Telugu Global
MOVIE REVIEWS

Animal Movie Review | యానిమల్ - రివ్యూ {2.75/5}

Animal Telugu Movie Review | ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ‘కబీర్ సింగ్’ హిందీ రీమేక్ తర్వాత మరో హిందీ ‘యానిమల్’ తో తిరిగి వచ్చాడు. అయిదు భాషల్లో విడుదలైన ‘యానిమల్’ ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది.

Animal Movie Review | యానిమల్ - రివ్యూ {2.75/5}
X

చిత్రం: యానిమల్

రచన - దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా

తారాగణం: రణబీర్ కపూర్, రశ్మికా మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తీ దిమ్రీ శక్తి కపూర్ తదితరులు

స్క్రీన్ ప్లే: సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా, సురేష్ బండారు

ఛాయాగ్రహణం: అమిత్ రాయ్, యాక్షన్: సుప్రీం సుందర్, నేపథ్య సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్

సంగీతం (పాటలు): జామ్ 8, విశాల్ మిశ్రా, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురాణిక్, జానీ, అషిమ్ కెమ్సన్, గురీందర్ సీగల్.

బ్యానర్లు: టీ -సిరీస్ ఫిలిమ్స్, సెయింట్ ఫిలిమ్స్ లిమిటెడ్, భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్ నిర్మాతలు: భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ ఖేతానీ, క్రిషన్ కుమార్

విడుదల: డిసెంబర్ 1, 2023

రేటింగ్: 2.75/5

‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ‘కబీర్ సింగ్’ హిందీ రీమేక్ తర్వాత మరో హిందీ ‘యానిమల్’ తో తిరిగి వచ్చాడు. అయిదు భాషల్లో విడుదలైన ‘యానిమల్’ ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. అత్యంత హింసాత్మక సినిమాగా ప్రచారం జరిగి, భారీ ఓపెనింగ్స్ తో ఈ రోజు విడుదలైంది. రణబీర్ కపూర్, రశ్మికా మందన్న, అనిల్ కపూర్ వంటి పాపులర్ స్టార్స్ తో దర్శకుడు సందీప్ రెడ్డి తీసిన తండ్రి కొడుకుల సంబంధాలతో కూడిన ఈ ఫ్యామిలీ కథ కాని ఫ్యామిలీ కథ ఎలా వుందో చూద్దాం...

కథ

ఒక స్టీల్ ఫ్యాక్టరీ యజమాని బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) కొడుకు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్) కి తండ్రి అంటే పిచ్చిప్రేమ. తండ్రిని ఒక హీరోగా, రోల్ మోడల్ గా ఆరాధిస్తూంటాడు. కానీ తండ్రి ప్రేమ దక్కదు. తండ్రి తన బిజీ వ్యవహారాలతో కొడుకు విజయ్ కి సమయమివ్వడు. విజయ్ బయట పడుతున్న గొడవలు చూసి బోర్డింగ్ స్కూల్లో వేస్తాడు తండ్రి. కాలక్రమంలో విజయ్ గీతాంజలి (రశ్మికా మందన్న)ని ప్రేమించి పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళిపోతాడు. ఎనిమిదేళ్ళ తర్వాత తండ్రి మీద హత్యాప్రయత్నం జరిగిందని తెలుసుకుని హుటాహుటీన తిరిగి వచ్చేస్తాడు. తండ్రి మీద హత్యప్రయత్నం చేసిందెవరో పట్టుకుని చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు.

ఈ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడా? తండ్రికి శత్రువుగా మారిన అబ్రార్ హక్ (బాబీ డియోల్) ని పట్టుకుని హతమార్చాడా? ఈ యుద్ధంలో మృగంలా మారి భారీ హింసకి తెరతీసిన విజయ్ విజయం సాధించాడా? తండ్రితో సానుకూల సంబంధాలు ఏర్పడ్డాయా?...ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

తండ్రీ కొడుకుల సంబంధాలతో పాత కథే. ఈ పాత కథకి ఉన్మాద కొడుకు ప్రవర్తన, ప్రతీకారం వంటి జోడింపులతో కొత్త కథగా మార్చాడు సందీప్ రెడ్డి. ‘అర్జున్ రెడ్డి’ లో హీరో కి హీరోయిన్ తో అగ్రెసివ్ ప్రేమైతే, ‘యానిమల్’ లో తండ్రితో అగ్రెసివ్ ప్రేమ. సందీప్ రెడ్డి వయోలెంట్ ఫార్ములాతోనే ప్రత్యేక గుర్తింపు పొందాలని చేస్తున్న ప్రయత్నం. రణబీర్ సింగ్ 2011 లో ‘రాక్ స్టార్’ లో మ్యాడ్ లవర్ గా అపూర్వ నటన, ఆ తర్వాత 2012 లో ‘బర్ఫీ’లో చెవిటి మూగ అనితరసాధ్య హాస్య నటనా పూర్తి చేసుకున్నతర్వాత, ‘యానిమల్’ తో హార్డ్ కోర్ క్రూర పాత్రతో పతాక స్థాయికెళ్ళి పోయి విశ్వరూపాన్ని చూపెట్టాడు. ఈ ప్రత్యేకతలే పాత కథని కొత్తగా మార్చాయి.

