Telugu Global
MOVIE REVIEWS

Bramayugam Review: భ్రమయుగం- రివ్యూ {3/5}

Bramayugam Movie Review: 72 ఏళ్ల వయస్సులో కమర్షియల్ పాత్రల్లో ఇంకా సాధించేదేమీ లేని మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఈ మధ్య వరుసగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్న సరళి కన్పిస్తోంది.

Bramayugam Review: భ్రమయుగం- రివ్యూ
X

చిత్రం: భ్రమయుగం

రచన- దర్శకత్వం : రాహుల్ సదాశివన్

తారాగణం : మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమాల్డా లిజ్ తదితరులు సంగీతం : క్రిస్టో జేవియర్, ఛాయాగ్రహణం: షెహనాద్ జలాల్

బ్యానర్స్ : నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్

పంపిణీ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (ఏపీ, తెలంగాణ)

విడుదల : ఫిబ్రవరి 24, 2024

రేటింగ్: 3/5

72 ఏళ్ల వయస్సులో కమర్షియల్ పాత్రల్లో ఇంకా సాధించేదేమీ లేని మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఈ మధ్య వరుసగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్న సరళి కన్పిస్తోంది. సైకలాజికల్ థ్రిల్లర్ ‘రోర్చాచ్’, విజిలాంటీ థ్రిల్లర్ ‘క్రిస్టఫర్’, పోలీస్ థ్రిల్లర్ ‘కన్నూర్ స్క్వాడ్’, హోమోసెక్సువల్ డ్రామా ‘కాథల్ : ది కోర్’, ఇప్పుడు పీరియడ్ హార్రర్ ‘భ్రమయుగం’ ( ది ఏజ్ ఆఫ్ మ్యాడ్ నెస్). ఇది ఆధునిక ప్రయోగాత్మక సినిమాల్లో దేశంలోనే మొదటిది. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అంతరించిపోయిన దశాబ్దాల తర్వాత, బ్లాక్ వైట్ లో తీయడం ప్రయోగాత్మకమే కాదు, సాహసం కూడా. ఈ వయసులో మమ్ముట్టి చేయాల్సింది ఇలాటివే. దీనికి అసాధారణ సినిమా నిర్మాణ శైలికి, సంక్లిష్ట కథనాలకి పేరుతెచ్చుకున్న యువ దర్శకుడు రాహుల్ సదాశివన్ ప్రాణం పోయడమొక అదనపు హంగు. ‘రెడ్ రెయిన్’, ‘భూతకాలం’ వంటి విభిన్న హార్రర్లు తీసిన ఇతను, ఈ సారి హార్రర్ తోనే చేసిన కొత్త ప్రయోగం ఇవాళ దేశవ్యాప్త చర్చ అయింది. దీని ప్రత్యేకత లేమిటో కథలోకి వెళ్ళి చూద్దాం...

కథ

17వ శతాబ్దంలో దక్షిణ మలబార్ లో బానిసల వర్తకం చేస్తున్న పోర్చుగీసు సైన్యాల బారి నుంచి తప్పించుకుంటారు దేవన్ (అర్జున్ అశోకన్), కోరన్ (మణికందన్ ఆచారి). ఆ పారిపోయే క్రమంలో అడవిలో ఒక యక్షి (అమల్డా లిజ్) కోరన్ ని చంపేస్తుంది. దేవన్ ప్రాణాలు రక్షించుకుంటూ ఒక పాడు బడిన భవనం చేరుకుంటాడు. అక్కడి వంటవాడు (సిద్ధార్థ్ భరతన్) పట్టుకుని యజమాని కొడుమాన్ పొట్టి (మమ్ముట్టి) ముందు ప్రవేశపెడతాడు. దేవన్ గాయకుడని తెలుసుకుని పాట పాడించుకుంటాడు పొట్టి. పాటకి మెచ్చి, దేవన్ ని భవనంలోనే బస చేసేట్టు చూస్తాడు.

బస చేసిన దేవన్ కి అక్కడి వాతావరణం భయం గొల్పేదిగా వుంటుంది. వంట వాడి నుంచి కొన్ని భయపెట్టే విషయాలు తెలుసుకుంటాడు. కొండమాన్ పొట్టి చూడలన్ పొట్టి వంశస్థుడు. జంధ్యం లేని బ్రాహ్మణుడు. ఇతడికి వారాహి దేవత సహాయకుడిగా చాతన్ అనే రాక్షసుడిని ప్రసాదిస్తుంది. అయితే కొండమాన్ పొట్టి చాతన్ ని హింసిస్తూ వుండడంతో చాతన్ కి పిచ్చి ముదురుతుంది. దీంతో కుటుంబం సహా చూడలన్ పొట్టిని చంపేస్తాడు. బతికున్న కొడుమోన్ పొట్టి చాతన్‌ ని ఓడించి, ఈ భవనం అటకపైన బంధించి వుంచాడు.

ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే, ఇక్కడ వంటవాడే కాదు, దేవన్ కూడా ప్రాణాపాయంలో వున్నాడు. ఎందుకంటే దేవన్ చూస్తున్న కొండమాన్ పొట్టి కొండమాన్ పొట్టి కాదు, ఇతను చాతన్. కొండమాన్ పొట్టిని తన స్థానంలో అటకపైన బంధించి కొండమాన్ పొట్టిలా నటిస్తున్నాడు. ఈ రాక్షసుడి తాంత్రిక విద్యలు ఇప్పటికే చవిచూశాడు దేవన్. తామిద్దరూ ఇంకా ఇక్కడుంటే వీడి చేతిలో చావడం ఖాయం. పారిపోవాలి! ఎలా పారిపోవాలి? పారిపోగల్గారా, లేదా? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

‘ఇది భ్రమయుగం, కలియుగానికొక వికృత రూపం. భ్రమయుగంలో దేవుడ్ని పూజించి ఏ ఉపయోగం లేదు. ఆచార సాంప్రయాదాలకి ఇక్కడ ఏ విలువా లేదు. దేవుడి నిష్క్రమణలోనే భ్రమయుగం మొదలైంది. నువ్వెంత అరిచి గీపెట్టి పాడినా దేవుడికి వినిపించదు!’ అని అసలు విషయం చెప్తాడు కొండమాన్ పొట్టి, అతడి అతిధిగా బస చేసిన దేవన్ తో.

కొండమాన్ పొట్టి కాదు, కొండమాన్ పొట్టి పాత్రలో మమ్ముట్టి ఈ డైలాగు చెప్తున్నప్పుడు మన వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తుంది. ఇప్పుడొచ్చే హార్రర్ సినిమాల్లో డైలాగులకి భయపడడం ఎప్పుడో మానేశాం. అందులో బ్లాక్ అండ్ వైట్ లో సినిమా వుంటే, అందులోనూ మమ్ముట్టిలాంటి స్టార్ దుష్టపాత్రలో ఆ డైలాగులు చెప్తూంటే వెన్నులోంచే కాదు, రివ్యూ రాస్తూంటే పెన్నులోంచీ వణుకు పుట్టుకొస్తుంది.

ఇది పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ లో చిత్రీకరించిన పీరియడ్ హార్రర్ థ్రిల్లర్. హార్రర్ ఫీల్ కి బ్లాక్ అండ్ వైట్ ని మించిన మాధ్యమం లేదని, ’70 లలోనే కలర్ సినిమాలు వస్తున్న కాలంలో ‘జగమేమాయ’ లాంటి బ్లాక్ అండ్ వైట్ హార్రర్లు కొనసాగాయి.

‘భ్రమయుగం’ బ్లాక్ అండ్ వైట్ వెలుగు నీడలతో కళాత్మకంగానూ వుంటుంది. కాకపోతే ఆర్ట్ సినిమాల నడకలా నిదానంగా కథ నడుస్తూంటుంది. ఇంత నిదానంగా సాగే సినిమాని పనిగట్టుకుని రెండుంబావు గంటల సేపు కూర్చుని ఎందుకు చూడాలంటే, పెరిగిపోయిన రకరకాల వొత్తిళ్ళతో ఘోరంగా జీవిస్తున్న మనం, ఈ కళాసృష్టిని చూస్తూ కనీసం రెండు గంటలు ధ్యానముద్రలో వుండగలం. ఈ క్రియేషన్ - వొత్తిళ్ళని దూరం చేసే మెడిటేషన్. యాభై ఏళ్ళనాటి మణికౌల్ సినిమా ‘ఉస్కీ రోటీ’ చూస్తూ ఏ మేడిటేషన్ లోకెళ్ళి పోతామో, అదే ఈ భ్రమయుగమనే మాయాలోకంలో అనుభవిస్తాం.

