Telugu Global
Business

IT Returns | ఇంటి అద్దె ప్ల‌స్‌ ఎన్పీఎస్‌లో మ‌దుపుతో రూ.86వేల ప‌న్ను ఆదా.. ఇవీ డిటైల్స్‌..!

IT Returns | విజ‌య‌వాడ కేంద్రంగా ప‌ని చేస్తున్న ఇంజినీర్‌ మాధ‌వరావు కేతినేని ప్ర‌తిఏటా మోస్త‌రు ఆదాయం ప‌న్ను చెల్లిస్తుంటారు. ఆయ‌న వేత‌న ప్యాకేజీ ట్యాక్స్ ఫ్రెండ్లీగా ఉండ‌టం అందుకు కార‌ణం.

IT Returns | ఇంటి అద్దె ప్ల‌స్‌ ఎన్పీఎస్‌లో మ‌దుపుతో రూ.86వేల ప‌న్ను ఆదా.. ఇవీ డిటైల్స్‌..!
X

IT Returns | విజ‌య‌వాడ కేంద్రంగా ప‌ని చేస్తున్న ఇంజినీర్‌ మాధ‌వరావు కేతినేని ప్ర‌తిఏటా మోస్త‌రు ఆదాయం ప‌న్ను చెల్లిస్తుంటారు. ఆయ‌న వేత‌న ప్యాకేజీ ట్యాక్స్ ఫ్రెండ్లీగా ఉండ‌టం అందుకు కార‌ణం. త‌న‌కు అందుబాటులో ఉన్న డిడ‌క్ష‌న్ ఆప్ష‌న్ల‌న్నీ ఉప‌యోగించుకోవ‌డం ద్వారా మాధ‌వ‌రావు కేతినేని త‌న ఆదాయం ప‌న్ను భారాన్ని గ‌ణ‌నీయంగా త‌గ్గించుకున్నాడు. త‌ల్లి ఇంట్లోనే ఉంటున్నందున ఆమెకు ఇంటి అద్దె చెల్లిస్తున్నారు. సొంతంగా పెట్టుబ‌డి లేదా, పెన్ష‌న్ స్కీంలో పెట్టుబ‌డి పెట్టాల‌న్న ఆలోచ‌న ఉన్న‌ట్ల‌యితే నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీమ్ (ఎన్పీఎస్‌)లో మ‌దుపు చేయొచ్చున‌ని ఆయ‌న సంస్థ యాజ‌మాన్యం ప్ర‌తిపాదించింది. దీంతోపాటు ఎల్‌టీఏ, కుటుంబం కోసం మెడిక‌ల్ ఇన్సూరెన్స్ పాల‌సీ కొనుగోలు చేయ‌డం వంటి టాక్స్ ఫ్రీ అల‌వెన్స్‌లను ఉప‌యోగించుకున్నారు మాధ‌వ‌రావు.

మాధ‌వ‌రావు కేతినేని త‌న త‌ల్లితో క‌లిసి ఆమె ఇంట్లోనే జీవిస్తున్నారు. ప్ర‌తి నెలా ఆయ‌న త‌న త‌ల్లికి రూ.25 వేల ఇంటి అద్దె చెల్లిస్తుండ‌టంతో హెచ్ఆర్ఏగా రూ.2.54 ల‌క్ష‌ల వ‌ర‌కూ మిన‌హాయింపు పొందుతున్నారు. త‌త్ఫ‌లితంగా రూ.53 వేల ప‌న్ను ఆదా చేయ‌గ‌లుగుతున్నారు. మాధ‌వ‌రావు త‌ల్లికి ఎటువంటి ఆదాయం రాక‌పోతే, కొడుకు ద్వారా వ‌చ్చే ఇంటి అద్దె ఆదాయం రూ.3 ల‌క్ష‌ల్లోపే క‌నుక ప‌న్ను చెల్లించ‌న‌క్క‌ర‌లేదు.

