Telugu Global
Cinema & Entertainment

ఆ అభిమానానికి పాదాభివందనం - జూనియర్‌ ఎన్టీఆర్‌ భావోద్వేగం

సైమా అవార్డుల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో నటనకు గాను జూనియర్‌ ఎన్టీఆర్‌ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అవార్డుల వేదికపై జూనియర్‌ ఎన్టీఆర్‌ భావోద్వేగభరితంగా మాట్లాడారు.

ఆ అభిమానానికి పాదాభివందనం  - జూనియర్‌ ఎన్టీఆర్‌ భావోద్వేగం
X

అభిమానులు తనపై చూపుతున్న అభిమానానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ భావోద్వేగానికి గురయ్యారు. దుబాయ్‌లో నిర్వహిస్తున్న సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌(సైమా) – 2023 వేడుకల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ పాల్గొన్నారు. ఈ అవార్డుల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో నటనకు గాను జూనియర్‌ ఎన్టీఆర్‌ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అవార్డుల వేదికపై జూనియర్‌ ఎన్టీఆర్‌ భావోద్వేగభరితంగా మాట్లాడారు.

తన ఒడిదుడుకుల్లో అభిమానులు తోడున్నారని.. తాను కిందపడ్డ ప్రతిసారీ వారు తనను పట్టుకుని పైకి లేపారని.. తాను నవ్వినప్పుడల్లా సంతోషపడ్డారని తెలిపారు. తనను అభిమానించే అందరికీ తలవంచి పాదాభివందనం చేస్తున్నానని జూనియర్‌ ఎన్టీఆర్‌ చెప్పారు. తనపై నమ్మకంతో కొమురం భీమ్‌ లాంటి గొప్ప పాత్రను ఇచ్చిన రాజమౌళికి ధన్యవాదాలు తెలియజేశారు. తన సహ నటుడు, తన సోదరుడు, స్నేహితుడు కూడా అయిన రామ్‌చరణ్‌కి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ’దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా ఇది తెరకెక్కుతోంది. ఇందులో భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయి. వాటి కోసం తారక్‌ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ నటిస్తున్న విషయం తెలిసిందే.


First Published:  16 Sep 2023 7:51 AM GMT
Next Story