Telugu Global
MOVIE REVIEWS

Family Star movie review: ఫ్యామిలీ స్టార్ రివ్యూ! {2.25/5}

Family Star movie review in Telugu: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా దిల్ రాజు నిర్మాతగా, పరశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ ఎక్కువ హైప్ క్రియేట్ చేయకుండానే ఈ రోజు విడుదలైంది.

Family Star movie review: ఫ్యామిలీ స్టార్ రివ్యూ! {2.25/5}
X

చిత్రం: ఫ్యామిలీ స్టార్

రచన-దర్శకత్వం : పరశురామ్

తారాగణం: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, రోహిణీ హట్టంగడి, జగపతి బాబు, రవిప్రకాశ్, వెన్నెల కిశోర్ తదితరులు

సంగీతం : గోపీ సుందర్, ఛాయాగ్రహణం : కేయూ మోహనన్,

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్

విడుదల ; ఏప్రిల్ 5, 2024

రేటింగ్: 2.25/5

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా దిల్ రాజు నిర్మాతగా, పరశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ ఎక్కువ హైప్ క్రియేట్ చేయకుండానే ఈ రోజు విడుదలైంది. దీనికి తగ్గట్టే బుకింగ్స్ వున్నాయి. స్టార్ సినిమా ఓపెనింగ్స్ కి మల్టీప్లెక్సులకి ముందే చేరుకుంటారు ప్రేక్షకులు. విజయ్ దేవరకొండ సినిమాకి పోటెత్తుతారు. అలాటిది ప్రధాన కూడలి మల్టీప్లెక్స్ లో ఆట ఇంకో పది నిమిషాల్లో పడుతోందనగా బయట ఈ రివ్యూ కర్త, ఇంకో ప్రేక్షకుడు బిక్కుబిక్కుమంటూ వున్నారు. ఆట ప్రారంభమైపోయాక చూస్తే ఓ 50 మంది మాత్రం వున్నారు. ఇది షాకింగ్ సీన్. మరి సినిమా ఇంకెంత షాకింగ్ గా వుంటుందోనని చూస్తే, ఫ్యామిలీ స్టార్ స్పార్క్ ఎలా వుందంటే.

కథ

మధ్యతరగతికి చెందిన గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) ఇద్దరన్నల కుటుంబ బాధ్యతల్ని మోస్తూ త్యాగశీలిగా వుంటాడు. సివిల్ ఇంజనీరింగ్ చేసిన అతను ఓ చిన్న కంపెనీలో కొద్ది పాటి జీతానికి పని చేస్తూ ఇద్దరన్నలు, వాళ్ళభార్యలు, ఐదుగురు పిల్లలు, ఓ బామ్మ లని పొదుపుగా పోషించుకుంటూ వుంటాడు. పెద్దన్న మద్యం బానిస. తమ్ముడి సహకారంతో సివిల్స్ రాయాల్సిన వాడు తమ్ముడితో ఓ ఫ్లాష్ బ్యాక్ వల్ల ఇగో హర్ట్ అయి మద్యాన్ని ఆశ్రయించాడు. ఆ వైన్ షాపు బిల్లులు తమ్ముడే కడుతూ వుంటాడు. రెండో అన్న ఏదో వ్యాపార ప్రయత్నాల్లో వుంటాడు.

ఇలా వుండగా వీళ్ళ పై పోర్షనులో ఇందూ (మృణాల్ ఠాకూర్) అద్దెకి దిగుతుంది. ఈమె సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నట్టు చెప్పుకుంటుంది. పోనుపోను ఇద్దరూ దగ్గరవుతారు. అప్పుడు ఇందూ గురించి అసలు విషయం తెలిసి ఫైర్ అవుతాడు గోవర్ధన్. ఆమె మధ్యతరగతి కుటుంబాలపై థీసిస్ రాస్తోంది. తమ కుటుంబం పరువే తీసి రాసినందుకు గొడవ చేసి కొడతాడు. ఆ తర్వాత తన రిచ్ నెస్ ని ఆమెకి చూపించుకోవడానికి ఓ పెద్ద కంపెనీలో జాయినై, కోటి రూపాయలు అడ్వాన్సు తీసుకుని, ఆ డబ్బంతా ఖర్చు పెట్టేసి రిచ్ మాన్ హోదా పొందుతాడు. కంపెనీలో జాయినవుతాడు. జాయినైతే ఆ కంపెనీ యజమాని (జగపతి బాబు) కూతురే ఇందూ. పైగా కంపెనీ సీఈఓ కూడా!

దీంతో దెబ్బతిని పోతాడు. అయినా ఈ కంపెనీలో సంపాదించి సొంత కంపెనీ పెట్టుకుంటానని చాలెంజీ చేస్తాడు. అతడి చాలెంజీ నెరవేరిందా? ఇందూతో సంఘర్షణ ఎలా తీరింది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఉదయం నుంచే ఈ సినిమా గ్యాంగ్ లీడర్, గీత గోవిందం, అమ్మో ఒకటో తారీఖు కథల్ని కలిపి కొట్టారని ట్వీట్లు రాసాగాయి. ఇందులో కుటుంబం సెటప్ చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ (1991) లో కుటుంబ సెటప్పే. ఒక అన్న కూడా సివిల్స్ రాస్తూంటాడు. అక్కడ చిరంజీవి బామ్మ నిర్మలమ్మ అయితే, ఇక్కడ విజయ్ బామ్మ రోహిణీ హట్టంగడి. ఇక అందులో ప్లానుగా విజయశాంతి అద్దెకి దిగితే, ఇందులో కూడా ప్లానుగా మృణాల్ ఠాకూర్ అద్దెకి దిగింది.

సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఇంకా ఈ రోజుల్లో 1991 నాటి కుటుంబాలనే చూపించడం దగ్గర. అందుకని ఫస్టాఫ్ పురాతన సీన్లతో, పురాతన కథలా వుంటుంది. 33 ఏళ్ళ నాటి ఈ కుటుంబానికి సినిమా చూసే నేటి గృహిణులు కూడా కనెక్ట్ కాలేరు యూత్ సంగతలా వుంచి. ఇలాటి వాళ్ళు ఇప్పుడు మన ఇళ్ళల్లో ఎక్కడున్నారమ్మా అనుకుంటారు గృహిణులు. మరిది మీద అలా పడి తినకుండా ఆ తోటి కోడళ్ళయైనా ఉద్యోగాలు చేయకూడదా మనలాగా అనుకుంటారు. ఇక సివిల్ ఇంజనీర్ హీరో చాలీ చాలని సంపాదన చూసి నేటి యూత్ జుట్టు పీక్కునే పరిస్థితి. నేటి సినిమాలు రెండే థీమ్స్ తో పని చేస్తాయి- అయితే ఎకనామిక్స్ లేకపోతే రోమాంటిక్స్. ఇందులో రెండూ లేవు, నేటి కాలపు కథ అయితేగా? ఇలా సినిమాకి మార్కెట్ యాస్పెక్ట్ అంటూ లేకపోయాక, క్రియేటివ్ యాస్పెక్ట్ కూడా ప్రశ్నార్ధకంగా మారింది. కథతో ఏం చేయాలో అర్ధం గాలేదు దర్శకుడికి. నిర్మాత దిల్ రాజుకి కూడా ఇలా పాత చా దస్తాలతో వుంటేనే ఫ్యామిలీ ప్యాకేజీ సినిమా తీసినట్టు లెక్క ఎంత కాలమైనా.

ఫస్టాఫ్ 45 నిమిషాలు పాత కుటుంబ కష్టాలతో విజయ్ దేవరకొండ స్పార్క్ లేని నటన కనిపిస్తుంది. 45 నిమిషాల తర్వాత మృణాల్ ఠాకూర్ వచ్చాక కాస్త హుషారెక్కుతుంది. కానీ ఆ రోమాన్సూలో స్పార్క్ వుండదు- చిరంజీవి, విజయశాంతిల కెమిస్ట్రీ లాగా. దాంతో ‘వానా వానా వెల్లువాయే’ బప్పీలహరీ చార్ట్ బస్టర్ పాటలాగా.

ఇంతవరకూ ఎలా వున్నా, కనీసం ఇంటర్వెల్ సీనులో రెచ్చగొట్టిన భావోద్వేగాలకి లాజిక్ లేక దీని ప్రభావం సెకండాఫ్ మీద పూర్తిగా పడింది. మధ్య తరగతి కుటుంబాల మీద థీసిస్ అని మృణాల్ పేర్లతో సహా విజయ్ కుటుంబం గురించి రాయడమేమిటో అర్ధం గాదు. ఓ కంపెనీ కాబోయే సీఈఓ గా ఆమె థీసిస్ ఇంత ఘోరంగా వుంటే, విజయ్ యూనివర్సిటీలో ఆమెని కొట్టి, థీసిస్ ని చింపేయడంలో కూడా లాజిక్ కనిపించదు. నేనిలాగే హీనంగా బ్రతికుతాను నా గురించి మాత్రం రాయవద్దన్నట్టుంది. దీనికంటే తన కుటుంబంలో ఆమె రాసిన లోపాల మీద చర్చించి మార్పులు తీసుకొచ్చే ఆలోచనలు చేయొచ్చు. శ్యామ్ బెనగళ్ తీసిన క్లాసిక్ ‘సూరజ్ కా సాత్వా ఘోడా’ లో మెచ్యూర్డ్ నాయకా నాయిక పాత్రల్లాగా.

లా చేయకపోగా, తన కుటుంబాన్నే అవమానించిందని. రిచ్ గా మారి చూపిస్తానని ఇగోకి పోయి తప్పటడుగులే వేస్తాడు- పెద్ద కంపెనీలో జాయినై కోటి అడ్వాన్సు తీసుకుని దాంతో కుటుంబాన్ని రిచ్ గా మార్చేసి చూపిస్తాడు. తీరా అదే కంపెనీకి ఆమె సీఈఓ అని తెలిసి- ప్లేటు ఫిరాయించేస్తాడు- ఇప్పుడు ఇదే కంపెనీలో సంపాదించి సొంత కంపెనీ పెడతానని! ఇది మరీ సిల్లీగా వుంది. ఇప్పుడూ ఇగో అనేది వుంటే, ఆ ఉద్యోగాన్ని తిప్పికొట్టి, ఆ థీసిస్ రాసినందుకు క్షమాపణ చెప్పించి తీరతానని అనాలి. ఆమెతో కాన్ఫ్లిక్ట్ పాయింటుకి రావాలి. ఇలా ఇంటర్వెల్లో క్యారక్టర్ ఏం చేయాలో స్పష్టత లేకపోవడంతో సెకండాఫ్ పూర్తిగా బెడిస్ కొట్టింది!

