Telugu Global
Arts & Literature

పరివర్తనం

పరివర్తనం
X

ఉదయం ఆరుగంటల సమయంలో చెన్నై సెంట్రల్ స్టేషన్ లో తిరుపతికి వెళ్ళే సప్తగిరి ఎక్స్ ప్రెస్ లోకి తాను మామూలుగా ఎక్కే భోగీలోకి అడుగుపెట్టాడు అమలాపురం జ్జానమూర్తి.

అందరూ అతడిని మూర్తి అని పిలుస్తారు.అతడు పనిచేసే ఆఫీసు తిరుత్తణిలో ఉంది. బస్సులో రోజూ ప్రయాణం చేయడం ఇష్టంలేక హాయిగా ఈ రైలు లో ప్రయాణం చేస్తూంటాడు. చక్కగా ప్రొద్దునే లేచి, స్నానం వగైరాలు కానిచ్చి, శ్రీమతి చేతి కమ్హని కాఫీ త్రాగి చాకలిపేట (వాషర్మెన్పేట) లో ఉన్న ఇంటి నుండి మోటర్బైక్ లో సెంట్రల్ కి వచ్చి ఈ రైలుని అందుకుంటాడు. ఆ రైలు 6.25 కి బయల్దేరి 7.45- 8 గంటలలోపు తిరుత్తనికి చేరుతుంది. అక్కడి నుండి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న తన ఆఫీసుకి నడకతో 8.30 లోపు చేరుకుంటాడు. అప్పటికి అటెండరు యాదగిరి తప్ప వేరెవరూ ఉండరు ఆఫీసులో. మూర్తిని చూసిన వెంటనే యాదగిరి నవ్వుతూ ఎదురెళ్ళి "నమస్కారమయ్యా. రండి" అంటూ అతడు తన కుర్చీలో కూర్చున్నాక ఒక గ్లాసు కుండనీళ్ళు అందిస్తాడు. తరువాత అప్పుడే వచ్చిన వార్తాపత్రికను అతడికి ఇచ్చి, ప్రక్కనే ఉన్న హోటల్ కి వెళ్ళి జ్ఞానమూర్తికి ఉపాహారం, ఫ్లాస్క్ లో పాలు తీసుకొస్తాడు.

మూర్తి స్వతహాగా మితభాషి కనుక మౌనంగానే తిండి తిని, పాలు త్రాగి, యాదగిరికి థ్యాంక్స్ అన్నట్లు ఒక చిన్న నవ్వు చిందిస్తాడు. అదే తన భాగ్యమని యాదగిరి మురిసిపోతాడు. ఔను మరి. రోజుకు లెక్కపెట్టినట్లు 10 సార్లు కూడా నవ్వని మూర్తి ఒక నవ్వు యాదగిరి కని కేటాయించడమనేది గొప్ప విషయం కదా.

అసలు మూర్తిది అమలాపురం. కూడా పుట్టినవారు ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలు, ఒక చెల్లి. ఉద్యోగరీత్యా తిరుత్తనికి రావలసి వచ్చింది. అసలేగారాబంగా పెరిగినవాడు. అందరినీ వదలి ఉండలేను, ఈ ఉద్యోగం చేయనంటూ నానా రభస చేసిన మూర్తికి అసలే ఉద్యోగం దొరకని ప్రస్తుతపు పరిస్థితులలో మంచి మేనేజరు పదవి, ఐదు అంకెల జీతం ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవడం మూర్ఖత్వమని అందరూ నచ్చజెప్పారు. రోజూ ఫోన్లు చేస్తామని, రెండువారాలకొకసారి ఇంట్లోంచి యెవరో ఒకరు మూర్తిని చూడటానికి తిరుత్తనికి వచ్చేటట్లు యేర్పాటు అయ్యాక కుదుటపడిన మనసుతో తిరుత్తనికి బయలుదేరాడు మూర్తి.

