతంగా ఉండనివ్వలా? మందో మాకో పెట్టి అతడికి స్పృహ లేకుండా చేసి. భార్యా పిల్లలకు అప్పగించేసి శాశ్వతంగా వదిలించేసుకోవాలా?

మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన నన్‌పకల్ నేరతు మయక్కమ్ - Nanpakal Nerathu Mayakkam అనే మలయాళం సినిమా పైన చెప్పిన ఆసక్తికరమైన కథతో ఇటీవల ఓటీటీలో విడుదలైంది. నేను తెలుగు డబ్బింగ్ చూశాను. నాకు నచ్చిందీ సినిమా. సినిమా సంగతులు మీతో పంచుకుంటున్నాను. సినిమా టైటిల్‌ను తెలుగులో చెప్పాలంటే పగటికల అనే అర్థం వస్తుంది.

కేరళకు చెందిన మమ్ముట్టి తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి, మొక్కులు తీర్చుకోవడానికి, తమిళనాడులో వేలాంకిణి మాత దేవాలయానికి ఒక మినీ బస్సు మాట్లాడుకొని వెళ్తారు. బస్సు డ్రైవర్‌ను కంట్రోల్లో పెట్టడంతో పాటుగా యాత్రకు సంబంధించిన ఖర్చు వ్యవహారం అంతా మమ్ముట్టి చూసుకుంటూ ఉంటాడు. బస్సులో తమిళ పాటలు పెడితే ఊరుకోడు. పట్టుపట్టి మరీ మలయాళం పాటలు పెట్టించుకుంటాడు. తమిళం వాసన అస్సలు పడదు.

మొత్తానికి అందరూ యాత్ర ముగించుకొని, మినీ బస్సులో కేరళకు తిరుగు ప్రయాణం అవుతారు. మిట్టమధ్యాహ్నమవుతుంది. బస్సులో అందరూ మంచి నిద్రలో ఉంటారు ఒక్క డ్రైవర్‌ తప్ప. ఉన్నట్టుండి మమ్ముట్టి నిద్ర లేస్తాడు. బస్సుల్లో నుంచి బైటకు చూస్తాడు. తమిళనాడులో పచ్చని పంటపొలాల మధ్య దూరాన ఉన్న ఒక పల్లెటూరు కనిపిస్తుంది. డ్రైవర్‌ను బస్సు ఆపమంటాడు. అలా వెళ్లొస్తానని చెప్పి, బస్సు దిగుతాడు మమ్ముట్టి. బస్సులో అందరూ నిద్రపోతుండగా ఆ పల్లెటూర్లోకి బాగా తెలిసినవాడిలాగా నడుచుకుంటూ వెళ్లిపోతాడు.

అలా వెళ్ళి వెళ్ళి ఒక ఇంటి ముందు ఆగుతాడు. పక్కనే నీడన కట్టేసి ఉన్న దూడకు కాస్త పచ్చగడ్డి వేస్తాడు. కుక్కను పలకరిస్తాడు. బట్టలు మార్చుకుంటాడు. ఇంట్లోకి నిర్భయంగా ప్రవేశిస్తాడు. ఇంటి పెద్దాయన అయిన ఒక ముసలాయన ఇంటి వసారాలో పడుకొని ఉంటాడు. ఆ పెద్దాయన భార్య, కళ్ళకు ఆపరేషన్ జరిగినట్టు నల్ల కళ్లజోడు పెట్టుకొని అక్కడే కాళ్ళు చాపుకొని, గుంజకు ఆనుకొని కూర్చొని ఉంటుంది. టీవీలో పాత తమిళ సినిమా చూస్తూ ఉంటుంది. లోపల గదిలో నుదుటన బొట్టు లేని ఒక మధ్యవయస్కురాలు దిగులుగా మంచం మీద పడుకొని ఉంటుంది.

మమ్ముట్టి నేరుగా గదిలోకి వచ్చి, దిగాలుగా పడుకొని ఉన్న ఆ మధ్యవయస్కురాలిని తమిళంలో పలకరిస్తాడు. కాఫీ పెట్టిస్తాను అంటూ వంటింట్లో వెళ్తాడు. చక్కెర, కాఫీపొడి లేకపోవడం చూసి చిరాకు పడతాడు. ఆమె ఇంటికి వచ్చిన అపరిచితుడ్ని వింతగా చూస్తుంటుంది. సామాన్లు తెస్తానని చెప్పి సంచి తీసుకొని ఇంటి బైటకు వస్తాడు. అక్కడే ఉన్న టీవీఎస్ పిఫ్టీ మోపెడ్‌ను నడుపుకుంటూ ఊర్లోకి వెళ్ళిపోతాడు.

