Telugu Global
MOVIE REVIEWS

Bhamakalapam Movie Review: భామాకలాపం 2- రివ్యూ {2/5}

Bhamakalapam Movie Review: 2022 లో ఆహాలో స్ట్రీమింగ్ అయిన ‘భామాకలాపం’ కి సీక్వెల్ ఈ ‘భామాకలాపం 2’. ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ‘భామాకలాపం’ వెబ్ మూవీగా హిట్టయ్యింది.

Bhamakalapam Movie Review: భామాకలాపం 2- రివ్యూ {2/5}
X

చిత్రం: భామాకలాపం 2

రచన- దర్శకత్వం: అభిమన్య తాడిమేటి

తారాగణం : ప్రియమణి, శరణ్యా ప్రదీప్, సీరత్ కపూర్, రఘు ముఖర్జీ, సుదీప్ వేద్, అనూజ్ గుర్వారా, చైతూ జొన్నలగడ్డ, రుద్ర ప్రతాప్ తదితరులు

సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి, ఛాయాగ్రహణం : దీపక్ యారగెరా

నిర్మాతలు: బాపినీడు, సుధీర్ ఈదర

విడుదల : ఆహా ఓటీటీ

రేటింగ్: 2/5

2022 లో ఆహాలో స్ట్రీమింగ్ అయిన ‘భామాకలాపం’ కి సీక్వెల్ ఈ ‘భామాకలాపం 2’. ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ‘భామాకలాపం’ వెబ్ మూవీగా హిట్టయ్యింది. అయితే థియేట్రికల్ విడుదల కూడా ప్రకటించిన తర్వాత ఏమైందో దాని సంగతి తెలీదు. క్రైమ్ కామెడీగా హిట్టయిన ఈ వెబ్ మూవీ మధ్యతరగతి పాత్ర నేటివిటీకి ఒక చారిత్రక స్పర్శగల అంశంతో కల్పన చేయడం వల్ల విషయ గాంభీర్యమేర్పడి ఆసక్తిరేపింది. ఈ పాత్రని కొనసాగిస్తూ సీక్వెల్ తీసినప్పుడు ఈసారి ప్రియమణి చేసే అడ్వెంచర్ ఏమై వుంటుందనేది సహజంగానే ఈ సీక్వెన్ ని చూసేలా చేస్తుంది. ఓ రెండు గంటలు కేటాయించుకుని ఆహాలో చూసేందుకు కూర్చుంటే ఓహో అన్పించేలా వుంటే –దిల్ మాంగే మోర్- అని అర్జెంటుగా ఇంకో సీక్వెల్ కావాలని డిమాండ్ చేసేందుకు ఉద్యమించే పరిస్థితి ఏర్పడొచ్చు. దర్శకుడు డిమాండ్ తీర్చగల సమర్ధుడన్న నమ్మకంతో. అయితే నిజంగా అంత వుందా? సీక్వెల్ చూస్తే ఇంకో సీక్వెల్ కి బాట వేసేంత విషయం ఇందులో వుందా? ఇది తెలుసుకుందాం...

కథ

మొదటి భాగంలో ఓ సాధారణ మధ్య తరగతి గృహిణిగా యూట్యూబ్ వంటకాలు చేసుకునే అనుపమ (ప్రియమణి) కి, గాసిప్స్ కోసం ఇతరుల కుటుంబాల్లోకి తొంగి చూసే వ్యసనంతో హత్య కేసులో ఇరుక్కుని బ్రతుకు జీవుడా అని ఎలాగో బయటపడుతుంది. ప్రస్తుతానికొస్తే, వేరే ఫ్లాట్ లో వుంటుంది. మళ్ళీ అక్కడా ఇక్కడా తొంగి చూడకు అని భర్త మోహన్ (రుద్రప్రతాప్) హెచ్చరిస్తాడు. అలాగేనని, యూట్యూబ్ ద్వారా సంపాదించిన డబ్బుతో, పని మనిషి శిల్ప (శరణ్యా ప్రదీప్) పార్టనర్ గా హోటల్ పెడుతుంది. డ్రైవింగ్ నేర్చుకునేందుకు డ్రైవింగ్ స్కూల్లో చేరుతుంది. ఒకడ్ని గుద్ది గొడవలో ఇరుక్కుంటే వాడు బెదిరిస్తూ వుంటాడు.

