Telugu Global
MOVIE REVIEWS

Japan Movie Review | ‘జపాన్’ మూవీ రివ్యూ {2/5}

Japan Movie Review Telugu | ఖైదీ, దొంగ, సుల్తాన్, పొన్నియిన్ సెల్వన్ వంటి కథా చిత్రాల తమిళ స్టార్ కార్తీ మార్కెట్ ఇటీవల తెలుగులో ప్రశ్నార్ధకమవుతున్న నేపథ్యంలో తాజాగా ‘జపాన్’ విడుదలైంది.

Japan Movie Review | ‘జపాన్’ మూవీ రివ్యూ {2/5}
X

Japan Movie Review | ‘జపాన్’ మూవీ రివ్యూ {2/5}

చిత్రం : జపాన్

రచన- దర్శకత్వం : రాజు మురుగన్

తారాగణం : కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్, సునీల్, జితన్ రమేష్, కె ఎస్ రవికుమార్ తదితరులు

సంగీతం : జి.వి. ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం : రవి వర్మ

బ్యానర్ : డ్రీమ్ వారియర్ పిక్చర్స్, నిర్మాత : ఎస్ ఆర్ ప్రభు

విడుదల : నవంబర్ 10, 2023

రేటింగ్: 2/5

ఖైదీ, దొంగ, సుల్తాన్, పొన్నియిన్ సెల్వన్ వంటి కథా చిత్రాల తమిళ స్టార్ కార్తీ మార్కెట్ ఇటీవల తెలుగులో ప్రశ్నార్ధకమవుతున్న నేపథ్యంలో తాజాగా ‘జపాన్’ విడుదలైంది. ట్రైలర్ లో కార్తీ పాత్ర తీరు ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. పైగా కార్తీ నటించిన 25వ సినిమా కావడంతో ఏదో ప్రత్యేకత వుంటుందన్న కుతూహలమేర్పడింది. అంతేగాకుండా కార్తీతో ఖైదీ, సుల్తాన్, ధీరన్ అధిగారం ఒండ్రు వంటి సినిమాలు తీసిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ కావడంతో, టైటిల్ కూడా కొత్తగా వుండడంతో సినిమా పట్ల నమ్మకమే

ర్పడింది. జాతీయ స్థాయిలో ఉత్తమ చలన చిత్రం అవార్డు పొందిన ‘జోకర్’ తీసిన దర్శకుడు రాజు మురుగన్ పై కూడా విశ్వాసమేర్పడింది. మరి కార్తీ -డ్రీమ్ వారియర్- రాజు మురుగన్ వంటి బిగ్ నేమ్స్ కనిపిస్తున్న ‘జపాన్’ ఆ స్థాయిని నిలబెట్టుకుందా? నిన్న ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు క్యాన్సిల్ చేసి డబ్బులు వెనక్కి ఇచ్చారు. సినిమాకి రెస్పాన్స్ అంత పూర్ గా వుందా? ఎందుకు? తెలుసుకుందాం...

కథ

నగరంలో ఒక పెద్ద నగల షాపులో భారీ దోపిడీ జరుగుతుంది. 200 కోట్ల విలువైన నగలు దోచుకు పోతారు. హోమ్ మంత్రి (కె ఎస్ రవికుమార్) వెంటనే పోలీసు బృందాల్ని రంగంలోకి దింపుతాడు. ఒక బృందం ఇన్స్ పెక్టర్ శ్రీధర్ (సునీల్) ఆధ్వర్యంలో, ఇంకోటి ఇన్స్ పెక్టర్ భవానీ (విజయ్ మిల్టన్) ఆధ్వర్యంలో. రెండు బృందాలూ ఈ దోపిడీ ఘరానా నగల దోపిడీ దొంగ గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) చేశాడని పసిగట్టి వేట మొదలెడతాయి. జపాన్ చిన్నప్పట్నుంచీ దొంగతనాలు చేసుకుని బ్రతుకుతున్నాడు. పెద్దయి బంగారం పిచ్చితో నగల షాపుల్ని దోచుకోవడం మొదలెట్టాడు. అతడి మీద వివిధ రాష్ట్రాల్లో 182 కేసులున్నాయి. సినిమాల పిచ్చి కూడా వున్న అతను సినిమా హీరోయిన్ సంజు (అనూ ఇమ్మాన్యుయేల్) తో తను హీరోగా సినిమా కూడా తీశాడు. ఆమెతో పిచ్చిగా ప్రేమలో పడ్డాడు. అయితే అతడికి ఎయిడ్స్ వ్యాధి వుంది. ఒకానొక సినిమా షూటింగ్ సమయంలో భవానీ బృందం అతడ్ని రౌండప్ చేసేస్తుంది. ఈ దోపిడీ తను చేయలేదని జపాన్ వాదిస్తాడు. తప్పించుకుని తన పేరు మీద దోపిడీ చేసిందెవరో పట్టుకునే వేట ప్రారంభిస్తాడు...ఇదీ విషయం.

