Telugu Global
Business

Gold Returns | 2023-24లో బంగారంపై 11 శాతం రిట‌ర్న్స్.. గ‌త ద‌శాబ్దిలో బెస్ట్ లాభాలు ఎప్పుడంటే..?!

దేశీయ, అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌లు మెరుస్తున్నాయి. కామెక్స్‌లో స్పాట్ గోల్డ్ 10 శాతం, వెండి 1.8 శాతం ధ‌ర పెరిగింది.

Gold Returns | 2023-24లో బంగారంపై 11 శాతం రిట‌ర్న్స్.. గ‌త ద‌శాబ్దిలో బెస్ట్ లాభాలు ఎప్పుడంటే..?!
X

Gold Returns | భౌగోళిక వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు.. రాజ‌కీయ ఉద్రిక్త‌త‌లు.. కీల‌క రంగాల్లో ఒడిదొడుకుల ప్ర‌భావంతో ధ‌ర‌లు పెరిగిపోతుంటాయి. దీనివ‌ల్ల ద్ర‌వ్యోల్బ‌ణం పైపైకి దూసుకెళ‌డంతో ప్ర‌జ‌ల జీవ‌న వ్య‌యం పెరిగిపోయి, అష్ట‌క‌ష్టాల పాల‌వుతుంటారు. గ‌తంతో పోలిస్తే ప్ర‌తి ఒక్క‌రూ త‌మ కుటుంబ అవ‌స‌రాల కోసం ఆదాయంలో కొంత మొత్తం పొదుపు చేస్తుంటారు. కొంద‌రు ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. మ‌రికొంద‌రు మ్యూచువ‌ల్ ఫండ్స్‌, ఇంకొంద‌రు వివిధ సంస్థ‌ల స్టాక్స్‌లో పెట్టుబ‌డులు పెడుతుంటారు.

ఇత‌రుల‌తో పోలిస్తే భార‌తీయుల‌కు బంగారంపై మ‌క్కువ ఎక్కువ‌. ప్ర‌త్యేకించి బంగారం ఆభ‌ర‌ణాలంటే మహిళ‌లు ప్రాణం పెడ‌తారు. అందుకే త‌మ‌కు వ‌చ్చే ఆదాయంలో కొంత మొత్తం బంగారం ఆభ‌ర‌ణాలు కొనుక్కోవ‌డానికి మొగ్గు చూపుతుంటారు. రాజ‌కీయ‌, ఆర్థిక‌, పారిశ్రామిక రంగాల్లో ఒడిదొడుకులు త‌లెత్తిన‌ప్పుడు ఇన్వెస్ట‌ర్ల‌కు ఇప్పుడు ప్ర‌త్యామ్నాయ పెట్టుబ‌డి మార్గంగా బంగారం ఉంది. ద్ర‌వ్యోల్బ‌ణం ప్ర‌భావాన్ని తట్టుకుని లాభాలు సంపాదించి పెడుతుంది బంగారం. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం (2023-24) మ‌రో నాలుగైదు రోజుల్లో ముగియ‌బోతున్న‌ది. గ‌తేడాది ఏప్రిల్ నుంచి మార్చి వ‌ర‌కూ బంగారంపై పెట్టుబ‌డుల‌తో స్ఫూర్తిదాయ‌కంగా 11 శాతం రిట‌ర్న్స్ ల‌భించాయి. ఇది ద్ర‌వ్యోల్బ‌ణంతో పోలిస్తే రెట్టింపు. ఇక వెండిపై రిట‌ర్న్స్ 3.2 శాతం అందించింది.

దేశీయ, అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌లు మెరుస్తున్నాయి. కామెక్స్‌లో స్పాట్ గోల్డ్ 10 శాతం, వెండి 1.8 శాతం ధ‌ర పెరిగింది. ఆర్బీఐ వెల్ల‌డించిన గ‌ణాంకాల ప్ర‌కారం ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం 5.4 శాతం. గ‌త రెండేండ్ల‌లో బంగారంపై రిట‌ర్న్స్ చెప్పుకోద‌గిన‌వి కాక‌పోయిన‌వైనా ఆమోద‌యోగ్య లాభాలు అందించింది. బంగారంపై మ‌దుప‌రుల‌కు 2021-22లో 15.6శాతం, 2022-23లో 15.2 శాతం రిట‌ర్న్స్ ల‌భించాయి.

2011-2012 నుంచి బంగారంపై పెట్టుబ‌డుల‌కు అత్య‌ధిక రిట‌ర్న్స్ ల‌భిస్తున్న‌ది. 2011-22లో ఎంసీఎక్స్‌లో బంగారం మీద పెట్టుబ‌డుల‌కు 36.3 శాతం లాభాలు ల‌భిస్తే, 2019-20లో 35.5 శాతం లాభాలు గ‌డించారు మ‌దుప‌ర్లు కానీ మూడు సంద‌ర్భాల్లో ఎంసీఎక్స్‌లో ప్ర‌తికూల రిట‌ర్న్స్ అందుకున్నారు. 2014-15 ఆర్థిక సంవ‌త్స‌రంలో -8.2 శాతం లాభాలు అందాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో కామెక్స్ గోల్డ్‌పై 2011-12లో 13.5 శాతం రిట‌ర్న్స్ అందితే 2019-20లో 22 శాతం లాభాలు గ‌డించారు.

మ‌రోవైపు ఎంసీఎక్స్‌లో వెండి మీద పెట్టుబ‌డుల‌కు 2020-21లో 61.5 శాతం అత్య‌ధిక రిట‌ర్న్స్ అందిస్తే, 2016-17లో 15.2 శాతం లాభాలు వ‌చ్చాయి. 2011-12 నుంచి 2023-24 మ‌ధ్య ఏడేండ్లు సానుకూల లాభాలు పొందారు ఇన్వెస్ట‌ర్లు. 2016-17లో వెండిపై పెట్టుబ‌డుల‌కు మైన‌స్ 19.3 శాతం, 2014-15లో 13.5 శాతం రిట‌ర్న్స్ మాత్ర‌మే ల‌భించాయి. 2013-14లో వెండి ధ‌ర‌లు 30 శాతానికి పైగా త‌గ్గిపోయాయి. కామెక్స్‌లో సిల్వ‌ర్‌పై 2020-21 వ‌ర‌కూ నాలుగేండ్ల పాటు 74.7 శాతం లాభాలు అందుకున్నారు ఇన్వెస్ట‌ర్లు.

First Published:  26 March 2024 8:28 AM GMT
Next Story