కథ సింపుల్. పాడుబడ్డ భవనంలో కొండమాన్ పొట్టికి చిక్కిన దేవన్, వంటవాడు ఎలా తప్పించుకు ప్రాణాలతో బయపడ్డారనేది. సాగుతున్న కొద్దీ అపాయాలు, మలుపులు, ఆందోళనలు, టెర్రర్. అరణ్యంలో పాడుబడ్డ భవనం, మూడే పాత్రలు. కొండమాన్ పొట్టి ప్రాణం దీపంలో వుంటుంది. ఆ దీపాన్ని ఆర్పడమెలా? పూర్తిగా జానపద కథల శైలిలో, నాలుగు శతాబ్దాల నాటి కథా కాలంతో, ఆనాటి పాత్రలతో హార్రర్ లో కొత్త ప్రయోగమిది. సాలీడు గూడు అల్లడం. వంటవాడు కట్టెలు కొట్టడం, బావిలో బాల్చీ పడడం వంటి కథని సింబాలిక్ గా తెలియజేసే షాట్స్ వున్నాయి. కులపరమైన, సామాజిక పరమైన, రాజకీయపరమైన, ఆర్ధికపరమైన అసమానతల ప్రస్తావనలు కూడా వుంటాయి. దేవన్ తక్కువ కులం, కొండమాన్ పొట్టి ఎక్కువ కులం. అయితే కొండమాన్ పొట్టి రూపంలో వున్నది రాక్షసుడు చాతన్. రాక్షసుడు తక్కువ కులం వాడ్ని చంపాలని ఎందుకు అనుకుంటాడు? ఇలా సాగుతూ క్లయిమాక్స్ విషయంలో కొచ్చేసరికి బిగి సడలి పోతుంది. ఇంత రుచి చూపించి చివర్లో చల్లార్చడమొక్కటే లోపం.

నటనలు- సాంకేతికాలు

మమ్ముట్టి నట విశ్వరూపం ఈ సినిమా. సౌమ్యుడుగా మొదలై రాక్షసంగా మారే పాత్ర పరిణామ క్రమం అద్వితీయంగా పోషించాడు. చూసే తీరు, పలికే తీరు టెర్రిఫిక్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. అమితాబ్ బచ్చన్ ఇంకా ఇలాటి పాత్రలు పోషించి హడలెత్తించాల్సిన అవసరముంది ఆర్ట్ మూవీస్ స్కూల్లో. మమ్ముట్టి వరుసగా చేస్తున్నది ఇదే. అయితే మమ్ముట్టి కంటే దేవన్ పాత్ర పోషించిన అర్జున్ అశోకన్ ఎక్కువ సేపు కనిపిస్తాడు. నిమ్న కులస్థుడిగా వంటవాడు కూడా అనే మాటలు పడే సన్నివేశాల్లో దైన్యాన్ని బాగా ప్రదర్శిస్తాడు. కొండమాన్ పొట్టి మాయకి జ్ఞాపక శక్తి కూడా కోల్పోయి -రెండు మూడు రోజులు కాదు, తను ఎన్నో నెలలుగా ఇక్కడుంటున్నాడని ని తెలుసుకుని షాక్ అయే దృశ్యాన్ని బాగా హేండిల్ చేశాడు. ఇక వంటవాడుగా భరతన్ పాత్రకి చివర్లో ఒక ట్విస్టు వుంది. కొండమాన్ పొట్టి చేతిలో హీనంగా బతుకుతున్న తన జన్మ రహస్యం తనకే తెలీదు. దేనికీ భయపడకుండా శాంతంగా వుండడం తన స్వభావం. ఈ పాత్రని సహజ ధోరణిలో నటించాడు.

ఇందులో సాంకేతికంగా హంగులూ ఆర్భాటాలూ వుండవు. కళాత్మకంగా ఉత్తమాభిరుచి మాత్రమే వుంటుంది. హార్రర్ తో అదరగొట్టే చీప్ ట్రిక్స్ వుండవు. వాతావరణమే ఫోక్ సంగీత బాణీలతో భయపెడుతుంది, అవతల నదులూ జలపాతాల హోరు కలుపుకుని. చిత్రీకరణకి కళాదర్శకత్వం బాగా తోడ్పడింది. బ్లాక్ అండ్ వైట్ కెమెరా వర్క్ ప్రొడక్షన్ నాణ్యతని పెంచింది. దర్శకుడు పూర్తి కమాండ్ తో కథా కథనాలతో శాసించి ప్రేక్షకుల్ని కూర్చోబెడతాడు.

First Published:  24 Feb 2024 10:44 AM GMT
Next Story