ఇంకోవైపు అంథోనీ లోబో (అనూజ్ గుర్వారా) అనే బిగ్ షాట్, సినిమా అవకాశాల కోసం ఆంథోనీని నమ్మిన జుబేదా (సీరత్ కపూర్) అనే యువతి కలిసి ఓ భారీ వంటల పోటీ నిర్వహించే పనుల్లో వుంటారు. విజేతకి ఓ బంగారు కోడిపుంజు బొమ్మని ట్రోఫీగా ఇవ్వాలనుకుంటారు. డ్రగ్ స్మగ్లింగ్ కి తోడ్పడే ఈ ట్రోఫీ విలువ వెయ్యి కోట్లు అని స్మగ్లర్లకి బేరం పెడుతూంటాడు ఆంథోనీ. ఈ ట్రోఫీ కొట్టేయాలని మాజీ నార్కోటిక్స్ బ్యూరో అధికారి సదానంద్ (రఘు ముఖర్జీ) నిర్ణయించుకుంటాడు. ఈ వంటల పోటీలో పాల్గొనే అవకాశం అనుపమ కొస్తుంది. అయితే తనని బెదిరిస్తున్న వాడిగురించి అనుపమ సదానంద్ సాయం కోరడంతో, సదానంద్ వాడ్ని చంపి అనుపమనీ, పనిమనిషి శిల్పానీ ఇరికిస్తాడు. ఇందులోంచి బయటపడాలంటే వంటల పోటీలో ట్రోఫీని దొంగిలించుకు రావాలని కండిషన్ పెడతాడు.

ఇప్పుడు ఏం చేసింది అనుపమ? మళ్ళీ చేయని హత్యలో ఇరుక్కుని ఈసారి ట్రోఫీ దొంగగా మారిందా? వంటల పోటీలో ఏం చేసింది? సదానంద్ తోబాటు ఇంకో ముగ్గురు విలన్లని ఎలా ఎదుర్కొంది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

‘భామాకలాపం’ కథ 200 కోట్లు విలువజేసే కోడి గుడ్డు గురించి అయితే ఈ సీక్వెల్ 1000 కోట్ల విలువైన కోడిపుంజు గురించి. కోడి గుడ్డు కథకి ఒక డెప్త్ వుంది. ఏసు ప్రభువు పునర్జన్మకి సంకేతంగా వున్న ‘ఎగ్’ అని చెప్తూ, ఆధ్యాత్మిక స్పర్శతో కల్పిత కథ చేశారు. ఈ కల్పితాన్ని అసలు దేవుడంటే అర్ధమేమిటో చెప్పడానికి కథలో వాడుకున్నారు. మత ప్రచారకుల మూఢనమ్మకాలకి ప్రజలెలా బలి అవుతారో, దాంతో ఎలాటి దారుణాలు జరుగుతాయో చెప్పే ఈ కాన్సెప్ట్ లో, ఇతరుల విషయాల్లో తలదూర్చి పీతూరీలు చెప్పే అలవాటుతో కూడా ఎలాటి ప్రమాదంలో పడవచ్చో హెచ్చరిక చేశారు. ఈ రెండు ట్రాక్స్ నీ ఏకత్రాటిపై నడిపిస్తూ అర్ధవంతమైన కథ చేశాడు అప్పట్లో దర్శకుడు.

దీనికి ఆర్నెల్ల ముందు, హాలీవుడ్ నుంచి వచ్చిన ‘రెడ్ నోటీస్’ అనే కామిక్ థ్రిల్లర్

‘క్లియోపాత్రా ప్రాచీన ఎగ్’ కోసం వేటగా వుంటుంది. ఈ ‘క్లియోపాత్ర ప్రాచీన ఎగ్’ అనేది సినిమా కోసం కల్పించిన కథ. చారిత్రక స్పర్శతో ఈ కల్పన వల్ల ఈ కామిక్ థ్రిల్లర్ కో విషయ గాంభీర్యం ఏర్పడింది. ఇలా ‘రెడ్ నోటీస్’, భామాకలాపం’ రెండూ కల్పించిన హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ వల్ల హూందాతనంతో, రిచ్ గా కన్పిస్తాయి.