ఫస్టాఫ్ రణబీర్ పాత్రని పరిపూర్ణంగా ఎస్టాబ్లిష్ చేయాలనే ప్రయత్నం వల్ల సుదీర్ఘంగా గంటన్నర సాగుతుంది. రణబీర్ పాత్ర చిన్నప్పట్నుంచీ తండ్రితో సంబంధా గురించి వివరంగా చెప్పుకొచ్చారు. ఈ సంబంధాలు ఉద్రిక్తతల్ని సృష్టించడం, ఎడబాటు, ప్రేమా పెళ్ళీ, అమెరికా ప్రయాణం వగైరా సన్నివేశాలతో సాగి, ఎనిమిదేళ్ళ టైమ్ లాప్స్ తర్వాత తండ్రి మీద దాడి జరగడం, ఆ వెంటనే రణబీర్ భార్యాపిల్లలతో తిరిగి వచ్చి, శత్రువు కోసం మృగంగా మారడం వంటి బీభత్సాలతో, ఇంకా సుదీర్ఘమైన ఇంటర్వెల్ యాక్షన్ సీనుతో, ఫస్టాఫ్ పూర్తవుతుంది.

ఇంటర్వెల్లోనే కథ పూర్తయినట్టు అర్ధం వస్తుంది. ఇక సెకండాఫ్ లో కథ లేదని అర్ధమై, సెక్స్ విజ్ఞానం, సెక్స్ మీద లెక్చర్లు వంటి అశ్లీల- అసభ్య సీన్లతో సాగి, ఇంకో ప్రేయసి (తృప్తీ ధిమ్రీ) తో సంబంధాలు, దీంతో భార్యతో గొడవల సుదీర్ఘ సన్నివేశాలూ సాగుతూ సాగుతూ సెకండాఫ్ డల్ గా మారి, విలన్ ఎంట్రీతో ఊపందుకుని మళ్ళీ హింసాత్మక యాక్షన్ సీన్స్ వగైరాలతో మొత్తానికి పగ తీరుతుంది. ఫస్టాఫ్ నీటుగా, ఫ్రెష్ గా వుంటే, సెకండాఫ్ కథని తడుముకోవడంతో సరిపోయింది. అయితే ముగింపులో తండ్రీ కొడుకుల మీద దృశ్యం- తండ్రిని కొడుకుగా మారి చూడమనే సీను- నిజంగానే ఈ ఫ్యామిలీ (?) -యాక్షన్ డ్రామాకి మాస్టర్ స్ట్రోక్ అనొచ్చు.

ప్రధానంగా ఈ కథ మితిమీరిన హింస, అభ్యంరకర సెక్స్ డైలాగులు- దృశ్యాల మీద ఆధారపడింది. తండ్రి ప్రేమతో చూడలేదని తండ్రి మీద కోపం తీర్చుకునే ఉద్దేశంతో ఇలా ప్రవర్తించాడా, లేక తండ్రి మీద హత్యాయత్నానికి నిజంగానే శత్రువు మీద పగతో ఇలా ఉన్మాదిగా మారేడా అన్నది మాత్రం ప్రశ్నగానే మిగిలిపోతుంది.

నటనలు- సాంకేతికాలు

పైన చెప్పుకున్నట్టు ఇది రణబీర్ మూడో అవతారం. ఉన్మాదిలా కూడా నటించడం అతడిగే సాధ్యమైంది. ఈ పాత్రలో ఇంకొకర్నివూహించలేం. టీనేజి. యంగ్ ఏజి, మిడిలేజి పాత్రల్లో అద్భుతంగా నటించాడు. హావభావాలు, భావోద్వేగాలు ప్రకటించడంలో తనకి తానే సాటి. యాక్షన్ సీన్స్ లో రాక్షసుడిలా మారడం అతి అనిపించినా తప్పదు- సందీప్ రెడ్డి ఫార్ములానే ఇది. సినిమా ఇలాగే వుంటుంది.

ఈ హీరో ఓరియెంటెడ్ బీభత్స భయానక హింసలో, హీరోయిన్ రశ్మికా మందన్నది కరివేపాకు పాత్ర కాలేదు. సంఘర్షణ వున్న నిడివిగల పాత్రే. ఈ పాత్రకి న్యాయం చేసింది. తండ్రి పాత్రలో అనిల్ కపూర్ బలమైన నటనతో వుంటే, విలన్ గా బాబీ డియోల్ దినిరుత్సాహపర్చే బలహీన పాత్ర. క్లయిమాక్స్ లో హీరో రేంజి యాక్షన్ సీన్ కాబట్టి అక్కడ మాత్రం ఎలివేటయ్యాడు.

ఎనిమిది మంది సంగీత దర్శకుల 8 ఎనిమిది పాటలు సినిమా నిడివి అతిగా మూడు గంటలా 21 నిమిషాలు పెరగడానికి పనికొచ్చాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం హైలైట్ గా నిలుస్తుంది. సుప్రీం సుందర్ యాక్షన్ కొరియోగ్రఫీ, అమిత్ రాయ్ ఛాయాగ్రహణం బలమైన సాంకేతిక అంశాలుగా నిలుస్తాయి.

అయితే దర్శకుడు సందీప్ రెడ్డి తానే ఎడిటర్ కావడంతో తీసిన దృశ్యాల మీద ప్రేమ వల్ల, కత్తెర వేయలేక సినిమా నిడివి అంతులేకుండా పోయింది. మొత్తానికి ఉత్కంఠతో ఎదురు చూసిన ‘యానిమల్’ సెకెండాఫ్ కంటే ఫస్టాఫ్ బెస్టుగా వుంది.



First Published:  1 Dec 2023 10:30 AM GMT
Next Story