ఎన్పీఎస్‌లో చేర‌మ‌ని మాధ‌వ‌రావు కేతినేనికి ఆయ‌న ప‌ని చేస్తున్న యాజ‌మాన్యం సూచించింది. ఆదాయం ప‌న్ను చ‌ట్టంలోని 80సీసీడీ (2) సెక్ష‌న్ ప్ర‌కారం ఒక ఉద్యోగి క‌నీస వేత‌నంలో 10 శాతం వ‌ర‌కూ ఎన్పీఎస్‌లో పెట్టుబ‌డి పెట్ట‌డంతో ప‌న్ను మిన‌హాయింపు పొందొచ్చు. ఆయ‌న క‌నీస వేత‌నంలో 10 శాతం అంటే రూ.4,232 ప్ర‌తి నెలా ఎన్పీఎస్‌లో మ‌దుపు చేయ‌డం వ‌ల్ల రూ.10,400 ప‌న్ను ఆదా అవుతుంది. ఆదాయం ప‌న్ను చ‌ట్టంలోని 80సీసీడీ (1బీ) సెక్ష‌న్ ప్ర‌కారం మాధ‌వ‌రావు కేతినేతి సొంతంగా రూ.50 వేలు ఎన్పీఎస్‌లో పొదుపు చేయ‌డంతో మ‌రో రూ.10,400 ప‌న్ను ఆదా చేశారు. దీనికి అద‌నంగా రూ.50 వేల వ‌ర‌కూ ఎల్‌టీఏ పొందితే రూ.10,400 ప‌న్ను ఆదా అవుతుంది. త‌ల్లితోపాటు కుటుంబానికి ఆరోగ్య బీమా పాల‌సీ కొనుగోలు చేస్తే మ‌రికొంత ప‌న్ను పొదుపు చేయ‌గ‌లుగుతారు.ఇవే కాక టెలిఫోన్ అల‌వెన్స్ త‌దిత‌ర రూపాల్లో టాక్స్ ఫ్రీ బెనిఫిట్లు అందుకుంటారు.

మాధ‌వ‌రావు క‌నీస వేత‌నం రూ.5,07,840. హెచ్ఆర్ఏ రూ.2,53,920, క‌న్వీయెన్స్ అల‌వెన్స్ రూ.3,44,064, మొబైల్ ఫోన్ రీయింబ‌ర్స్‌మెంట్ రూ.18,000, మీల్ కూప‌న్స్ రూ.24 వేలు, పీఎఫ్‌లో యాజ‌మాన్యం వాటా రూ.60,941 క‌లుపుకుని మాధ‌వ‌రావు కేతినేని వార్షిక ఆదాయం రూ.12,20,765. దీనికితోడు బ్యాంకు డిపాజిట్ల‌పై వ‌డ్డీ ఆదాయం రూ.1,250 క‌లుపుకుంటే మొత్తం ఆదాయం రూ.12,22,015 అన్న‌మాట‌.

ప్రావిడెండ్ ఫండ్‌లో రూ.60,941, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో రూ.54 వేలు, సుక‌క‌న్య స‌మృద్ధి యోజ‌న‌లో రూ.1.50ల‌క్షలు, ఆదాయం ప‌న్ను చ‌ట్టంలోని 80సీసీడీ (1బీ) సెక్ష‌న్ ప్ర‌కారం రూ. 50వేలు, హెచ్ఆర్ఏ మిన‌హాయింపు రూ.2,53,920, ఎల్టీఏతోపాటు ఆరోగ్య బీమా పాల‌సీ రూ.30 వేలు క‌లుపుకుని మొత్తం రూ.6,38, 704ల‌కు ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. గ‌తంలో మొత్తం వేత‌నంపై రూ.97,671 ఆదాయం ప‌న్ను చెల్లించిన‌ మాధ‌వ‌రావు కేతినేని.. ఇప్పుడు ప‌న్ను మిన‌హాయింపుల‌న్నీ పోగా రూ.11,758 ప‌న్ను చెల్లిస్తున్నారు. అంటే ప్ర‌తి ఏటా మాధ‌వ‌రావు రూ.85,913 ప‌న్ను ఆదా చేస్తున్నారు.

First Published:  3 Oct 2023 5:30 AM GMT
Next Story