ఆఫీసువాళ్ళే మూర్తికి రెండు గదులున్న ఒక చిన్న పోర్షను అద్దెకి యేర్పాటు చేసారు. కూడా పనిచేస్తున్న వారి పూర్వీకులు ఆంధ్రదేశం నుండి చాలా కాలం క్రితం తమిళనాడులో స్థిరపడినందువల్ల తమిళమే వారి మాతృభాషగా చేసుకున్నారు. కానీ తెలుగుని మరచిపోకుండా కాస్త అరవయాసతో తెలుగు మాట్లాడుతారు. ఆంధ్రదేశం నుండి వచ్చిన మూర్తి అంటే వారికి తెలియని ఒక అభిమానం కలిగింది. అతడితో తమకు తెలిసిన తెలుగు భాషలో మాట్లాడ్డానికి ఇష్టపడేవారు. మొదట వారి భాష కాస్త వింతగా తోచినా, తరువాత అలవాటుపడ్డాడు మూర్తి. వారి ఆప్యాయతానురాగాలకి తల ఒగ్గాడు. మితభాషియైనా, మంచితనంతో వారిని ఆకట్టుకున్నాడు. అతడు మొహమాటస్తుడని తెలుసుకున్న సహోద్యోగులు కూడా అతనిని యెక్కువ ఇబ్బంది పెట్టకుండా, సాధ్యమైనంత వరకు స్నేహంగా ఉంటూ, అతడు ఒంటరిగా ఉన్నందువలన కావలసిన సదుపాయాలు చేస్తూ ఉండేవారు.


అలా సాఫీగా ఆరునెలలు గడిచింది. కొత్తలో బెంగపడ్డ మూర్తి తన పరిసరాలకు, మనుష్యులకు క్రమంగా అలవాటుపడ్డాడు.తరువాత అతడికి బంధువులమ్మాయైన మహితతో వివాహమైంది. వారికి పెళ్ళైన 5 యేళ్ళకి పాప పుట్టింది. పాపకి అపురూప అని పేరుపెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచసాగారు తలిదండ్రులు. పాప మీద మమకారంతో పాప అడిగిన ప్రతి వస్తువును కొనివ్వసాగారు. తను కోరింది ఇవ్వడంలో కాస్త ఆలస్యమైనా పాప గట్టిగా యేడుస్తూ, నేలమీద కూర్చుని కాళ్ళను నేలకి కొడుతూ, తలని చేతులతో కొట్టుకుంటూ అఘాయిత్యం చేసేది. పాప తప్పులేమైనా చేసినా వారి మమత పాపని కోప్పడకుండా చేసేది. వారి గారాబం పాపని జగమొండిగా మార్చింది. మూర్తి కూడపుట్టినవారు ఒక సారి వచ్చినపుడు, పాప మొండితనం చూసి, కాస్త నచ్చజెబితే, బిరుసుగా మాట్లాడి వారిని తలిదండ్రుల యెదుటే అవమానపరిచింది. వాళ్ళు మూర్తితో యేమీ చెప్పలేక, కళ్ళతోనే తమ బాధని, జాలిని వ్యక్తీకరించి, తిరిగి వెళ్ళారు. ఆ తరువాత వాళ్ళెవరూ మూర్తి ఇంటికి రాలేదు.

అంత మొండిదైన అపురూప చాలా తెలివిగలది. ఏకసంతాగ్రాహి. బడిలో పాఠాలలో, సంగీతంలో, నాట్యంలో, ఆటలపోటీలలో ఒకటేమిటి అన్ని రంగాలలోను మొదటి బహుమతి తెచ్చుకొనేది. మిడిల్ స్కూలు తరువాత పై చదువు కొరకు మంచి బళ్ళు, కళాశాలలు చెన్నైలోనే ఉన్నాయని స్నేహితుల ద్వారా తెలుసుకుని, మకాన్ని తనకి కష్టమైనా, పాపకి మంచి విద్యనివ్వాలని చెన్నైకి మార్చాడు మూర్తి.