ఆగి ఉన్న మినీ బస్సులో వారందరూ నిద్ర లేస్తారు. ముందు సీటులో ఉండాల్సిన మమ్ముట్టి కనిపించడు. మమ్ముట్టి ఊళ్ళోకి వెళ్లిన విషయాన్ని డ్రైవర్ ద్వారా తెలుసుకుంటారు. అతడు ఎంతకీ రాకపోయేసరికి అతడిని వెదుక్కుంటూ ఊర్లోకి వస్తారు. మోపెడ్ మీద వెళుతున్న మమ్ముట్టి వెంటపడతారు. అతడు వీళ్ళంతా ఎవరో తనకు తెలియదన్నట్టుగా ప్రవర్తిస్తుంటాడు. ఆగకుండా వెళ్ళిపోతాడు. ఊరి చావడి వద్దకు వచ్చి అక్కడ కూర్చొని ఉన్న వారితో ముచ్చట్లు పెట్టుకుంటాడు. ఊరి బార్బర్ ఇంటికి వెళ్ళి అతడి ఫొటోకు దండ వేసి ఉండటం చూసి బాధపడతాడు. సారాయి కొట్టుకు వెళతాడు. అక్కడ టీవీలో వస్తున్న తమిళ సినిమాలో డైలాగులను మక్కీకి మక్కీ చెబుతూ అక్కడి మిగతా తాగుబోతులను అలరిస్తాడు.

ఇంతలో కేరళకు చెందిన మమ్ముట్టి భార్యా కొడుకుతో పాటుగా మినీ బస్సులో వారందరూ, నుదుట బొట్టు లేని మధ్యవయస్కురాలి ఇంటికి వస్తారు. రెండేళ్ళ క్రితం అదృశ్యమైపోయిన లేదా చనిపోయిన ఆమె భర్త సుందరంలా మమ్ముట్టి వ్యవహరిస్తున్నాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు. ఆ ఇంట్లో ఉన్న ముసలాయన, ముసలావిడల కొడుకు సుందరం. సుందరానికి, ఆమెకు స్కూలుకు వెళుతున్న ఒక కూతురు ఉంటుంది. విషయం తెలిసి ఊరి జనమంతా ఆ ఇంటిదగ్గర చేరతారు.

ఈలోగా మమ్ముట్టి మోపెడ్ మీద ఇంటికి వస్తాడు. కేరళకు చెందిన భార్యను, కొడుకును గుర్తుపట్టడు. తనను నిలదీసిన ఊరి వాళ్లతో, బంధువులతో ఇది తన వూరే అంటాడు మమ్ముట్టి. చచ్చేదాకా ఇక్కడే ఉంటానని తేల్చి చెబుతాడు. ఊరి పెద్ద వచ్చి సర్దిచెబుతాడు. అందరి కళ్ళు మమ్ముట్టి పైనే ఉంటాయి.

ఇంట్లోకి వెళతాడు మమ్ముట్టి. వసారాలో కాళ్లు చాపుకొని టీవీ చూస్తున్న ముసలావిడ ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంటాడు. ఆమె ప్రేమతో అతడి తల నిమురుతుంది. మధ్యవయస్కురాలు మామగారికి, మమ్ముట్టికి భోజనం వడ్డిస్తుంది. భోజనం చేయబోతూ కూతుర్ని పిలుస్తాడు. ఎప్పుడూ తనతోపాటు కూర్చొని తినే కూతురు ఇవాళ ఎందుకు రాలేదని అడుగుతాడు. మధ్యవయస్కురాలి కూతురు కన్నీళ్ళు తుడుచుకుంటూ వచ్చి మమ్ముట్టి వెనుక కూర్చుంటుంది.

మమ్ముట్టి భార్యా బంధువులు ఒక నిర్ణయానికి వస్తారు. అతడికి మత్తుమందు పెట్టి అతడిని తమతోపాటు కేరళకు తీసుకువెళ్ళానని అనుకుంటారు. మత్తుమందును మధ్యవయస్కురాలికి ఇస్తారు. అయితే మధ్యవయస్కురాలు మత్తు మందును కాఫీలో కలపకుండా వదిలేస్తుంది.

ఆ తర్వాత ఏమైంది? మరి మమ్ముట్టి మాములు వాడైపోయాడా? అతడిని ఆవహించిన సుందరం అతడిని వదిలేశాడా? లేక అలాగే ఉండిపోయాడా? మమ్ముట్టి తన వారితో కలిసి కేరళకు వెళ్లాడా? లేదా? తెలుసుకోవాలంటే మాత్రం ఈ సినిమాను చూడాల్సిందే.

మొదటి పావుగంట సినిమా కొంత సాగదీసినట్టుగా అనిపించినా.. మిగిలిన గంటన్నర సినిమా తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగిస్తుంది.

టీవీలో వస్తున్న పాత తమిళ సినిమాలో సంభాషణలను, పాటలను, నేపథ్య సంగీతాన్ని ఈ సినిమాకు సందర్భోచితంగా వాడుకున్నాడు దర్శకుడు.

సినిమా చిత్రీకరణ అంతా ప్రముఖ తమిళ సినీ దర్శకుడు, ఛాయాగ్రాహకుడు దివంగత బాలూ మహేంద్ర తరహాలోనే ఉంటుంది.

మలయాళ సూపర్ స్టార్‌ ప్రధాన పాత్రదారిగా, తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో, దాదాపు మొత్తం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ నన్‌పకల్ నేరతు మయక్కమ్ - Nanpakal Nerathu Mayakkam సినిమాకు మమ్ముట్టి నిర్మాతగా వ్యవహరించడం విశేషం.

వీలుంటే ఈ సినిమాను ఒకసారి చూడండి. మిగతా సినిమాల్లా కాకుండా, ఈ సినిమాను కాస్త మనసు పెట్టి చూస్తే మజా వస్తుంది.

First Published:  2 March 2023 9:33 AM GMT
Next Story