Telugu Global
Cinema & Entertainment

ఆరు మాసాల్లో 4,868 కోట్లు కొట్టింది బాక్సాఫీసు!

2023 జనవరి నుంచి జూన్ వరకు దేశంలో అన్ని భాషల సినిమాల బాక్సాఫీసు వసూళ్ళు రూ. 4,868 కోట్లుగా నమోదైంది.

ఆరు మాసాల్లో 4,868 కోట్లు కొట్టింది బాక్సాఫీసు!
X

2023 జనవరి నుంచి జూన్ వరకు దేశంలో అన్ని భాషల సినిమాల బాక్సాఫీసు వసూళ్ళు రూ. 4,868 కోట్లుగా నమోదైంది. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో వసూళ్ళ కంటే 15 శాతం తక్కువ. ఈ రేటు ప్రకారం ఈ సంవత్సరం రూ. 9,736 కోట్లతో బాక్సాఫీసు వసూళ్ళు ముగియవచ్చు. ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన 'ది ఇండియా బాక్స్ రిపోర్ట్: జనవరి-జూన్ 2023' నివేదికలో ఈ డేటాని వెల్లడించింది. ఈ సంవత్సరం బాక్సాఫీసు వసూళ్ళు 2022 కంటే 8 శాతం తక్కువగా వుండొచ్చని నివేదికలో తెలిపింది. 2022 లో బాక్సాఫీసు రూ. 10,637 కోట్లుగా నమోదైంది. అయితే ప్రస్తుత 2023 ద్వితీయార్ధంలో భారీ సినిమాలు లైను కడుతున్నందున 2022 ని అధిగమించవచ్చు. షారుఖ్ ఖాన్ ‘జవాన్’, ‘డుంకీ’, రజనీ కాంత్ ‘జైలర్’, ప్రభాస్ ‘సాలార్’, సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’, రణబీర్ కపూర్ ‘యానిమల్’ వంటి క్రేజీ సినిమాలు ఈ సంవత్సరాంతాన్ని సంతోషకరంగా మార్చ వచ్చు.

షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, ప్రభాస్ ‘ఆదిపురుష్’, ‘జరా హట్కే జరా బచ్కే’ (హిందీ), ‘క్యారీ ఆన్ జట్టా 3’ (పంజాబీ), ‘బైపన్ భారీ దేవ’ ( మరాఠీ), మామన్నన్ (తమిళం) మొదలైన సినిమాలు మంచి వసూళ్ళు సాధించాయి. జూన్ వరకూ 2023 ప్రథమార్ధంలో చూస్తే జనవరిలో విడుదలైన ‘పఠాన్’ అగ్ర స్థానంలో నిలిచింది. ప్రథమార్ధం మొత్తం వసూళ్ళలో ‘పఠాన్’ వాటా 13 శాతానికి పైగా వుంది. ‘ఆదిపురుష్’ అనేక వివాదాలు చుట్టుముట్టి, పేలవమైన ప్రేక్షకుల రెస్పాన్స్ పొందిప్పటికీ తెలుగు, హిందీ మార్కెట్లలో భారీ ఓపెనింగుల బలంతో రెండవ స్థానాన్ని ఆక్రమించింది. ఇక జూన్ 2023 చివరి నాటికి టాప్ 10 మూవీస్ జాబితాలో వున్న ఏకైక హాలీవుడ్ సినిమా ‘ఫాస్ట్ ఎక్స్’.

టాప్ 10 సినిమాల వసూళ్ళు ఈ విధంగా వున్నాయి : ‘పఠాన్’ 646 కోట్లు, ‘ఆదిపురుష్’ 333 కోట్లు, ‘కేరళ స్టోరీ’ 263 కోట్లు, ‘పిఎస్ 2’ 206 కోట్లు, ‘వాల్తేరు వీరయ్య’ 190 కోట్లు, ‘తూ ఝూటీ మై మక్కార్’ 154 కోట్లు, ‘ఫాస్ట్ ఎక్స్’ 135 కోట్లు, ‘తూనీవు’ 134 కోట్లు, ‘కిసీకా భాయ్ కిసీకీ జాన్’ 123 కోట్లు.