ఉదయం 5 గంటలకి ఇల్లు వదలిన మూర్తి తిరిగి వచ్చేది రాత్రి 8 గంటలకే. తిరుత్తనిలో ఉన్నంతవరకూ అపురూపని బడిలో దింపడం, తీసుకురావడం లాంటివి అన్నీ మూర్తే చేసేవాడు. ప్రొద్దున బడి ఐపోయాక అక్కడికి దగ్గరలోనే ఉన్నఒక ఇంట్లో సంగీతం, తరువాత నాట్యం అంటూ అపురూపని ఓవర్ ఆంబిషెస్ గా చాలా బిజీగా ఉంచారు మూర్తి దంపతులు. ఇంగ్లీషులో బాగా రాణించాలని మొదటినుండి అపురూప కోసం తాము కూడా ఆంగ్లంలో మాట్లాడేవారు. అమ్మా, నాన్న అని యెంతో ఆప్యాయంగా పిలిచే పాపని బలవంతంగా మమ్మీ, డాడీ అని పిలిచేలా చేశారు. అంతే అలా అంకుల్, ఆంటీ సంస్కృతి చిన్నపుడే అలవడింది అపురూపకి.

చెన్నైకి వచ్చాక మహిత కూడా ప్రక్కనే ఉన్న ఒక ప్రైవేటు బడిలో ఉపాధ్యాయినిగా చేరింది కాస్త ఖాళీ సమయం దొరకడం వల్ల. తన ప్రతిభతో అతి తక్కువ కాలంలోనే హెడ్మిస్ట్రెస్ గా పదవిని అలంకరించింది. మంచి సమర్థవంతమైన మహిళగా పేరు రావడంవల్ల, కాస్త చుట్టుప్రక్కలవారి మహిళల సంఘాలలో పేరున్న మహిళ అయింది. ఎంత పని ఒత్తిడి ఉన్నా తన బాధ్యతలనుండి తప్పించుకోలేదు మహిత. అపురూప ఇంట్లో ఉన్న సమయంలో తాను కూడా ఉంటూ, పాప కి కావలిసినవన్నీ యే లోటూ లేకుండా చక్కగా అమర్చేది. ప్రతిరోజూ రాత్రి మాత్రం ముగ్గురూ కలిసి, హాయిగా మాట్లాడుకుంటూ భోజనం చేయడం అలవాటుగా చేసుకున్నారు.

మూర్తికి వారంలో సోమవారం ఆఫీసుకి శెలవు. కనుక సోమవారం కూతురికి నచ్చిన వంటలని నేర్చుకుని మరీ తన చేతులారా వండి పెట్టేవాడు.

పాపకి నచ్చేవిధంగానే ఇంట్లో ఆహారం, ఇంటి అలంకరణ, వేషధారణ జరిగేవి. తమకు నచ్చిన కాయగూరలను, వంటకాలను కాశీకి వెళ్ళకుండానే త్యజించారు మూర్తి దంపతులు. తాము జీవించియుండడమే పాపకోసమన్నట్లు, పాపే తమ ప్రపంచంగా బ్రతికారు.

చెన్నైకి వచ్చిన క్రొత్తలో చుట్టుప్రక్కలవారు "ఎన్న తెలుంగా?", "పక్కా గొల్టీపా" అని అనడంతో బాధపడ్డ మూర్తి అసలు బయటివారితో మాట్లాడడం మానేశాడు. వారి మీద కోపంతో తమిళం నేర్చుకోవాలన్న కోరికను చంపేసుకున్నాడు. కనుక అతడికి తిరుత్తనిలోని ఆఫీసులో తప్ప బయట స్నేహితులే కరువయ్యారు. అతడు మితభాషిగానే ఉండిపోయాడు బయటి ప్రపంచలో. తన కబుర్లు, వినోదాలన్నీ భార్యా, పిల్లకే పరిమితం చేసుకున్నాడు.