ఎలావుంది కథ

తమిళ నాడులో ఒక ఘరానా దొంగ కథతో ఈ సినిమా తీశామన్నారు. తెలుగునాడులో కూడా స్టూవర్ట్ పురం దొంగకథతో ఇటీవలే తీశారు. అలాటి ‘టైగర్ నాగేశ్వరరావు’ కి ‘జపాన్’ తమ్ముడు. ఇద్దరూ ఇద్దరే. ‘టైగర్ నాగేశ్వరరావు’ లో వుండాల్సిన పోలీసు- దొంగాట యాక్షన్ కథ లేదనుకున్నాం. ‘జపాన్’ లో అదే పోలీసు -దొంగాట యాక్షన్ కథే వుంది. కానీ మధ్యలో దోపిడీ చేసింది జపాన్ కాదు, ఇంకెవరో అనేసరికి మొత్తం ఆవిరైపోయింది!

వృత్తి నేరస్థుడ్ని చూపిస్తూ నేరస్థుడు అతను కాదు, ఇంకెవరో అంటే వృత్తి నేరస్థుడు అప్రధానమై, అజ్ఞాత నేరస్థుడి కథై పోతుంది. వృత్తి నేరస్థుడ్ని నిర్దోషిగా నిరూపించే కథే సిల్లీగా వుంటుంది. పైగా ఆ అజ్ఞాత నేరస్థుడెవరో సస్పెన్సులో పెట్టి, చివర్లో రివీల్ చేస్తే సినిమాలకి పనికిరాని ఎండ్ సస్పెన్స్ కథైపోతుంది! అయితే డ్రీమ్ వారియర్ బ్యానర్ అధిపతి ప్రభు దర్శకుల మీద నమ్మకం లేక, స్వయంగా స్క్రీన్ ప్లే కోర్సు చేసి వచ్చి సినిమాలు తీస్తున్నప్పుడు, ఇలాటి హీరో అప్రధానమయ్యే ఎండ్ సస్పెన్స్ కథతో ఎలా తీసినట్టు?

ఫస్టాఫ్ దోపిడీతో ప్రారంభమవుతుంది. అక్కడ దొరికిన ఆధారాలతో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులకి ఓ అమాయకుడు చిక్కుతాడు. అతడ్ని టార్చర్ చేస్తూంటే ఆ దోపిడీ వెనుక జపాన్ వున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు జపాన్ ని చూపిస్తే అతను రిచ్ జీవితం వెలగబెడుతూ వుంటాడు. పోలీసు ఇన్వెస్టిగేషన్, జపాన్ రిచ్ నెస్ సమాంతరంగా సాగుతూ ఇంటర్వెల్లో అతడ్ని పట్టుకుంటారు. దోపిడీ చేసింది తను కాదంటాడు. ఈ పేలవమైన, సరైన కాన్ఫ్లిక్ట్ లేని ఇంటర్వెల్ తో ఫస్టాఫ్ ముగుస్తుంది.

ఇక సెకండాఫ్ లో ఎవరో తెలియని అజ్ఞాత నేరస్థుడు కోసం వేట. చివరికి అతనెవరో రివీల్ అయ్యేసరికి అన్ని ఎండ్ సస్పెన్స్ సినిమాల్లోలాగే (తాజా ‘సజీనీ షిండే కా వైరల్ వీడియో’ సహా) పేలవంగా వుంటుంది. అయితే జపాన్ మీద ముగింపు సన్నివేశం మాత్రం కాస్త లాజిక్ తో కూడిన భావోద్వేగాలతో వుంటుంది.