భాషల భాగస్వామ్యం

ఇటీవల హిందీ సినిమాల బాక్సాఫీసు ఫలితాలు సమృద్ధిగా లేకపోయినా, గత సంవత్సరంతో పోలిస్తే నాలుగు శాతం వృద్ధిని సాధించింది. 37 శాతం వాటాతో ఈ సంవత్సరం అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. దీనికి విరుద్ధంగా, గత సంవత్సరంతో పోలిస్తే కన్నడ భాషలో సినిమాల వాటా 8 శాతం నుంచి 2 శాతానికి అత్యల్ప స్థాయికి పడిపోయింది. దీంతో దక్షిణ భాషా చలన చిత్రాల షేర్ గతేడాది 50 శాతంతో పోలిస్తే 44 శాతానికి పడిపోయింది. ఇదే 2022 లో ‘కేజీఎఫ్ 2’, ‘ఆర్ ఆర్ ఆర్’ ల బంపర్ వసూళ్ళ ఫలితంగా సౌత్ సినిమాల వాటా 50 శాతంగా వుంటే, హిందీ సినిమాలు కేవలం 33 శాతం వాటాతో సరిపెట్టుకున్నాయి.

నివేదిక ప్రకారం, 2023 ప్రథమార్ధంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల వాటాలు వరుసగా 20, 17, 5 శాతంగా వున్నాయి. ఆసక్తికరంగా, హాలీవుడ్‌ సినిమాలు 12 శాతం వాటాతో వుండగా, పంజాబీ మూడు శాతం వాటాతో వుంది.

2023 లో దాదాపు రూ. 1,388 కోట్లతో జనవరి అత్యధికంగా ఆర్జించిన నెల. రూ. 1,035 కోట్లతో జూన్ రెండో స్థానంలో నిలిచింది. ఫిబ్రవరిలో కేవలం రూ. 396 కోట్లు వసూలయ్యాయి. ఇది అత్యంత నిరాశాజనకమైన నెలగా వుంది. ఇక మార్చి, ఏప్రిల్, మే నెలల సగటు రూ. 683 కోట్లుగా తేలింది.

2022 రూ. 10,637 కోట్ల స్థూల రాబడితో ముగియడంతో, ఈ ఏడాదిలో మిగిలిన ఆరు నెలలకి 2022తో సరిపోలడానికి కనీసం రూ. 962 కోట్ల సగటు వుండాలి. అయితే ప్రస్తుత రేటు ప్రకారం, 2023 కొత్త సంవత్సరం వచ్చేలోపు రూ. 9,736 కోట్లకు చేరుకుంటుందని అంచనా. 2023 వచ్చేసి 2022ని అధిగమించగలిగినప్పటికీ, 2019 ఆల్-టైమ్ రికార్డు 10,948 కోట్ల రూపాయల్ని అధిగమించడం చాలా దూరపు ఆలోచన కావచ్చు.

ఓర్మాక్స్ మీడియాని 2008 లో డాక్టర్ శైలేష్ కపూర్ దేశంలో మొట్టమొదటి ప్రత్యేక మీడియా కన్సల్టింగ్ సంస్థగా స్థాపించారు. సినిమా, టెలివిజన్, రేడియో, ప్రింట్, బ్రాండెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి రంగాల్లో దీని రీసెర్చి విస్తరించి వుంది. గత 8 సంవత్సరాలుగా వీక్షకుల సంఖ్య, బాక్సాఫీసు వసూళ్ళు వంటి కీలక వ్యాపార వేరియబుల్స్ ని పరీక్షించడం, ట్రాక్ చేయడం, అంచనా వేయడం వంటి కార్యకలాపాల్ని చేపడుతోంది.

దీని రీసెర్చి నివేదికలు మీడియా, వినోద సంస్థల పెట్టుబడి, వ్యూహం, బ్రాండింగ్, మార్కెటింగ్, కంటెంట్‌ మొదలైన వాటికి కు సంబంధించిన క్లిష్టమైన వ్యాపార నిర్ణయాల్ని తీసుకునేలా చేస్తాయి. ఈ ప్రథమార్ధంలో మన తెలుగు సినిమాలు తమిళ సినిమాల్ని అధిగమించి మించి 20 శాతం వాటాతో రెండో స్థానాన్ని ఆక్రమించినప్పుడు, ద్వితీయార్ధాన్ని 30 శాతం వాటా పొందేలా తెలుగు సినిమాల నాణ్యత మీద దృష్టి పెడతారా?

First Published:  26 July 2023 12:42 PM GMT
Next Story