ఇక కళాశాలలో మొదటి విద్యార్థినిగా ఉత్తీర్ణురాలైన అపురూప "బెస్ట్ ఔట్ గోయింగ్ స్టూడెన్ట్" గా పేరు తెచ్చుకుంది. వెంటనే క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా మంచి ఉద్యోగం కూడా దొరికింది. ఇక తలిదండ్రుల విషయానికొస్తే తమ పిల్ల కాస్త మొండిదైనా, బాగా అన్ని రంగాల్లో రాణించడం వల్ల ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ఇక అమ్మాయికి పెళ్ళి చేసేస్తే తమ బాధ్యత తీరిపోతుందనుకున్నారు. భార్యవైపో, తనవైపో మేనరికం చేసుకుందామని అపురూపని అడిగాడు పెళ్ళి ప్రస్తావన వచ్చినపుడు. ససేమిరా అంది అపురూప. ఆస్తులు బయటికి పోకూడదని మీ ఇద్దరి ఇళ్ళల్లో అందరి పెళ్ళిళ్ళు బంధువుల్లోనే జరగడం వల్ల పుట్టబోయే పిల్లలు కాస్త బలహీనంగా, యేదో ఒక అవకరంతో పుడతారని అంది. వాటికి ఒకటి రెండు ఉదాహరణలని చూపెట్టింది కూడా. తనకప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు. రెండు మూడేళ్ళయినా ఉద్యోగం చేస్తూ, స్వతంత్రంగా ఉండాలని తన అభిలాష అని సంభాషణని ఆపేసి, తన గదికి వెళ్ళిపోయింది. మొదట అమ్మాయి ఆలోచన కూడా సరైనదే అనుకున్నారు దంపతులు. రెండేళ్ళ తరువాతే పిల్లకి పెళ్ళి చేద్దామనుకున్నారు.

కానీ ఈ మధ్య అపురూప మొబైల్ లో ఎక్కువ సమయం గడపడం గమనించిన మహిత భర్తకి ఆ విషయం ఆదివారం ఉదయం తెలిపింది. ఆ రోజు రాత్రే కూతురిని ఆ విషయం అడగాలని నిశ్చయించాడు మూర్తి. ఆ రోజు రాత్రి సప్తగిరిని అందుకోకపోవడంతో, తరువాత వచ్చే రైలుకి వచ్చాడు మూర్తి.

ఇల్లు చేరేటప్పటికి రాత్రి పదిదాటింది. మహిత మాత్రం హాలులో ఉండటం చూసి, తను రావడం ఆలస్యం కావడం వల్ల అపురూప భోంచేసి పడుకుందనుకున్నాడు. లోపలికి వెళ్ళి, స్నానం చేసి భార్యతో పాటు భోంచేశాడు. వంటింట్లో అన్నీ సర్ది వచ్చిన భార్యతో "అమ్మాయి సరిగ్గా భోంచేసిందా?" అనడిగాడు. సమాధానం చెప్పకుండా తలదించుకున్న మహితను చూసి మళ్ళీ అదే ప్రశ్నని వేశాడు. ఆమె నెమ్మదిగా తల యెత్తి, "మీతో ఒక విషయం చెప్పాలండి పాపను గురించి" అన్నది. "మొదట నేనడిగినదానికి జవాబివ్వు." అన్నాడు కాస్త బిగ్గరగా " అసలే పాప ఆకలికి తట్టుకోలేదు. నేను లేనని సరిగ్గా భోంచేసిందో లేదో. ఉండు. నేను పాప గదికి వెళ్ళి అడుగుతాను." అంటూ మంచంపైనుండి లేచిన భర్తని వారించింది "పాప లేదండీ" అంటూ. అప్పటిదాకా ఆపుకున్న కన్నీరు ఇక ఆగలేమంటూ ప్రవాహంలా బయటికి తన్నుకొచ్చింది. అసలు ఆమె అన్నదేంటో అర్థంకాని మూర్తి బిక్కముఖం పెట్టాడు. కాస్సేపాగాక, " అసలు విషయం చెప్పు, సస్పెన్స్ భరించలేను" అనన్నాడు.

