Telugu Global
Cinema & Entertainment

పొదుపుగా ఫిబ్రవరి బాక్సాఫీస్

ఈ ఫిబ్రవరిలో కొన్ని కొత్త తెలుగు సినిమాలు థియేటర్స్ లో విడుదల వుతున్నాయి. వీటిలో మిడిల్/లో- బడ్జెట్ సినిమాలే ఎక్కువున్నాయి.

పొదుపుగా ఫిబ్రవరి బాక్సాఫీస్
X

ఈ ఫిబ్రవరిలో కొన్ని కొత్త తెలుగు సినిమాలు థియేటర్స్ లో విడుదల వుతున్నాయి. వీటిలో మిడిల్/లో- బడ్జెట్ సినిమాలే ఎక్కువున్నాయి. మిడిల్ /లో-బడ్జెట్ సినిమాలు జనవరి సంక్రాంతి సీజన్లో సహజంగానే అదృశ్యమైపోయాయి. జనవరి మూడో వారం, నాలుగోవారం కూడా విడుదలలకి లైను కట్టలేదు. ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఫిబ్రవరి 2న ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ‘ విడుదలకి సిద్ధమైంది. ‘రైటర్ పద్మభూషన్’ ఫేమ్ సుహాస్ నటించిన ఈ కొత్త మూవీ గ్రామీణ డ్రామా. టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తించింది. ‘యాత్ర 2’ అనే రాజకీయ ప్రచార సినిమా ఫిబ్రవరి 8 న విడుదల కానుంది. దీని తర్వాత అసలు ధమాకా వుంది. సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్న రవితేజ నటించిన బిగ్ బడ్జెట్ మూవీ ‘ఈగిల్’ ఫిబ్రవరి 9 న విడుదలకి సిద్ధమైంది.

ఫిబ్రవరిలో విడుదలవుతున్న అన్ని సినిమాలలో ఇదే అతిపెద్దది. ఈసారి రవితేజ యాక్షన్ మూవీ ఏ మేరకు అభిమానుల్ని ఆకట్టుకుంటుందో చూడాల్సి వుంది. దీని ప్రొడక్షన్ క్వాలిటీ మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ట్రైలర్ తో ఎవరికీ ఏ అసంతృప్తీ లేదు. అయితే ఇదే రోజు రవితేజకి రజనీకాంత్ తో క్లాష్ తప్పడం లేదు. రజనీకాంత్ నటించిన ‘లాల్ సలాం’ కూడా ఫిబ్రవరి 9నే విడుదలవుతోంది. తెలుగులో ‘జైలర్’ సక్సెస్ తో తిరిగి తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ రేపిన రజనీ ‘లాల్ సలాం’ కి అదే యెత్తున ఆదరణ వుంటుందని లెక్కలు కడుతున్నారు.

ఇక వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ తో ఫిబ్రవరి 16 న వస్తున్నాడు. ఇది ఇండియన్ ఏర్ ఫోర్స్ కథతో పానిండియా మూవీ. ఇది ఏ మేరకు తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో చూడాలి . ఫిబ్రవరి 16 న ‘ఊరిపేరు భైరవకోన’ వస్తోంది. ఇది గ్రామీణ మ్యాజికల్ డ్రామాలా వుంది. హీరో సందీప్ కిషన్ తిరిగి విజయపథంలోకి రావడానికి ఈ మూవీ వర్కౌట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. 16 వ తేదీనే గోపీచంద్ నటించిన ‘భీమా’ విడుదల ప్రకటించారు. హిట్లు లేక వెనుకబడ్డ గోపీచంద్ కి ఇది మళ్ళీ పరీక్షే.

