Telugu Global
MOVIE REVIEWS

Lal Salaam Movie Review: లాల్ సలాం - రివ్యూ

Lal Salaam Movie Review: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ తర్వాత ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా ‘లాల్ సలాం’. దీనికి రజనీ కాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించడంతో ఆసక్తి రెట్టింపయింది.

Lal Salaam Movie Review: లాల్ సలాం - రివ్యూ
X

చిత్రం: లాల్ సలాం

రచన- దర్శకత్వం : ఐశ్వర్యా రజనీకాంత్

తారాగణం : రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్, నీరోషా, జీవిత, లివింగ్ స్టన్, తంబి రామయ్య తదితరులు

కథ : విష్ణు రంగసామి, సంగీతం : ఏఆర్ రెహమాన్, ఛాయాగ్రహణం : విష్ణు రంగసామి

బ్యానర్ : లైకా ప్రొడక్షన్స్, నిర్మాత : సుభాస్కరన్ అల్లిరాజా

విడుదల : ఫిబ్రవరి 9, 2024

రేటింగ్: 2/5

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ తర్వాత ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా ‘లాల్ సలాం’. దీనికి రజనీ కాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించడంతో ఆసక్తి రెట్టింపయింది. అయితే ఇందులో రజనీ అతిధి పాత్ర పోషించారని తెలియడంతో, విడుదలకి ముందు సరైన ప్రమోషన్స్ కూడా లేకపోవడంతో దీని ప్రభావం ఓపెనింగ్స్ మీద పడింది. అయినా మత సామరస్యం గురించి తీసిన ఈ సినిమా మణిరత్నం తీసిన ‘బొంబాయి’ లా వుంటుందేమో చూద్దామని ఆసక్తి పెంచుకుని వెళ్తే జరిగేదేమిటి? ఇందులో మతం ఎక్కడుందని వెతుక్కోవడమా? జాతర ఎక్కువైందని విసుక్కోవడమా? ‘కాంతారా’ దగ్గర్నుంచి ఈ మధ్య సినిమాల్లో జాతరలు ఎక్కువైపోయాయి. అయినా ఈ మతం-కమ్ -జాతర జాయింటు సినిమా ఒకే టికెట్టు మీద చూసే అదృష్టానికి మార్కులేసి చూస్తే ఎలా వుందంటే...

కథ

1990 లలో కసుమూరు అనే గ్రామంలో గురుమూర్తి అలియాస్ గురు (విష్ణు విశాల్), షంసుద్దీన్ అలియాస్ షంసు (విక్రాంత్) అనే చిన్నప్పుడే శత్రుత్వాలతో విడిపోయిన స్నేహితులు. గురు తండ్రి (ఫిలిప్ లివింగ్ స్టన్), షంసు తండ్రి, వూరి పెద్ద మొయిద్దీన్ భాయ్ అలియాస్ భాయ్ (రజనీకాంత్) మంచి స్నేహితులు. గురు తండ్రి చనిపోవడంతో అతడి కుటుంబాన్ని భాయ్ ఆదుకున్నాడు. గురు తల్లి (జీవిత) భాయ్ ని అన్నలా భావిస్తుంది. క్రికెట్ లో ఆసక్తి వున్న గురు- షంసు ఇద్దరూ ఎప్పుడూ ఘర్షణ పడుతూంటారు. పక్కూరి ప్రత్యర్ధి వీళ్ళిద్దరి మధ్య, అవసరమైతే వూళ్ళో రెండు మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు పొందాలనే పథకంతో వుంటాడు. ఇందుకు కొడుకుని ప్రయోగిస్తే వాడి చెయ్యి విరగ్గొట్టి గురు జైలుకి పోతాడు.

ఇలావుండగా, భాయ్ ముంబాయికి షిఫ్ట్ అయి అక్కడ బిజినెస్ చేపడతాడు. ఇటు వూళ్ళో జాతర వుంటుంది. జాతరలో రధం ఊరేగింపులో పక్కూరి ప్రత్యర్ధి కొడుకు వూడి పడి తన వూరి రధాన్ని తను లాక్కుపోతాడు. గురు మీద కోపంతోనే ఇలా చేశాడని గురుని గ్రామం నుంచి బహిష్కరిస్తారు. గురు కొత్త రధంతో తిరిగి రావాలని సంకల్పిస్తాడు.