‘భామకలాపం 2’ కి ఈ బ్యాకప్ లేదు. బంగారు కోడి పుంజు ట్రోఫీకి ఎలాటి విషయ ప్రాధాన్యం లేక కాకమ్మ కథ చెబుతున్నట్టు వుంది. కథా కథనాలన్నీ, పాత్రచిత్రణలన్నీ వెబ్ మూవీ కోరే సహజత్వం దాటి, కమర్షియల్ సినిమాల కృత్రిమత్వంతో చప్పగా తయారయ్యాయి.

‘భామాకలాపం’ చాలా విషయాల్లో క్రియేటివ్ ఘనత సాధించింది. ముఖ్యంగా ప్రియమణి పాత్ర- కథలో ఈ పాత్ర సమస్యలో పడ్డాక చివరంటా అనేక అనుభవాలు- వాటిలో కొన్ని వొళ్ళు జలదరింప జేసేవి. సమస్య లోంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు ఎదురు తిరిగి సమస్యని ఇంకా పెంచేయడం అనే డ్రైవ్ పాత్రని, పాత్రతో బాటు తననీ బిజీగా వుంచుతాయి. కథ తన చేతి నుంచి దాటిపోదు. క్షణం క్షణం థ్రిల్ చేస్తూ, ఒక పక్క అమాయకత్వం, ఇంకో పక్క భయం, తెగింపూ అనే పాత్రోచిత నటనతో సినిమాని భుజానేసుకుని నడిపిస్తుంది.

ఈ సీక్వెల్లో మాత్రం తను ఎక్కడుందో తప్పిపోయింది. ముగ్గురు విలన్లతో వాళ్ళ గొడవలే కథగా మారడంతో తను గల్లంతయిపోయింది. మొదటి 40 నిమిషాల తర్వాత తనదేంలేదు- అంతా రాత్రి పూట హోటల్ అనే ఒకే లొకేషన్లో ట్రోఫీ కోసం విలన్ల కథే!

‘భామాకలాపం’ సాంకేతికంగా కూడా - దృశ్యాల చిత్రీకరణలో ఒక సెటిల్డ్ వాతావరణం కన్పిస్తుంది. ఒకప్పుడు హైదరాబాద్ నిదానంగా, నిద్రాణంగా వున్నట్టు- దృశ్య వాతావరణం మోడరన్ హైదరాబాద్ ని ప్రతిబింబించదు. అపార్ట్ మెంట్లో జరిగినవి రెండు మర్డర్స్ అయితే, ఈ పరిస్థితి తీవ్రతకి కాంట్రాస్ట్ గా, నిదానంగా సాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్, తీరుబడిగా పాత్రల యాక్టివిటీస్ వగైరా సినిమా చూస్తున్నట్టు వుండదు- మనపక్కనే ఇలాటి దృశ్యాలు ఎలా కన్పిస్తాయో అలా వుంటాయి. చాలా పాత అపార్ట్ మెంట్ భవనం, దాని చుట్టూ పాత ఇళ్ళూ రోడ్లూ, వీటికి తగ్గ కళా దర్శకత్వం- కథ మూడ్ ని స్థాపిస్తాయి.

సీక్వెల్లో ఈ నేటివిటీ, ఫీల్ కనిపించవు. కమర్షియల్ సినిమా ఆర్భాటంతో సహజత్వానికి దూరంగా వుంటుంది. మొదటి నలభై నిమిషాలు ప్రియమణి జీవితం, స్మగ్లర్ల పథకాలు, వంటల పోటీల్లో ప్రియమణికి అవకాశం, కారు యాక్సిండెంట్ – విలన్ సాయం- హత్య, హత్యలో ప్రియమణి ఇరుక్కున్న తర్వాత ఇక చివరి వరకూ వంటల పోటీల్లో ట్రోఫీని దొంగలించడం గురించి మాస్టర్ ప్లాన్ అమలు, ఇంతే.

ఈ దోపిడీ ఎపిసోడ్ అంతా విలన్ ఫోన్లో ఇచ్చే సూచనలతో చాలా టెక్నికల్ గా, వాటిని పాటించే ప్రియమణితో చాలా ఫ్లాట్ గా వుంటుంది. అయిదు నిమిషాల తర్వాత స్కిప్ చేసి, గంట రన్ తర్వాత చివర్లో ఏం జరిగింది చూసుకుంటే సరిపోయేలా వుంది. ఈ చివర్లో విలన్లు ఒకర్నొకరు కాల్చుకునే యాక్షన్, శవాల గుట్టలు అంతా గందరగోళంగా వుంటుంది. ఇది చూశాక ఇంకో సీక్వెల్ కోసం దిల్ మాంగే మోర్ అనిపించే అవకాశం మాత్రం ఏమాత్రం వుండదు.

