Telugu Global
Cinema & Entertainment

పూర్తికాక పోయినా విడుదల కావాల్సిందే!

హాలీవుడ్ స్టూడియోలు తరచుగా అసంపూర్తిగా వున్న చలనచిత్రాల్ని విడుదల చేస్తూంటాయి.

పూర్తికాక పోయినా విడుదల కావాల్సిందే!
X

హాలీవుడ్ స్టూడియోలు తరచుగా అసంపూర్తిగా వున్న చలనచిత్రాల్ని విడుదల చేస్తూంటాయి. పూర్తి చేయలేక పోయిన విజువల్ ఎఫెక్ట్స్ వల్ల, లేదా స్క్రిప్టులో అక్కడక్కడా షూట్ చేయలేక పోవడం వల్లా ఇలా జరుగుతూంటుంది. ‘క్యాట్స్’, (2019), ‘థోర్: లవ్ అండ్ థండర్’ (2022) అనే సినిమాలైతే అవసరానికి మించి ఓవర్ గా చేసిన సీజీఐ (కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ) తో విడుదలై ప్రేక్షకుల నిరసనని ఎదుర్కొన్నాయి. కొన్ని సినిమాలు స్క్రిప్ట్ నుంచి స్క్రీన్‌ కి వెళ్ళే క్రమంలో చాలా విషయాలు బెడిసి కొట్ట వచ్చు. ‘మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’, (1987), ‘ఏ సౌండ్ ఆఫ్ థండర్’ (2005) వంటి సగం పూర్తయిన సినిమాల విడుదలకి బడ్జెట్ కోతలు, నిర్మాణ వివాదాలు, చివరి నిమిషంలో రీ- ఎడిటింగులూ దోహదం చేశాయి. ఇలాటి సినిమాల్ని విడుదల చేయడం ద్వారా పెట్టిన డబ్బులో ఎంతో కొంత భాగాన్ని తిరిగి పొందే అవకాశం వుంటుందని ఇలా చేస్తూంటారు. ఆ రాబట్టిన సొమ్ముతో సమానంగా ప్రేక్షకుల తిట్లు కూడా తింటూ వుంటారు.

ఇలాటి చాలా సినిమాలు విడుదల కాకుండానే వుండిపోతాయి. వీటిలో కొన్ని ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతూంటాయి. ఇలాటి సినిమాల దాచిన లేదా అసలైన కట్‌లని అవి ఎంత చెడ్డవి అయినా, వాటిని వెలికి తీసి ఇంటర్నెట్ లో సర్క్యులేట్ చేయడానికి అంకితభావంతో కూడిన అభిమానుల బ్యాచులు ఎప్పుడూ పనిచేస్తూంటాయి.

‘ది బ్లాక్ కాల్డ్రన్’ (1985) కి డిస్నీ స్టూడియోస్ ఈ యానిమేషన్ ఖర్చులు తగ్గించుకోవడానికి పాఠ యానిమేషన్ షాట్స్ ని లని రీసైకిల్ చేసి విడుదల చేస్తే, భయానకంగా వున్నపిల్లల యానిమేషన్ పెద్ద ఫ్లాపయ్యింది.

‘మమ్మీ రిటర్న్స్’ (2001) : ఇది ‘ది మమ్మీ’ (2001) కి సీక్వెల్. దీనికి సీజీఐ దారుణంగా చేశారు. రీవర్క్ చేసే సమయం లేక అలాగే విడుదల చేశారు. ‘ఘోస్ట్ బస్టర్స్’ (1984) ని అసంపూర్తి ఎఫెక్ట్స్ తో అలాగే విడుదల చేశారు. ఇది హిట్టవుతుందని వూహించలేదు. షూటింగు సమయంలో ఆర్టిస్టులకి బిగించిన కేబుళ్ళు, వైర్లు అలాగే వదిలేసి విడుదల చేశారు. అయినా ఇంత అధ్వాన్నంగా వున్న ప్రొడక్షన్ ని ఆదరించి హిట్ చేశారు ప్రేక్షకులు. ’బోర్న్ ఐడెంటిటీ’ ఫ్రాంచైజీగా వచ్చిన ఒక సినిమాలోనైతే షూటింగులో ఫ్లడ్ లైట్ల కేబుళ్ళు నేల మీద పడి కన్పిస్తూంటాయి. ప్రేక్షకులంటే ఇంత నిర్లక్ష్యమన్న మాట.

