Telugu Global
Business

శ్రావణ మాసంలో బంగారం కొంటున్నారా? ఇవి గుర్తుంచుకోండి!

బంగారం అంటే మనదేశంలోని మహిళలకు ఎంత మక్కువో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందులోనూ శ్రావణమాసం వచ్చిందంటే చాలామంది బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపుతుంటారు.

శ్రావణ మాసంలో బంగారం కొంటున్నారా? ఇవి గుర్తుంచుకోండి!
X

శ్రావణ మాసంలో బంగారం కొంటున్నారా? ఇవి గుర్తుంచుకోండి!

బంగారం అంటే మనదేశంలోని మహిళలకు ఎంత మక్కువో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందులోనూ శ్రావణమాసం వచ్చిందంటే చాలామంది బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపుతుంటారు.

శ్రావణమాసంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు, పూజలు, వ్రతాలు వంటివి ఎక్కువ. అందుకే ఈ సీజన్‌లో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఎంతో విలువైన బంగారాన్ని కొనుగోలు చేసేముందు కొన్ని విషయాలు మైండ్‌లో పెట్టుకోవాలి. బంగారం కొనే విషయంలో మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..

బంగారు ఆభరణాలు కొనేటప్పుడు అందులోని బంగారం ఎంత స్వచ్ఛమైనది అని తెలిపేందుకు నగలపై హాల్‌మార్క్ గుర్తు ఉంటుంది. నగలు కొనేముందు దాన్ని గమనించుకోవాలి.

బంగారంలో పలు రకాలుంటాయి. కొద్దిశాతం మాత్రమే బంగారం కలిసిన నగలు కూడా ఉంటాయి. అలాగే పూర్తిగా బంగారంతో చేసిన నగలూ ఉంటాయి. బంగారాన్ని ఆస్తిగా కొనుగోలు చేయాలనుకున్నప్పుడు పూర్తి బంగారానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

బంగారు ఆభరణాల్లో రాళ్లు, పగడాలు, వజ్రాల వంటివి ఉంటే.. బిల్లు వేసేటప్పుడే వాటికి సెపరేట్‌గా విలువ కడుతున్నారో లేదా చూసుకోవాలి. రాళ్లకు విలువ ఉండదు. అలాగే పగడాలు, కెంపులు వంటి వాటికి కొద్దిగా రీసేల్ వాల్యూ ఉంటుంది. వజ్రాలకు దాన్ని క్వాలిటీని బట్టి సెపరేట్‌గా రీసేల్ వాల్యూ ఉంటుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని బంగారు నగలు కొనుగోలు చేయాలి.

బంగారు నగలు ఎంతో విలువైన వస్తువులు. కాబట్టి వాటిని కొనేటప్పుడు అధికారిక ఇన్‌వాయిస్‌ లేదా బిల్లుని తీసుకోవాలి. ఫ్యూచర్‌‌లో బంగారం అమ్మేటప్పుడు ఆ బిల్లు పనికొస్తుంది. కొన్ని దుకాణాలు నకిలీ బంగారం అంటకట్టి నకిలీ బిల్లులు ఇస్తుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

ఆభరణాలు కాకుండా అచ్చంగా బంగారాన్ని కొనాలి అనుకుంటే గోల్డ్ కాయిన్స్‌ను కూడా కొనుగోలు చేయొచ్చు. ఇవి పూర్తి నాణ్యత కలిగి ఉంటాయి. వీటిని రీసేల్ చేసేటప్పుడు తరుగు ఉండదు. వీటిని బ్యాంకుల్లో కొనుగోలు చేసి అక్కడే దాచుకోవచ్చు.

బంగారం కొనేటప్పుడు తరుగు, మజూరీ వంటి వాటిని ఎలా లెక్క కడుతున్నారో గమనించుకోవాలి. వాల్యూ యాడెడ్ ఛార్జీల గురించి తెలుసుకోవాలి. అలాగే దుకాణాలు, ప్రాంతాలను బట్టి బంగారం ధరలో మార్పులుంటాయి. కొనుగోలు చేసేముందు రెండు, మూడు చోట్ల ధరల గురించి ఆరా తీయడం మంచిది.

First Published:  24 Aug 2023 10:48 AM GMT
Next Story