ఐరనీ ఏమిటంటే ఈ కథకి స్టూవర్ట్ పురం (‘టైగర్ నాగేశ్వరరావు’) కనెక్షన్ కూడా ఇచ్చారు. నగరంలో గుడిసెలు వేసుకుని స్టూవర్ట్ పురం నుంచి వచ్చిన కుటుంబాలు వుంటాయి. మురుగుని జల్లెడ పట్టి బంగారాన్ని తీసే వృత్తిలో వుంటారు. వీళ్ళలో ఒక అమాయకుడ్ని పట్టుకుని టార్చర్ చేస్తారు పోలీసులు. ఈ సబ్ ప్లాట్ ఏమాత్రం ఆసక్తికరంగా వుండదు. అమాయకుడు, భార్యతో అతడి గొడవలు - సాగదీసిన ఈ ఉపకథతో ప్రయోజనం కనిపించదు.

ఇంటర్వెల్లో జపాన్ ని పట్టుకుంటే, ఆ దోపిడీ తానే చేశానని, ఎందుకు చేశాడో తన గేమ్ చెప్పి దేశంలో దుమారం రేపితే- దాన్ని కవర్ చేసుకునే పాట్లతో రాజకీయ వ్యాపార శక్తులు ఇరకాటంలో పడే - మరో స్థాయికి తీసికెళ్ళే ఇంట్రెస్టింగ్ డ్రామాకి తెర తీస్తాడేమో అని ఆశిస్తే, పాసివ్ క్యారక్టర్ గానే వుండిపోతాడు - కథని అజ్ఞాత పాత్ర మీదికి తోసేసి!

నటనలు- సాంకేతికాలు

‘జపాన్- మేడిన్ ఇండియా’ అనేది కార్తీ ఊతపదం. లైఫ్ ని ఫుల్లుగా ఎంజాయ్ చేసే కలర్ఫుల్ క్యారక్టర్. వేషం, భాష, వైఖరి, నటన అన్నీ కొత్తగా వుంటాయి. పాత్ర కొత్తదనం మీద దృష్టిపెట్టిన దర్శకుడు, పాత్రతో కథా కథనాల్ని గాలికి వదిలేశాడు. నెగెటివ్ క్యారక్టరే అయినా మధ్యలో ఎయిడ్స్ వ్యాధి పెట్టడంతో మూడ్ అంతా చెడిపోతుంది. ఇక కలర్ఫుల్ క్యారక్టర్ గా ఎంజాయ్ మెంటు నివ్వడు. పైగా ఇంటర్వెల్లో కథనే వదిలేయడంతో వెరైటీ పాత్ర సహా కార్తీ బాక్సాఫీసు నుంచి పలాయనం చిత్తగించినట్టయ్యింది! మేడిన్ ఇండియా పేరుతో!

హీరోయిన్ అక్కడక్కడా కలిపి ఓ పది నిమిషాలు మాత్రం పొదుపుగా వుంటుందేమో. ఇంతకంటే పాత్ర లేదు. ఆమె ప్రేమ ఎంత బలమైనదో చెప్పడానికే హీరోకి ఎయిడ్స్ వ్యాధి వుందేమో. అతడితో పడకని పంచుకుని ప్రేమ బలం నిరూపించుకుంటుంది. కార్తీకి సినిమాల పిచ్చి వుండడం, ఈమెతో సినిమా తీయడం, ప్రేమలో పడడం, ఇదంతా రజనీకాంత్ ‘జైలర్ లోనూ కనిపిస్తుంది. ‘జైలర్ లో సునీల్ తమన్నాతో సినిమా తీయడం, ఆమెతో ప్రేమలో పడడం వగైరా కామెడీ ట్రాకు.

కాకతాళీయంగా ఇందులో సునీల్ వున్నాడు ఇన్స్ పెక్టర్ గా. కానీ తనది అరకొరగా డెవలప్ చేసిన పాత్ర. ఇక ఇతర పాత్రల్లో తమిళ నటులున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతంతో ఏదో కొత్తదనం కోసం తపించినట్టుంది. అది సాధ్యం కాలేదు. ఇలా ప్రాక్టీసు తెర వెనుక చేసుకోవాలి. రవివర్మ ఛాయాగ్రహణం- విజువల్స్ మాత్రం ఉన్నతంగా వున్నాయి. ప్రొడక్షన్ విలువలూ అద్భుతంగానే వున్నాయి. మరి సినిమాలో వుండాల్సిన దర్శకుడి రచనా ప్రతిభా పాటవాలు?



First Published:  10 Nov 2023 8:30 AM GMT
Next Story