నటనలు- సాంకేతికాలు

ప్రియమణి పాత్రని ఫాలో అవడానికి ఆమెతో బాటు మనం ఫీలవగల అంశం ఏదీ లేకపోవడం ఒక విషాదం. పైగా ‘భామాకలాపం’ లో సంఘటనలతో అంత అనుభవమయ్యాక, మళ్ళీ నేరంలో ఇరుక్కోవడమన్నది మూర్ఖత్వమనిపిస్తుంది. యాక్సిడెంట్ ఘటనలో ఎవరో బెదిరిస్తున్నాడని విలన్ సాయం ఎలా అడుగుతుంది, పోలీసులకి చెప్పేయక? ఆ విలన్ హత్య చేసి ఇరికిస్తే వాడి కోసం దోపిడీ ఎలా చేస్తుంది, ఆ బ్లాక్ మెయిల్ ని తిప్పికొట్టక? సీక్వెల్లో క్యారక్టర్ ఎదగపోతే ఎందుకు? నిజానికి విలన్ బ్యాక్ మెయిల్ నే తిప్పికొట్టడ గురించే ఈ కథ అవ్వాలి.

జేమ్స్ హెడ్లీ ఛేజ్ రాసిన నవల్లో హెల్గా రాల్ఫ్ అనే ధనిక వివాహిత వుంటుంది. మొదటి నవల్లో బ్లాక్ మెయిలర్ ఆమె బలహీనతల్ని అడ్డుపెట్టుకుని దోచుకుంటాడు. మళ్ళీ సీక్వెల్లో ఇంకో పథకంతో వస్తాడు. ఈ సారి ఎత్తుకు పై యెత్తులేసి వాడ్ని చిత్తు చేస్తుంది. మళ్ళీ రెండో సీక్వెల్లో ఇంకో గట్టి పథకంతో వస్తాడు. ఈసారి మళ్ళీ కనిపించకుండా దెబ్బమీద దెబ్బ కొడుతుంది. ఇలా క్యారక్టర్ ఎదుగుతూ పోతూంటుంది. గొప్ప సస్పెన్స్, థ్రిల్స్ పోషిస్తుంది. ప్రియమణి క్యారక్టర్ ‘భామాకలాపం’ లో కంటే ఎదగలేదు. విలన్లే కథని హైజాక్ చేసినప్పుడు తనేం చేయాలో తెలియక మొక్కుబడిగా నటించేసింది.

పని మనిషి శిల్ప పాత్రలో శరణ్యా ప్రదీప్ మరోసారి పాత్రని నిలబెట్టుకుంది ఫన్నీ క్యారక్టరైజేషన్ తో. జుబేదా అనే ఫార్ములా పాత్రలో సీరత్ కపూర్ చేసేదేమీ వుండదు. ఇక ముగ్గురు విలన్లు సరే. కోడిపుంజు కోసం కథ వీళ్ళదే- వీళ్ళని కోడి పుంజులు చేసి గుడ్లు చేతిలో పెట్టాల్సిన ప్రియమణి కీలు బొమ్మగా మారడమొక భామా విలాపమే!

టెక్నికల్ గా రిచ్ గా వుంది. అయితే ‘భామాకలాపం’ కూడా టెక్నికల్ గా రిచ్ గానే వుంటుంది. దాంట్లో తెలుగుదనముంది. దీంట్లో కమర్షియల్ సినిమాల కృత్రిమత్వముంది. వెబ్ మూవీస్ అనేవి కమర్షియల్ సినిమాలుగా తీయడానికికాక, ప్రాంతీయ జీవితాల దర్పణాలుగా హృదయాల్ని తట్టేవిగా వుండాలేమో ఆలోచించుకోవాలి. ప్రాంతీయ ఓటీటీల్ని ఈ జీవితాలకి కనెక్ట్ అవడం కోసమే స్థాపిస్తున్నారు.


First Published:  19 Feb 2024 11:32 AM GMT
Next Story