ఇక లో- బడ్జెట్లు ఫిబ్రవరి 2న ‘బూట్ కట్ బాలరాజు’, ‘గేమ్ ఆన్’, ‘కిస్మత్’, 9న ‘సుందరం మాస్టారు’ విడుదలలు ప్రకటించారు. గమనార్హమేమిటంటే, ఫిబ్రవరి 16 తర్వాత విడుదలలు ప్రకటించలేదు. ఫిబ్రవరి 16 తర్వాత సినిమాలు లేకపోతే చాలా పొదుపు చేసినట్టు. ప్రేక్షకుల జేబు మీద భారం తగ్గించినట్టు.

ఫిబ్రవరి నెల ఇలా వుండగా, కొందరు అగ్రనిర్మాతలు చెన్నై బాట పడుతున్నారు తమిళ స్టార్స్ తో పానిండియా మూవీస్ కోసం. తమిళ సూపర్‌ స్టార్స్ తో భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు చెన్నైకి దూసుకుపోతున్నారు. దీనికి ప్రేరణ నిర్మాత దిల్ రాజు తమిళ సూపర్ స్టార్ విజయ్ తో నిర్మించిన ‘వారిసు’ సూపర్ సక్సెస్ అంటున్నారు. ఒక ప్రముఖ తెలుగు నిర్మాత ఇప్పటికే విజయ్ ని కలిసినట్టు కూడా తెలుస్తోంది. మరో ఇద్దరు నిర్మాతలు ఇద్దరు తమిళ స్టార్స్ ని కలిసే ప్రయత్నాల్లో వున్నారు. ఎందుకీ ఆకస్మిక మార్పు? తెలుగు స్టార్స్ తో తీస్తున్న సినిమాలపై లాభాలు బాగా తగ్గిపోతూండడంతో, తమిళ స్టార్స్ వైపు చూస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల మాట. తెలుగు నిర్మాతల పట్ల తమిళ స్టార్స్ కీ ఆసక్తి వుందని, కారణం తమిళంలో భారీ స్థాయిలో సినిమాలు తీయగల నిర్మాతలు అంతగా లేరనీ అంటున్నారు. తెలుగు నిర్మాతలు వివిధ భాషల్లో సినిమాలు చేస్తే వారి బ్రాండ్ విలువ పెరుగుతుందనీ వివరిస్తున్నారు.

పానిండియా మార్కెటింగ్ లో తమిళ నిర్మాతల కంటే తెలుగు నిర్మాతలే దూకుడుగా వుంటున్నారన్నది తెలిసిందే. తెలుగు నిర్మాతలు పాన్-ఇండియా సినిమాలు నిర్మించి బాలీవుడ్‌లో కూడా బాగా ప్రమోట్ చేయగలరు. అందువల్ల, తమిళ స్టార్స్ అలాంటి విజన్ వున్న తెలుగు నిర్మాతల పట్ల ఆసక్తి చూపడంలో ఆశ్చర్యం లేదు. మరొకటేమిటంటే, తెలుగు స్టార్స్ ఎవ్వరూ ఖాళీగా లేరు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తే సినిమాలు తీయలేరు. ‘హనుమాన్’ దర్శకుడు తెలుగు స్టార్స్ డేట్స్ కోసం రెండు మూడేళ్ళు వేస్ట్ చేసుకుని, ఇక లాభం లేదని ఛోటా హీరోతో హనుమాన్ తీసిపడేసి, పానిండియా హిట్ చేసుకుని సీక్వెల్ కూడా ప్రారంభించ బోతున్నాడు.

తెలుగు స్టార్స్ ఒకే సినిమా రెండేళ్ళు మూడేళ్ళూ చేస్తూ కూర్చుంటే కాలం ఆగదు. ‘హనుమాన్’ లాగా ఛోటా హీరోలు పెద్ద స్టార్స్ అయిపోతారు. అగ్ర నిర్మాతలు తమిళ స్టార్స్ వైపు వెళ్ళిపోతారు. బయటి నుంచీ లోపలి నుంచీ అనవసరంగా పోటీ కొనిదెచ్చుకుని తలపట్టుకోవాల్సి వస్తుంది!

First Published:  28 Jan 2024 10:29 AM GMT
Next Story