Telugu Global
MOVIE REVIEWS

Jawan Movie Review | జవాన్ మూవీ రివ్యూ {3/5}

Jawan Telugu Movie Review | 2023 జనవరిలో ‘పఠాన్’ తర్వాత ఇప్పుడు ‘జవాన్’ తో తెరపై కొచ్చాడు షారుఖ్ ఖాన్.

Jawan Movie Review | జవాన్ మూవీ రివ్యూ {3/5}
X

Jawan Movie Review | జవాన్ మూవీ రివ్యూ {3/5}

చిత్రం: జవాన్

రచన -దర్శకత్వం : అట్లీ

తారాగణం : షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, దీపికా పడుకొనే, ముఖేష్ చబ్రియా తదితరులు

సంగీతం : అనిరుధ్ రవిచందర్

ఛాయాగ్రహణం : జి. కె. విష్ణు

బ్యానర్ : రెడ్ చిల్లీస్ ఎంటర్టయిన్మెంట్

నిర్మాతలు : గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ

విడుదల : 7 సెప్టెంబర్ 2023

రేటింగ్: 3/5

2023 జనవరిలో ‘పఠాన్’ తర్వాత ఇప్పుడు ‘జవాన్’ తో తెరపై కొచ్చాడు షారుఖ్ ఖాన్. మూడు తమిళ భారీ హిట్లు తీసిన దర్శకుడు అట్లీ (అరుణ్ కుమార్) 2019 నుంచీ దీని ప్లానింగ్ లో వున్నాడు. సంచలనం సృష్టించిన ‘పఠాన్’ తర్వాత ఎక్కువ సమయం తీసుకోకుండా ‘జవాన్’ ని విడుదల చేయడంతో దీనికీ ‘పఠాన్’ ని మించిన ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లు దాటింది. 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ‘పఠాన్’ విదేశాల్లో స్పై యాక్షన్ మూవీగా తీస్తే, ‘జవాన్’ ని దేశంలో సామాజికాంశాల్ని స్పృశిస్తూ తీశారు. ఒక సైనిక జవాన్ వ్యవస్థ మీద తిరగబడే కథాంశంతో తీసిన ఈ మూవీ, భావోద్వేగాలపరంగా ప్రేక్షకుల్ని బలంగా ఆకర్షిస్తోంది. ఇదెలా వుందో ఓ సారి చూద్దాం...

కథ

ఆరుగురు అమ్మాయిల బృందంతో ఓ గుండు వ్యక్తి (షారుఖ్) ముంబాయిలో మెట్రో ట్రైన్ ని హైజాక్ చేసి 40 వేల కోట్లు డిమాండ్ చేస్తాడు. ఆ డబ్బు రైతుల ఖాతాల్లో జమ చేసి పరారవుతాడు. అతడ్ని పట్టుకోవడానికి ఎన్ ఎస్ జీ అధికారిణి నర్మద (నయనతార) రంగంలోకి దిగుతుంది. ఆ గుండు వ్యక్తికి ఒక జైలర్ పోలికలున్నాయని తెలుసుకుంటుంది. మహిళా ఖైదీల కారాగారానికి జైలర్ గా వుంటున్న ఆజాద్ (షారుఖ్) ఆ జైల్లోని ఖైదీల్లో ఆరుగురు అమ్మాయిలతో మెట్రో హైజాక్ పథకమేశాడు. ఆ అమ్మాయిల్లో లక్ష్మి (ప్రియమణి) ఒకతి. ఈమెకి జరిగిన అన్యాయమేమిటి? ఆజాద్ ఎందుకు రైతులకి డబ్బు పంచాడు? ఇలాగే ఇంకేం సామాజిక సమస్యలు పరిష్కరించాడు? ఇతడికీ ఆర్మీ జవాన్ విక్రమ్ (షారుఖ్) కీ వున్న సంబంధమేమిటి? మధ్యలో ఆయుధ వ్యాపారి కాళీ గైక్వాడ్ (విజయ్ సేతుపతి) చేసే కుట్రలేమిటి? ఇవి తెలుసుకోవాలంటే వెండి తెరని ఆశ్రయించాల్సిందే.

ఎలావుంది కథ

1982 లో ఎన్టీఆర్ కి రాజకీయ బాట వేసిన ‘బొబ్బిలి పులి’ లో ఎన్టీఆర్ సైనికుడి పాత్ర దేశంలో దేశద్రోహుల, అవినీతిపరుల పనిబట్టే కార్యక్రమానికి పూనుకుంటాడు. ‘జవాన్’ లో షారుఖ్ ఖాన్ పాత్ర ఇదే పని చేస్తుంది. రైతుల ఆత్మహత్యలు, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లేక శిశుమరణాలు, సైన్యానికి నకిలీ ఆయుధాలు, క్రోనీ కేపిటలిజం వంటి సమస్యల చుట్టూ ఈ కథ సాగుతుంది. ఇవన్నీ దేశంలో నడుస్తున్న చరిత్రని ప్రతిబింబిస్తాయి. చివర్లో రాజకీయ వ్యవస్థని వేలెత్తి చూపుతూ, ప్రజలు తమ ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలన్న బలమైన సందేశంతో ముగుస్తుంది.