"మీరు ఆఫీసుకి వెళ్ళాక స్నానం చేసి, ఉపాహారం తయారు చేసి, డైనింగ్ టేబుల్ పైన పెట్టి, పాపను లేపడానికి గదికి వెళ్ళాను. పాప గదిలో లేదు. బాత్రూంలో ఉందేమోనని చూశాను. కానీ అక్కడా లేదు. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఒక కాగితం రెపరెపలాడుతూ కనిపించింది. అది ఎగరకుండా దానిపైన పాప చెవి కమ్మలు, బంగారు గాజులు, గొలుసు, వాచీ, ఉంగరాలు అన్నీ పెట్టి ఉన్నాయి. ఒక వేళ ప్రక్కనే ఉన్న పార్కుకి నడవడానికి వెళ్ళిందేమోననుకుని ఆ కాగితం తీసి చూశాను. "మమ్మీ! మీకొక సర్ప్రైస్ ….త్వరలో…" అని రాసి ఉంది. ఏమైయుంటుదబ్బా అనుకుంటూ, అన్యమనస్కంగానే పనులు చేసుకుంటున్నాను. పదకొండు గంటలైనా రాకపోయేటప్పటికి, పోనీలే శెలవని స్నేహితులెవరింటికైనా వెళ్ళి యుంటుందని నేను ఫలహారం తిన్నాను. కాస్సేపటికి కాలింగ్బెల్ మ్రోగింది. వెళ్ళి తలుపు తెరిచాను. క్రొత్త పట్టుచీరలో, మెడలో పూలదండతో, ప్రక్కనే మెడలో పూలదండతో ఉన్న ఒక యువకుడి చేతిని పట్టుకుని, నవ్వుతూ నిలబడియున్న పాపను చూడగానే, నేను దిగ్బ్రాంతురాలయ్యాను. అసలు ఆ షాక్ లో కళ్ళు కనిపించకుండా పోయాయి కాస్సేపు. మళ్ళీ తేరుకుని, నేను చూసింది నిజమేనా అని మళ్ళీ చూశాను. అక్షరాలా మన అపురూపే.

అపురూప ఆ అబ్బాయి తో " అద్వైత్! ఈమె మా మమ్మీ!" అంటూ తమిళంలో చెప్పింది. తల్లితో " అమ్మా! విషయం అర్థమైందనుకుంటాను. మమ్మీ!! ఇతడు అద్వైత్ అని నాతో పని చేస్తున్నాడు. మీరెలాగూ ఒప్పుకోరు కనుక రాద్ధాంతాలు అవీ కాకుండా, ఇప్పుడే ఇద్దరమూ గుళ్ళో మారేజ్ చేసుకున్నాం. ఆశీర్వదించు" అంది. ఇద్దరూ తన కాళ్ళకి సమస్కారం చేస్తూఉంటే యాంత్రికంగా నిలబడ్డానే కానీ మొద్దుబారిన నా మెదడు సహజ స్థితికి రావడానికి కాస్త సమయం పట్టింది. అంతలోనే అపురూప అద్వైత్ ని అక్కడున్న సోఫాలో కూర్చోమని చెప్పి, చక చకా తన గదికి వెళ్ళి, ఒక చిన్న బ్రీఫ్కేసు తో బయటికి వచ్చింది. "మమ్మీ! ఇవి నా సర్టిఫికేట్స్. ఇవి తప్ప నేనిక్కడినుండి యేవీ తీసుకెళ్ళడంలేదు. నా ఒంటిమీద ఉన్న ఈ చీర కూడా అద్వైత్ కొనిచ్చినదే. తరువాత డాడీతో మాట్లాడుతానని చెప్పు" అంటూ " రా అద్వైత్! బయలుదేరదాం" అంది. అద్వైత్ అత్తగారికి నవ్వుతూ నమస్కరించి "బై ఆంటీ" అంటూ అపురూపతో కలిసి బయటికి వెళ్ళిపోయాడు.


