Telugu Global
MOVIE REVIEWS

Hi Nanna movie review | హాయ్ నాన్నా- రివ్యూ {2.5 /5}

Nani's Hi Nanna movie review | నేచురల్ స్టార్ నాని ‘దసరా’ తర్వాత నటించిన ‘హాయ్ నాన్న’ కి శౌర్యవ్ కొత్త దర్శకుడు. ‘సీతారామం’ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్.

Hi Nanna movie review | హాయ్ నాన్నా- రివ్యూ {2.5 /5}
X

చిత్రం: హాయ్ నాన్నా

రచన -దర్శకత్వం: శౌర్యవ్‌

తారాగణం: నాని, మృణాల్‌ ఠాకూర్‌, కియారా ఖన్నా, శృతీ హాసన్‌, జయరామ్‌, అంగద్‌ బేడీ, ప్రియదర్శి తదితరులు

సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్, ఛాయాగ్రహణం : సానూ జాన్ వర్గీస్

నిర్మాతలు: మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల

విడుదల: డిసెంబర్ 7, 2023

రేటింగ్: 2.5 /5

నేచురల్ స్టార్ నాని ‘దసరా’ తర్వాత నటించిన ‘హాయ్ నాన్న’ కి శౌర్యవ్ కొత్త దర్శకుడు. ‘సీతారామం’ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్. చైల్డ్ సెంటిమెంట్ చుట్టూ తీసినట్టు అన్పించే ఈ సినిమా నిజంగా చైల్డ్ సెంటిమెంటేనా, టైటిల్ ప్రకారం ఫాదర్ కథా, లేక ఫాదర్ -మదర్ కథా? ఈ మూడింట్లో ఏది? ఇది తెలుసుకోవడానికి సినిమాలోకి వెళ్దాం...

కథ

విరాజ్‌ (నాని) ఓ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. అతడికి మహి (కీయారా ఖన్నా) అనే ఆరేళ్ళ కూతురు. ఈమె ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూంటుంది. ఆమెకి కథలు చెబుతూ వుంటాడు. ఆ కథల్లో పాత్ర స్థానంలో ఆమె తండ్రిని ఊహించుకుంటూ వుంటుంది. తండ్రి కథలు కాదు తల్లి కథలు చెప్పాలని పట్టుబడుతుంది. అయినా చెప్పక పోవడంతో ఇంట్లోంచి వెళ్ళిపోయి ప్రమాదం బారిన పడుతూంటే, యష్ణ (మృణాల్ ఠాకూర్) కాపాడుతుంది. ఇక విరాజ్ తన భార్య, అంటే మహి తల్లి కథ చెప్తాడు. ఈ కథలో విరాజ్ భార్య స్థానంలో యష్ణ తనని వూహించుకుని ప్రేమలో పడుతుంది. ఇంతకీ విరాజ్ భార్య ఎవరు? ఆమె ఏమైంది? తిరిగి కలిసిందా? కలిస్తే యష్ణ ఏమైంది? కూతురి వ్యాది నయమైందా? ...ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

టైటిల్ ని బట్టి ఇది నాన్న కథ అనుకుంటే పొరపాటు. ఇది ఆ నాన్న భార్య కథ. అంటే తల్లి కథ. ఆ కూతురికి తల్లి కావాలి. కాబట్టి ఆ తల్లి కోసం తపిస్తున్నప్పుడు టైటిల్ ‘హాయ్ మమ్మీ’ అని వుంటే సరిపోతుంది, ప్రేక్షకులు కూడా తల్లి కోసమే ఎదురు చూస్తూంటారు. కనుక ఇది కూతురితో తండ్రి కథ కాదు, తండ్రి తో కూతురి కథా కాదు, కూతురితో తల్లి కథ కూడా కాదు. ఫిల్టర్ చేస్తే ఇది సింపుల్ గా తల్లిదండ్రుల కథ అని తేలుతుంది. వీళ్ళు ఎప్పుడు కలిశారు, ఎలా పెళ్ళి చేసుకున్నారు, ఎందుకు విడిపోయారు అన్నదే కథ. ఏదో సమస్య వచ్చి భార్యాభర్తలు విడిపోవడం, తిరిగి కలుసుకోవడం కొత్తదనమున్న కథేమీ కాదు. ఇలాటి సినిమాలు చాలా వచ్చాయి.