ఈ రాజకీయ- సామాజిక కథని అన్ని కమర్షియల్ మసాలాల్నీ, హీరోయిజాన్నీ దట్టించి, ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకి చేరేలా యాక్షన్ థ్రిల్లర్ గా తీశారు. అలాగని ఇందులో దేశభక్తి నినాదాలు, ఎవరి మనోభావాల్ని దెబ్బతీయడాలూ లేవు. ఇలాటి సమస్యల మీద బాలీవుడ్ నోరు విప్పడం లేదన్న విమర్శల్ని తుడిచివేస్తూ ఈ సినిమా నోరు విప్పింది. అదే సమయంలో, దేశంలో అసలు సమస్యల నుంచి దృష్టి మళ్ళించే ప్రాపగండా సినిమాలకి, గోదీ మీడియాకీ గట్టి జవాబు చెప్పింది.

ఈ యాక్షన్ థ్రిల్లర్ లో లాజిక్ చూడకూడదు. హీరో ఏం చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో సాధ్యాసాధ్యాలు చూడకూడదు. సందేశం వెళ్ళిందా లేదా అన్నదే ముఖ్యం. మెట్రో ట్రైన్ హైజాక్, ఒక క్లిక్ తో 40 వేల కోట్లు ఖాతాలో పడడం, అవి చిటికెలో మళ్ళీ 7 లక్షల మంది రైతుల ఖాతల్లో కి వెళ్ళి పోవడం, హీరోకెలా సాధ్యమో లాజిక్కులు తీస్తే నాటకీయత చచ్చిపోతుంది.

మెగావాట్ యాక్షన్ సీన్స్ కళ్ళప్పగించి చూడడం, ప్రజానీకం బాధలు పడే మెలోడ్రామా సీన్లకి కళ్ళనీళ్ళు పెట్టుకోవడం మనం చేయాల్సిన పని. జవాన్ గా, జైలర్ గా అనేక ట్విస్టులతో, సస్పెన్సులతో, థ్రిల్స్ తో మెరుపు వేగంతో సాగిపోయే సినిమాలో తమిళ వాసన కూడా ఎక్కువే వుంటుంది.

నటనలు- సాంకేతికాలు

షారుఖ్ పాత్రకి సామాజిక కోపం ఎక్కువుండడంతో పఠాన్ కంటే ఎక్కువ జీవంతో వుంటుంది. దీనికి తోడు రకరకాలుగా రూపం మారిపోవడం. జవాన్ గా సీనియర్ పాత్ర, జైలర్ గా జూనియర్ పాత్ర రెండిటినీ విజృంభించి నటించాడు. సౌత్ సినిమాల్లో వుండే బిల్డప్పులు, ఎలివేషన్లు కొత్తగా హిందీ ప్రేక్షకులకి పరిచయమయ్యాయి. ఈ క్రెడిట్ అట్లీకి పోతుంది.

పోలీసు పాత్రలో నయనతార షారుఖ్ పాత్రకి దీటుగా లేకుండా పోయింది. అతడ్ని పట్టుకునే యాక్షన్ ట్రాక్ చాలా సార్లు తెగిపోతుంది. వాళ్ళిద్దరి సీన్స్ కూడా థ్రిల్ చేయవు. సెకండాఫ్ లో వచ్చే దీపికా పడుకొనే పాత్ర విషాదభరితంగా వుంటుంది. ప్రియమణి బాధిత రైతు కూతురి పాత్ర పోషించింది. చెప్పుకోవాల్సింది విలన్ గా నటించిన విజయ్ సేతుపతి గురించి. తను తమిళ యాస హిందీతో కూల్ గా, పవర్ఫుల్ గా నటించాడు.

అనిరుధ్ రవిచందర్ పాటలతో, నేపథ్య సంగీతంతో అలరిస్తే, జికె విష్ణు కెమెరా పనితనం విజువల్స్ తో కట్టిపడేస్తుంది. మెగావాట్ యాక్షన్ సీన్స్ మాత్రం చప్పట్లు మోగిస్తాయి. కొన్ని షారుఖ్ డైలాగ్స్ కి కూడా మాస్ చప్పట్లు పడతాయి. జైలర్ గానీ, జవాన్ గానీ ఇంత హిట్టయ్యాయంటే అది నవతరం తమిళ దర్శకుల మారిన దృక్పథం, దృక్కోణం. అట్లీ కొన వూపిరితో వున్న బాలీవుడ్ కి ఆక్సిజన్ ప్రదాత!



First Published:  8 Sep 2023 11:40 AM GMT
Next Story