Telugu Global
Cinema & Entertainment

Katrina Kaif | టైగర్-3 లో ఫుల్ యాక్షన్ ఉందంటున్న కత్రిన

Katrina Kaif Tiger 3 - టైగర్-3 సినిమాలో జోయా పాత్రలో నటించింది కత్రినాకైఫ్. ఆ పాత్ర తనకు బాగా నచ్చిందంటోంది.

Katrina Kaif | టైగర్-3 లో ఫుల్ యాక్షన్ ఉందంటున్న కత్రిన
X

బాలీవుడ్ లేడీ సూప‌ర్‌స్టార్ క‌త్రినా కైఫ్, య‌ష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివ‌ర్స్‌లో తొలి లేడీ స్పై ఆఫీస‌ర్‌గా న‌టించింది. వైఆర్ఎఫ్ బ్యాన‌ర్‌లో రూపొందిన టైగ‌ర్ ఫ్రాంచైజీలో స‌ల్మాన్ ఖాన్ కు దీటుగా జోయా పాత్ర‌లో మెరిసింది క‌త్రినా. ఈ ఫ్రాంచైజీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏక్ థా టైగ‌ర్‌, టైగ‌ర్ జిందా హై చిత్రాలు రూపొందితే అందులో జోయా పాత్ర‌లో క‌త్రినాకు మంచి మార్కులుపడ్డాయి. ఈసారి మరింత మెరుగ్గా నటించానంటోంది ఈ బ్యూటీ. యాక్షన్ సన్నివేశాల కోసం చాలా కష్టపడ్డానని చెబుతోంది.

ఈ టైగ‌ర్ ఫ్రాంచైజీలో జోయా పాత్ర‌ను క‌త్రినా కైఫ్ త‌ప్ప మ‌రొక‌రు చేయ‌లేర‌నేలా యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఆమెను ప్ర‌శంసిస్తూ టైగ‌ర్ 3 చిత్రం నుంచి జోయా పాత్ర‌లో క‌త్రినా కైఫ్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా క‌త్రినా మాట్లాడింది. తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

"వైఆర్ఎఫ్ సంస్థ రూపొందిస్తోన్న స్పై యూనివ‌ర్స్‌లో తొలి లేడీ స్పై పాత్ర జోయా. ఆ పాత్ర‌ను నేను పోషించ‌టం అనేది ఎంతో గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను. భ‌యానికి లోను కాకుండా ధైర్యంగా ముందుకు సాగిపోయే జోయా క్యారెక్ట‌ర్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అంతే కాదు.. ఆమె స‌హృద‌యం క‌ల‌ది. త‌న‌వారిని ర‌క్షించుకుంటూనే విధేయ‌త‌ను చూప‌గ‌ల మ‌న‌స్త‌త్వం ఆమె సొంతం. త‌న అవ‌సరం ఉన్న ప్ర‌తీ చోట ప్ర‌త్య‌క్షం కావ‌టంతో పాటు అక్క‌డ మాన‌వత్వాన్ని చూపుతుంటుంది."

ఇలా తన పాత్ర తీరుతెన్నులు వివరించింది కత్రినా. టైగ‌ర్ 3లో యాక్ష‌న్ స‌న్నివేశాలు నెక్ట్స్ లెవ‌ల్లో ఉంటాయనే విషయం తనకు ముందే తెలుసని, అందుకే శారీరకంగా ఎక్కువగా కష్టపడ్డానికి మెంటల్లీ ప్రిపేర్ అయ్యానని చెబుతోంది. తనకు యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టించ‌టం ఎంతో ఇష్టమని, అందుకే జోయా పాత్రను ఎంతో ఇష్టపడి చేశానని చెబుతోంది.

టైగ‌ర్ 3 చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. మ‌నీష్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమా దీపావ‌ళి కానుకగా విడుదల కానుంది. సల్మాన్ ఖాన్ ఈ సినిమాతో తననుతాను నిరూపించుకోవాల్సి ఉంది.

First Published:  11 Oct 2023 2:57 PM GMT
Next Story