ఈ సర్వ సాధారణ కథకి ఇంటర్వెల్ ఒక ట్విస్టుతో, క్లయిమాక్స్ లో ఇంకో ట్విస్టుతో ప్రాణం పోసే ప్రయత్నం చేశారు. అయితే ఇంటర్వెల్ ట్విస్టుతో ప్రేక్షకుల ప్రాణాలు లేచొచ్చినా, సెకండాఫ్ ప్రారంభిస్తే మళ్ళీ కథ లేదు. కథతో సంబంధం లేని సీన్లు, ఓ పాటా వచ్చేస్తాయి. క్లయిమాక్స్ ట్విస్టుతో ప్రేక్షకుల ప్రాణాలు మళ్ళీ లేచొచ్చినా, ఆ తర్వాత ఓ పట్టాన ముగింపు తేలక సాగతీతతో పరీక్ష పెడుతుంది.

మరి ఈ ఫ్యామిలీ డ్రామాలో చెప్పుకోదగ్గ విషయమేముంది? కొన్ని తండ్రీ కూతుళ్ళ కదిలించే సెంటి మెంటు సీన్లు, మరికొన్ని తల్లిదండ్రుల మధ్య కదిలించే సీన్లు, సంభాషణలు. ఇక కథనంలో వేగం వుండదు. చెప్పిందే చెప్తున్నట్టు కొన్ని సీన్లు వుంటాయి. హీరోహీరోయిన్ల మధ్య రోమాన్సు కూడా బలంగా వుండదు. సెకెండాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో కూడా రోమాన్సు అంతంత మాత్రమే.

భావోద్వేగాలకీ డ్రామాకీ పుష్కలంగా స్కోపున్న కథ ఇది. నిర్వహణ కుదర్లేదు. అయితే నేచురల్ స్టార్ నాని, కియారా ఖన్నా, మృణాల్ ఠాకూర్ ల సహజ నటనలే ఈ సినిమాకి బలంగా కన్పిస్తాయి. వీళ్ళతో గుండెల్ని పిండే సీన్లున్నాయి. అయితే అక్కడక్కడా సీన్లుంటే ఏం లాభం? మొత్తం కథగా ఒక ఫ్లో వుండాలి, దాంతో సాగే చెదిరిపోని భావోద్వేగాలుండాలి. అయితే అక్కడక్కడా కదిలించే సన్నివేశాలుంటే గొప్ప ఫీల్ గుడ్ సినిమాగా ఫీలయ్యే ప్రేక్షకులుంటారు కాబట్టి, ‘హాయ్ నాన్నా’ పూర్తిగా బ్యాడ్ అని చెప్పలేం.

నటనలు- సాంకేతికాలు

మరోసారి తండ్రి పాత్రలో నేచురల్ స్టార్ అనిపింఛాడు నాని. ఎలాటి కమర్షియల్ అంశాలకీ, కామెడీకీ వీలులేని సెంటిమెంటల్ తండ్రి పాత్రలో ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా కూతుర్ని ఎలాగైనా బతికించుకోవాలనే ఆర్తి, దుఖం పొంగే డ్రామాని అర్ధం జేసుకుని బాగా హైలైట్ అయ్యేలా నటించాడు. చేశాడు. కూతురిపాత్రలో నాని కేం తీసిపోకుండా నటించింది కియారా. మృణాల్ ఠాకూర్ ఏడ్పు సీన్లు క్లాస్ గా నటించింది. ఏడ్వడం కూడా ఓ కళే అన్నట్టు కట్టిపడేసింది. నాని ఫ్రెండ్ గా ప్రియదర్శి కి కామెడీ లేదు. సినిమాలో కామెడీ లేదు కాబట్టి. అంగద్ బేడీ డాక్టర్ గా నటిస్తే, జయరాం క్లయిమాక్స్ ట్విస్టు ఇచ్చే పాత్రలో సస్పెన్స్ పోషించాడు.. ఇక శృతీ హాసన్ పేరుకే వుంది. ఓ పాటలో కనిపించి వెళ్ళి పోతుంది.

హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతంలో ‘సమయమా’ ఒక్క పాటే బావుంటుంది. అయితే నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. సినిమాని నిలబెట్టే ప్రయత్నం మంచి విజువల్స్ తో ఛాయాగ్రహకుడు సానూ జాన్ వర్గీస్ కూడా చేశాడు. ముంబాయి గోవా లొకేషన్స్ కి రాణింపు తెచ్చాడు. ఇతర ప్రొడక్షన్ విలువలు నాని స్థాయికి తగ్గట్టు రిచ్ గా వున్నాయి.

కుటుంబ కథగా తీసిన ఈ సినిమాని ఇందులో వున్న ప్లస్ – మైనస్ లని సినిమాలో కంటెంట్ లాగే సుఖదుఖాలుగా తీసుకుని, ఓసారి చూసేందుకు ప్రయత్నించ వచ్చు.



First Published:  7 Dec 2023 11:12 AM GMT
Next Story