నాకేం జరిగిందో అసలు అర్థం కాలేదు. అలాగే సోఫాలో కూలబడిపోయాను. ఒక గంట తరువాత మామూలు స్థితిలోకి వచ్చి, మీకు ఫోన్ చేద్దామనుకున్నాను కానీ మీరీ షాక్ ని ఎలా తట్టుకుంటారో అని ఇంతదాకా వేచి, మీరు భోంచేసాక చెబుతున్నా. అసలు మీకీ విషయాన్ని చెప్పడానికి నేను ఎన్నిసార్లు అద్దంముందు ప్రాక్టీసు చేసుకున్నానో. శుభమా అని పెళ్ళిజరిగిన ఇంట్లో యేడవకూడదని, ఇంతసేపు బిగపెట్టుకుని కూర్చున్నాను." అంటూ ఏకబిగిని చెప్పి, కళ్ళు తుడుచుకుంది.

విషయం విన్న మూర్తికి కళ్ళు బైర్లు కమ్మాయి. తను విన్నది నిజమేనా? అసలు యేం జరుగుతోంది తన ఇంట్లో? ఒక్కసారిగా బీ.పీ. ఎక్కువైంది. గదిలో ఏ.సీ. ఉన్నా ఉక్క పోయసాగింది. కోపంతో పిడికిలి బిగించి "ఇంట్లో నీవేగా పాపతో ఎక్కువగా ఉండేదీ? కాస్త జాగ్రత్తగా ఉండొద్దూ? అదీ ఒక ఆడపిల్లల బడిలో హెచ్.ఎమ్. గా ఉంటూ? అంతా నా తలరాత. నా తలరాత." అంటూ పెళ్ళాంపై విరుచుకుపడ్డాడు అంతా ఆమె తప్పయినట్లు, తనకు అందులో బాధ్యతయేదీ లేనట్లు. ఎప్పుడూ సౌమ్యంగా ఉండే భర్త తనతో ఇలా కోపంతో మాట్లాడడం మహితకి క్రొత్త అనుభవం. ఏం సమాధానం చెప్పాలో తోచక, ప్రక్క గదిలోకి వెళ్ళి తలుపేసుకుని కూర్చుంది బాధతో.

కాస్సేపటికి కోపం తగ్గింది మూర్తికి. మెల్లగా భార్యఉన్న గదికెళ్ళాడు. మంచం మీద మోకాళ్ళను చేతులతో చుట్టేసి, తలని మోకాళ్ళపై పెట్టుకుని దుఃఖిస్తున్న మహిత భుజంపై చేయి వేశాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి, భయంతో వణికిపోయింది భర్త తనని యేం చేస్తాడోనని. లాలనగా భార్యని దగ్గరికి తీసుకున్నాడు మూర్తి. "మనం పాపకి యేం తక్కువ చేశాం మహీ? పాపే మన ప్రపంచమని కదా బ్రతుకుతున్నాం? మనకి మాటమాత్రంగా కూడా చెప్పకుండా ఇలా…." అంటూ యేడ్చేశాడు బేలగా. పసిపిల్లవాడిలా మారిన భర్త పరిస్థితి చూసిన మహిత అతడిని సమాధానపరచడానికి తన బాధని దిగమ్రింగుకుంది. మెల్లగా అతడి వెన్నుని నిమురుతూ కూర్చుంది.