ఇంతలో షంసు రంజీ ట్రోఫీలో సెలెక్టు కావడంతో వూళ్ళో క్రికెట్ కి ఏర్పాట్లు జరుగుతాయి. పక్కూరి ప్రత్యర్ధి పన్నిన కుట్రలో భాగంగా వూళ్ళో రెండు మత వర్గాలు త్రీ స్టార్ టీంగా- ఎంసిసి టీంగా విడిపోతాయి. ఆ క్రికెట్ లో ఘర్షణ చెలారేగి గురు షంసు చేయిని నరికేస్తాడు.

ఇప్పుడు భాయ్ ఏం చేశాడు? గురు మీద కక్ష గట్టాడా? చేయి కోల్పోయిన కొడుకుకి ఏం న్యాయం చేశాడు? దీంతో మత గొడవలు పెరిగాయా? జాతరలో రధం సమస్య ఏమైంది? జాతరకీ, ఉర్సుకీ సంబంధమేమిటి? క్రికెట్ కీ మతాలకీ సంబంధమేమిటి? ఇవన్నీ పరిష్కరిస్తూ భాయ్ ఇచ్చిన సందేశమేమిటి? ఇవి తెలుసుకోవాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే.

ఎలా వుంది కథ

1971 లో గుల్జార్ దర్శకత్వం వహించిన ‘మేరే అప్నే’ (నావాళ్ళు) విడుదలైంది. ఇందులో శత్రుఘ్న సిన్హా, వినోద్ ఖన్నా ప్రత్యర్ధులుగా, మీనా కుమారి ఇద్దరి మధ్య శాంతికి ప్రయత్నించే వృద్ధ వితంతువుగా నటించారు. వ్యవస్థకి వ్యతిరేకంగా రెండు యువజన సంఘాల ఆధిపత్య పోరు ఈ సినిమా. ఈ ఘర్షణల్లో తుపాకీ తూటాకి శాంతి దూత మీనాకుమారి నెలకొరుగుతుంది. ఎదుటి వర్గాన్ని నాశనం చేయబోతే వెనుక నీ వాళ్ళు కూడా నాశనమవుతారని చెప్తుందీ కథ. సూటిగా, బలంగా వుంటుందీ కథ. ఇంకా అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్లు యాంగ్రీ యంగ్ మాన్ గా కోపాన్ని ఒంటరిగా చూపించకముందే, గుల్జార్ సామూహిక కోపాన్ని చాలా ప్రశంసనీయ శైలిలో చిత్రీకరించారు. యువ మనస్సు జీవిత ఆదర్శాలని సాధించలేనప్పుడు, అందుబాటులో వున్న కుటుంబ నిర్మాణంలో జీవించలేనప్పుడు, లేదా అటువంటి వ్యవస్థలో తన భావాల్ని వ్యక్తపరచలేనప్పుడు, అది ఆ నిర్మాణం వెలుపల ప్రమాదకర తావుల్ని వెతుక్కుంటుందని సందేశం. ఇది ఈ నాటికీ రిలవెంట్ సందేశం.

‘లాల్ సలాం’ లో ఆ ప్రమాదకర తావు మతోన్మాదం కావచ్చు. మత సినిమాలో ‘లాల్ సలాం’ టైటిల్ కి అర్ధమేమిటో కూడా చెప్పకుండా వదిలేశారు. ‘మతాన్ని నమ్మితే మనసులో వుంచుకో, మానవత్వాన్ని నమ్మితే అందరితో పంచుకో’ అని రజనీ చేత చెప్పించారు. ఇక్కడ కూడా టైటిల్ జస్టిఫై కాలేదు. చివర్లో ‘సలామాలేకూం- అస్సలామాలేకూం’ అర్ధం చెప్పించారు. ఇప్పుడు కూడా టైటిల్ జస్టిఫై కాలేదు. ‘కులం వుంటే, మతం వుంటే ఇంటి దగ్గర వుంచుకో. బయటికొస్తే సామాజికం- లాల్ సలాం’ అని అర్ధమయ్యేలా చెప్పించలేక పోయారు. ఈ సినిమా ద్వారా తీసుకున్నది వామపక్ష స్టాండ్ అయినప్పటికీ.

