Telugu Global
Cinema & Entertainment

Martin Luther King | ఇది రీమేక్ లా అనిపించదంట

Martin Luther King - మార్టిక్ లూధర్ కింగ్, ఇది రీమేక్ సినిమాలా అనిపించదని చెబుతున్నాడు నటుడు నరేష్. అంతకుమించి ఉంటుందని హామీ ఇస్తున్నాడు.

Martin Luther King | ఇది రీమేక్ లా అనిపించదంట
X

వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సగర్వంగా సమర్పిస్తున్న చిత్రం "మార్టిన్ లూథర్ కింగ్". మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు నటించారు.

'కేరాఫ్ కంచరపాలెం', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలతో దర్శకుడిగా విశేషంగా ఆకట్టుకున్న వెంకటేష్ మహా.. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. అంతేకాదు ఈ సినిమాలో ఆయన ముఖ్యపాత్ర పోషించడం విశేషం. వినోద ప్రధానంగా రూపొందిన ఈ రాజకీయ వ్యంగ్య చిత్రం ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడారు సీనియర్ నటుడు నరేష్. ఇది రీమేక్ ప్రాజెక్ట్ అయినప్పటికీ, దాన్నుంచి స్ఫూర్తి పొంది, మరింత మెరుగ్గా తీసిన సినిమా అని అంటున్నారు. ఎందుకంటే తెలుగు రాజకీయాలు, మన నేటివిటీ తగ్గట్టుగా చాలా మార్పులు చేశారట. రీమేక్ గా కాకుండా, దీనిని ఓ కొత్త సినిమాగా చూడొచ్చని... సరిగ్గా ఎన్నికల సీజన్ లో విడుదలవుతున్న మార్టిన్ లూథర్ కింగ్ అందర్నీ కట్టిపడేస్తుందని చెబుతున్నాడు.

ఈ సినిమాలో చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే తరహా పాత్రలో నరేష్ కనిపించారు. గ్రామ సర్పంచ్ వారసత్వం కోసం పరితపించే పాత్ర. ఆయన వయసు కంటే దాదాపు 20 ఏళ్ళు తక్కువ వయసున్న క్యారెక్టర్ అది. అలాగే మహా పాత్ర మరో వర్గం. అసలు రాజకీయం గ్రామాల్లోనే జరుగుతుంది. దాని ఆధారంగా చేసుకొని తీసిన సినిమా ఇది.

నిజంగానే యూనిట్ అంతా ఒక వెనకబడిన గ్రామానికి వెళ్ళి ఈ సినిమాను షూట్ చేశారు. ఈ సినిమాకి బలం వెంకటేష్ మహా స్క్రిప్ట్. దానిని దర్శకురాలు పూజ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా తనకు నటుడిగా మరో లైఫ్ ఇస్తుందని నమ్మకంగా చెబుతున్నారు నరేష్. ఒక మహిళా దర్శకురాలి (విజయనిర్మల) కొడుకుగా పూజ దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉందన్నారు.

First Published:  19 Oct 2023 2:27 AM GMT
Next Story