ఆ రాత్రంతా జాగరణే అయింది దంపతులకి. ఎప్పుడో నిద్రపోయారు. నిద్రలో కూడా మధ్య మధ్య పాప, పాప అని కలవరిస్తున్న భర్తని చూసి మహిత భయపడింది అతడికి యేమన్నాప్రమాదమౌతుందేమోనని. ఉదయం 9 గంటల సమయంలో మెలకువ అయింది మొదట మహితకే. గబ గబా లేచి ముఖం కడుక్కుని, పాలు కాచి, భర్తని నిద్రలేపి, త్రాగించింది. ఉపాహారం తయారుచేసి, బడి యాజమాన్యం వారికి, భర్త ఆఫీసువాళ్ళకి ఫోన్లో ఒక వారం రోజుల పాటు శెలవని చెప్పింది.

వారం రోజులు మూర్తి ఈ లోకంలో లేడు. జీవచ్ఛవంలా ఉంటూ, మాటి మాటికీ పాపని తలుచుకుంటూ, పాప బాల్యాన్ని తలుచుకుంటూ, తనలో తనే గొణుక్కుంటూ, నవ్వుకుంటూ ఉన్న భర్తని ఫ్యామిలీ డాక్టరుకి చూపెట్టింది. అతడిలాగే ఉంటే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదముందని డాక్టరు చెప్పడంతో, భర్తని మాములు పరిస్థితికి తీసుకురావడానికి శాయశక్తులా ప్రయత్నించి, సఫలీకృతురాలైంది. తమ ఇద్దరి శెలవులను పొడిగించింది. క్రమంగా మూర్తి ధోరణి మామూలు స్థితికి వచ్చింది. ఈ మధ్యకాలంలో అపురూప రెండు సార్లు ఫోన్ చేసింది. మూర్తి పాపతో మాట్లాడే పరిస్థితిలో లేకపోవడంతో మహితే యేదో రెండు ముక్కలు ముక్తసరిగా మాట్లాడింది. 10 రోజుల తరువాత అపురూప, భర్తతో ఇంటికి వచ్చింది. అప్పటికి మూర్తి కాస్త తేరుకున్నాడు కనుక పాపతో ముభావంగా మాట్లాడాడు. పాప విషయంలో మూర్తి మనసు విరిగిపోయింది. పాప వెళ్ళాక, భార్యతో పాప వస్తువులన్నీ సర్దించేసి, పాప ఇంటికి పంపించేయమన్నాడు. అతడి మనసునర్థం చేసుకున్న మహిత అలాగే చేసింది.

నెలరోజుల తరువాత ఆఫీసుకి వెళ్ళడానికి తయారయ్యాడు మూర్తి. అప్పటికి అతడి మానసిక పరిస్థితి బాగా మెరుగైందన్న నమ్మకం రావడంతో మహిత సరేనంది. ఆమెను కూడా బడికి వెళ్ళమన్నాడు. ఆఫీసులో అందరూ మూర్తిని యెంతో ఆదరంగా ఆహ్వానించారు. అతడి బాగోగులను రోజూ ఫోన్లో కనుక్కుంటున్న వారికి అతడు తిరిగి ఆఫీసుకి రావడం ఆనందం కలిగించింది. అలా రెండు నెలలు గడిచాయి. అతడికి ఇప్పటికీ పాపపట్ల తాము చేసిన తప్పేమిటి అన్న ప్రశ్నకి సమాధానం దొరకలేదు. అంత ప్రేమగా చూసుకున్న తమను పాప అట్లా నిర్దాక్షిణ్యంగా తన్నేసి పోవడం చాలా బాధ కలిగించింది.

అది ఆరని గాయమై మనసుని తొలుస్తూనే ఉంది.