మత కథ కూడా సూటిగా, బలంగా చెప్పలేకపోయారు. పైగా ఒక వొరలో రెండు కత్తులు ఇమడవన్నట్టు మత కథ, జాతర కథ రెండూ జొప్పించి అసలేం చెప్తున్నారో అర్ధంగాకుండా చేశారు. ఫస్టాఫ్ ఇంటర్వెల్ పూర్తయినా కథ దేనిగురించో స్పష్టత వుండదు. ఒకటి రెండు సార్లు హీరోలిద్దరి ఘర్షణ, ఆ తర్వాత చిన్న హీరో అదృశ్యమై పెద్ద హీరోతో తల్లి తగాదాలు, పక్కూరి ప్రత్యర్ధి కొడుకుతో ఘర్షణలు, క్రికెట్ ని అభిమానించే కొడుకుని రజనీ ప్రేమించడం, వూరి పెద్దగా పెదరాయుడు టైపులో కాకపోయినా ఓ మోస్తరుగా రజనీ నిర్ణయాలు చెప్పడం- ఇలా ముస్లిం వేషధారులు తిరుగుతున్నా మత కథ చిహ్నాలు కూడా లేకుండా, బ్యాక్ గ్రౌండ్ లో అన్ని సన్నివేశాలకీ ఏఆర్ రెహ్మాన్ డప్పు మేళాలతో ఒకే టైపు సంగీతం వస్తూంటే-ఈ జాతర సంగీతం ఎందుకొస్తోందాని ఆలోచిస్తూంటే, చివరికి 50 నిమిషాలకి వూళ్ళో జాతర, జాతర పాట!

పాట అవగానే, పక్కూరి ప్రత్యర్ధి రధం లాక్కు వెళ్ళిపోవడంతో, పెద్ద హీరో వూళ్ళోంచి బహిష్కరణకి గురవడంతో కథేమిటో అర్ధంగాకుండా ఇంటర్వెల్ పడుతుంది. సెకండాఫ్ ప్రారంభమైతే జాతర కథకే కొనసాగింపు. ఇంకో అరగంట గడిచాకగానీ, ముంబాయిలో వున్న రజనీ కొడుక్కి రంజీ ట్రోఫీలో సెలెక్ట్ అయ్యాడని చెప్పడం. రజనీ ఫస్టాఫ్ మధ్యలో ముంబాయి వెళ్ళి బిజినెస్ పెట్టడం జాతర కథకి అడ్డున్నాడనేమో. ఇక ఇప్పుడు వూళ్ళో క్రికెట్ తో మత కథ, దాని పరిణామాలు, చిన్న హీరో చెయ్యి పెద్ద హీరో నరకడం!

ఇప్పుడు రజనీ వూళ్ళోకి తిరిగి రావడం. చిన్నప్పట్నుంచీ హీరోలిద్దరూ శత్రువులుగా వున్నా వూరి పెద్దగా వాళ్ళని మార్చేందుకు ప్రయత్నించని రజనీ ఇప్పుడేం చేస్తాడు. పాత్రచిత్రణ ఇలా దెబ్బతిన్నాక, ఇక చేసేదంతా ఫార్ములా ప్రకారమే. చివరికి ‘నీ మతం, నా మతం అని కాదు. రక్తం ఒకటే. మనం అన్నదమ్ములుగా బ్రతకాలి, మృగాలుగా మారకూడదు’ అని పేలవమైన డైలాగులు.

‘ఇది మా వూరు. అప్పుడే మిమ్మల్ని ఆ దేశానికి తరిమేసి వుంటే ఇలా వుండేది కాదు’ అని గ్రామస్తుస్థులు అంటే, ముస్లిం దేశభక్తి గురించి, ఇక్కడే పుట్టాం, ఇక్కడే చస్తామని, ఇండియన్లమనీ రొటీన్ డైలాగులు.