‘స్పియర్’ (1998) కి బడ్జెట్ లేకపోవడం వల్ల రీ-షూట్‌లు సాధ్యం కాలేదు. మరి చూస్తే ఇది డస్టిన్ హాఫ్‌మన్, షారన్ స్టోన్, శామ్యూల్ ఎల్. జాక్సన్ లవంటి బడా స్టార్లు నటించిన మెగా మూవీ. ఇది చిత్రీకరణ సగంలోనే బడ్జెట్ కోతల్ని ఎదుర్కొంది. నీటి అడుగున చిత్రీకరణ ఖర్చులు బడ్జెట్‌లో ఎక్కువ భాగాన్ని మింగేయడంతో, రీషూట్ చేయాల్సిన కొన్ని సీన్లని రీషూట్ చేయకుండా అలాగే విడుదల చేశారు.

‘లాస్ట్ యాక్షన్ హీరో’ (1993) ఇది బిగ్ స్టార్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ. బడ్జెట్ మించిపోవడంతో చాలా యాక్షన్ సీన్స్ కి కంటిన్యూటీ లేక, అడ్డదిడ్డంగా ఎడిటింగ్ చేసి విడుదల చేశారు. బిగ్గెస్ట్ ఫ్లాపయ్యింది.

‘యాక్సిడెంటల్ లవ్’ (2015) దీన్ని 2008లో ప్రారంభించారు. కఠినమైన ఆర్థిక పరిమితుల వల్ల 2010లో సగం పూర్తయిన సినిమాని అలాగే విడుదల చేశారు. 2015లో ఎడిటింగ్ చేసి ‘నెయిల్డ్’ అనే కొత్త పేరుతో చివరి ఆశగా మళ్ళీ విడుదల చేశారు. ఎంత ఎడిటింగ్ చేసినా షూట్ చేయని ముగింపు విషయం అలాగే వుంది. సినిమా అయిపోయాక ఇంకా ముగింపు వస్తుందనుకుని అలాగే కూర్చున్నారు ప్రేక్షకులు. వాళ్ళకి నచ్చజెప్పి పంపడానికి చాలా తిప్పలు పడ్డారు.

హాలీవుడ్ స్వర్ణయుగపు కాలంలో స్టూడియోలు సినిమాని పూర్తి చేయడానికి కావలసినంత సమయాన్ని తీసుకునేవి. ఉదాహరణకి ‘ది విజార్డ్ ఆఫ్ ఓజ్’ షూట్ చేయడానికి మూడు సంవత్సరాలు పట్టింది. ఆ రోజుల్లో హడవిడీ లేదు, ఎంత సమయం పట్టినా సినిమాని పరిపూర్ణంగా తీర్చిదిద్దానికి బడ్జెట్ పరిమితులు కూడా దాటేవారు. తర్వాత పరిస్థితులు మారాయి. స్టూడియోలు సినిమాల విడుదల తేదీని ముందే ప్రకటిస్తున్నాయి. ప్రీప్రొడక్షన్, ప్రొడక్షన్ ప్రారంభం నుంచే ప్రీ-సెల్లింగ్, స్ట్రాటజిక్ మార్కెటింగ్ అంటూ కొత్త పుంతలు తొక్కడంతో మేకర్స్ పై వొత్తిడి పెరుగుతోంది. సుదీర్ఘమైన స్పెషల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా జాప్యాలకు కారణమవుతోంది. అసంపూర్ణ ఎఫెక్ట్స్ తో సినిమాల్ని విడుదల చేయాల్సివస్తోంది. సినిమా సిద్ధమైనా కాకపోయినా ఒక నిర్దిష్ట తేదీ లోపు తెరపైకి రావాలి. సృజనాత్మక రంగంలో ఇలా మెడ మీద కత్తి వేలాడుతూంటే క్వాలిటీని ఎలా అందించ గలరు. అసలు పూర్తికాక మూలన బడ్డ సినిమాలు వందల్లో వున్నాయి. వాటిలో కొన్నిటిని మాత్రమే రిపేర్లు చేసి విడుదల చేస్తున్నారు.

సూపర్ మాన్ -2, బ్లేడ్ రన్నర్, స్టార్ ట్రెక్, ఎక్స్ ప్లోరర్స్, ది ఫౌంటేన్, మార్గరెట్ కూడా ఇలా విడుదలైనవే!

First Published:  20 Dec 2023 10:25 AM GMT
Next Story