సెకండాఫ్ ఓ ప్రాజెక్ట్ పేరుతో న్యూయార్క్ కి షిఫ్ట్ అవుతారు. ఈ న్యూయార్క్ లో కథ ఆసాంతం పెద్ద బోరు. ఫస్టాఫ్ కథ నుంచి తెగిపోయిన ఈ కథలో విజయ్ ఏ మాత్రం ఆత్మాభిమానం లేక తన మీద తను జోకు లేసుకుంటూ దయనీయంగా కనిపిస్తాడు. తన మీద జాలిపుట్టేలా చేసుకుంటూ మృణాల్ చేతికింద పని చేస్తూంటాడు. ఆమె అస్సలు కేర్ చేయదు. పూర్తిగా వ్యక్తిత్వం లేని పాసివ్ క్యారక్టర్ గా మారిపోతాడు. కొందరు ఆడవాళ్ళు అతడ్ని మెల్ ప్రాస్టిట్యూట్ అనుకుని హెరాస్ చేస్తూంటే, మృణాల్ ని పిలిపించుకుని బయటపడతాడు!

సెకండాఫ్ పాత్రల్ని ఎలా నడిపించాలో దర్శకుడికి ఏ మాత్రం అర్ధం గాలేదు. ఇందుకే ఎలా పడితే అలా సాగదీసి రెండు గంటలా 45 నిమిషాలు పరీక్ష పెట్టారు! ముగింపు మరీ విడ్డూరం. ఇద్దరి పాత్రల మధ్య సరైన సంఘర్షణ లేక కథలో భావోద్వేగాలు పుట్టలేదు. భావోద్వేగాల్లేక, పాత్రచిత్రణలు లేక, కామెడీ కూడా సరీగ్గా లేక, సంభాషణా బలం లేక ఫ్లాట్ గా తయారైంది సినిమా. పదుల కోట్లతో తీసిన స్టార్ సినిమా కంటెంట్ చాలా తీసికట్టుగా వుందని ఎందుకు తెలుసుకోలేదన్నది ప్రశ్న. లేక విజయ్- పరశురామ్ ‘గీతగోవిందం’ తీసిన హిట్ కాంబినేషన్ కాబట్టి, ఎలా వున్నా ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోతుందనుకున్నట్టుంది. టీవీ సీరియల్ లా వుందని ప్రేక్షకులు ట్వీట్లు చేశారు.

నటనలు - సాంకేతికాలు

ఫస్టాఫ్ పాత కాలపు పాత్ర కావడంతో, సెకండాఫ్ ఆధునిక పాత్రయినా పాసివ్ పాత్ర కావడంతో విజయ్ పాత్రకి యూత్ అప్పీల్ కొరవడింది. ఫ్యామిలీ స్టార్ గా యూత్ కి ఏం చెప్పాలనుకున్నాడో తెలీదు. కథా కథనాలు తనకి సహకరించలేదు. నటుడిగా ఏ లోపమూ లేదు. లోపమంతా స్పార్క్ లేని పాత్ర అంటగట్టిన దర్శకుడిదే.

ఫస్టాఫ్ లో రోమాంటిక్ గా కన్పించే మృణాల్ ఠాకూర్, సెకండాఫ్ ఎప్పుడు చూసినా సీరియస్ గా ఒకే ఎక్స్ ప్రెషన్ తో వుంటుంది. ఇక జగపతిబాబు కాసేపే కనిపించే పాత్ర. కుటుంబ సభ్యుల్లో రోహిణీ హట్టంగడి బామ్మ పాత్రకి ఎక్కువ సీన్లు వుంటాయి. మిగిలిన పాత్రధాఋఌ అలంకారంగా వుంటారు.

గోపీ సుందర్ సంగీతమైనా హుషారెక్కించాల్సింది. ఆయన చేసే సెమీ క్లాసికల్ సాంగ్స్ విఫలమవుతున్నాయి. మోహనన్ ఛాయాగ్రహణం, ఇతర నిర్మాణ విలువలు దిల్ రాజు హోదాని బట్టి వున్నాయి. దర్శకుడు పరశురామ్ మార్కెట్ యాస్పెక్ట్ లేని స్క్రిప్టుకి ఎన్ని అలంకరణలు చేసినా దాని అసలు రంగుని దాచలేదు- విజయ్ దేవరకొండ ఉచ్ఛారణ లాగే - సంసయిస్తాడు, భాద్యత, యోగాసానాలు అని పలికినట్టు.

First Published:  5 April 2024 1:27 PM GMT
Next Story