ఈ కథ పూర్తవగానే కొత్త రధంతో జాతర కథ క్లయిమాక్స్, మళ్ళీ మత ఘర్షణలు, చివరికి జాతరనీ, ఉర్సునీ భాయ్ భాయ్ చేస్తూ సుఖాంతం!

ఇలా దేని ప్రభావం ఫీలవకుండా రెండు కథలు జొప్పించి దర్శకురాలు ఏం తీసిందో అర్ధం గాకుండా చేయడం. కొత్తదనం లేకుండా పాత కాలపు సీన్లు. మత పాయింటుతో రెండు మూడు చోట్ల ధైర్యాన్నే ప్రదర్శించింది. వూళ్ళో ఇండియన్ టీమ్, పాకిస్తాన్ టీమ్ అని చెప్పి. కానీ బాక్సాఫీసు అప్పీలుతో బాటు, యూత అప్పీల్ వుండే క్రికెట్ ఒకదాన్నే తీసుకుని, దీన్నుంచి కూడా రాజకీయ శక్తులు మత ఘర్షణలు సృష్టించి పోలరైజ్ చేయగలవని హెచ్చరించి వుంటే సమకాలీన సినిమాగా వుండేది- రజనీని రిస్కులో పడే కోచ్ గానో, అంపైర్ గానో చూపించి!

నటనలు -సాంకేతికాలు

‘జైలర్’ లో ఇమేజిని పక్కన పెట్టి నటించిన రజనీకీ ఇందులో రజనీకీ పొలికే లేదు. ఇమేజిని పక్కన బెట్టడం వరకూ బాగానే వుంది కానీ, ఈ వాస్తవిక పాత్రలో డెప్త్, బలం కనిపించవు. భావోద్వేగం వుండదు. ఒకవేళ కమర్షియల్ గా విజృంభించి నటించినా సినిమాని కాపాడేంత విషయం సినిమాలో లేదు. డైలాగుల్లో కూడా పస లేదు. ‘జవాన్ ‘ లో షారుఖ్ ఖాన్ చివర్లో పదినిమిషాలు ఓటర్లు ఏం చెయ్యాలో చెప్పే పవర్ఫుల్ డైలాగులకి పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతారు ప్రేక్షకులు.

రజనీ భార్యగా మాజీ హీరోయిన్ నీరోషా నటించింది. విష్ణు విశాల్ తల్లిగా జీవిత ఎప్పుడూ లౌడ్ గా ఏడుస్తూనే వుండే విషాద పాత్ర. హీరోలుగా విష్ణు విశాల్, విక్రాంత్ ల శతృత్వం ఫ్లాట్ గా వుంటుంది. ఎప్పుడో చిన్నప్పట్నుంచీ శత్రువులని చెప్పకుండా, ఇప్పుడు నడుస్తున్న కథలో ఫ్రెండ్స్ గా చూపించి, శత్రువులుగా మార్చి వుంటే డైనమిక్స్ తో థ్రిల్ చేసేది లైవ్ శతృత్వం. ఇక మిగతా పాత్రల్లో నటీనటులు చాలా మందే వున్నారు.

ఏఆర్ రెహమాన్ సంగీతం సెకండాఫ్ లో కూడా జాతర సంగీతమే. మత సంగీతం ఎక్కడా విన్పించదు. ఉర్సులో కూడా సూఫీ సంగీతం వుండదు. పాటలు ప్రశ్నార్ధకంగా వున్నాయి. ఇక దీనికి ఛాయాగ్రహణం సమకూర్చిన విష్ణు రంగ సామియే కథ కూడా అందించాడు. ఈ కథకి ఇతడితోనే కలిసి ఐశ్వర్య స్క్రీన్ ప్లే రాసింది- ఇది స్క్రీన్ ప్లే అనుకుంటే!

First Published:  11 Feb 2024 12:11 PM GMT
Next Story