ఎప్పటిలాగానే మూర్తి ఆ రోజు సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఎక్కాడు. ఎప్పుడూ తను కూర్చునే సింగిల్ విండో సీట్లో ఒక చిన్న పాప కూర్చుని ఉంది. కాస్సేపు అక్కడే నిలబడి, పాప లేవకపోవడంతో ఎదురుగా ఉన్న ఖాళీ సీట్లో తను తెచ్చుకున్న తెలుగు వార్తాపత్రికను సీట్లో పెట్టి, కూర్చోబోయాడు. అప్పుడే ఒక 35 యేళ్ళావిడ మూర్తిని చూసి, "అన్నయ్యగారూ!కాస్త ఈ సంచిని పైన పెట్టడానికి సాయం చెయ్యండి" అంటూ అతడి చేతికి ఒక పెద్ద సంచి ఇచ్చింది. అసంకల్పితంగా ఆ సంచిని అందుకుని, పైన పెట్టాడు. "థ్యాంక్స్ అన్నయ్యగారూ!" అంటూ యెంతో పరిచయమున్నట్లు " నా పేరు ప్రసూన. పాప పేరు అపూర్వ. వీడు మా అబ్బాయి సర్వేశ్. వీరు మా మామయ్య పరంధామయ్యగారు" అంటూ తనవారిని పరిచయం చేసింది. ఆవిడ కలుపుగోరుతనం, స్వచ్ఛత మూర్తికి నచ్చాయి. "నా పేరు జ్ఞానమూర్తి. రోజూ ఇదే సీట్లో కూర్చునే తిరుత్తనికి వెళ్ళడం అలవాటు." అంటూ నవ్వాడు.


"ఐతే ఇది మీ సీటా మామయ్యగారూ! ఇవాళ మమ్మల్ని కూర్చోనియ్యరూ…" అంటూ పాప, బాబు ముద్దుగా అడిగిన తీరుకి కరిగిపోయింది మూర్తి మనసు. "అలాగే కూర్చోండి " అన్నాడు. పరంధామయ్యగారు " ఏంటి పిల్లలు వరసలు కలిపేసారా? వాళ్ళంతే. ఇప్పటి ఆంటీ, అంకుల్ పద్ధతి నేర్పలేదు మా కోడలు. ఎంతైనా, మన పిలుపులలోని ఆత్మీయత, ప్రేమ ఆ పద్ధతిలో ఉండవు కదా. ఏం బాబూ! ఎక్కడ పనిచేస్తున్నావు? మా అబ్బాయి హృదయ్ తిరుపతిలో పనిచేస్తున్నాడు. వాడిని కలవడానికే వెళుతున్నాను." అంటూ మొదలుపెట్టి, తన అప్యాతానురాగాలతో మూర్తిని ఆకట్టుకున్నారు. మెల్లగా వారి సంభాషణ వాతావరణం, రాజకీయాలనుండి వ్యక్తిగత విషయాలపై మళ్ళింది. మూర్తి తన విషయాలను చెప్పాడు. ఆయన చెప్పిన విషయాలు మూర్తికి చాలా ఆశ్చర్యం, మరింత ఆనందం కలిగించాయి. పరంధామయ్యగారు చెన్నైలోని ఒక పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేసి రెటైర్ అయ్యారు. ఉన్నఒక్కగానొక్క కొడుకు ఉద్యోగం ఢిల్లీలో. అక్కడే పరిచయమైన ఒక గుజరాతీ అమ్మాయిని ప్రేమించినట్లు తలిదండ్రులకి తెలిపాడు. చిన్నప్పటినుండి కొడుకుని ఒక స్నేహితునిగా, అతడి భావాలకు గౌరవాన్నివ్వడంవల్ల తండ్రీ కొడుకుల మధ్య సాన్నిహిత్యం ఉండేది. వారికి అమె నచ్చితే, వారి అనుమతితో పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నానని, ఆమెని చూపడానికి ఛెన్నైకి వస్తున్నట్లు తెలిపాడు. బాల్యంలోనే ఆ అమ్మాయి తలిదండ్రులు ఒక ప్రమాదంలో చనిపోగా, ఒక అనాథాశ్రమంలో పెరిగింది. బాగా కష్టపడి, చదువుకుని, ఒక ప్రైవేట్ బడిలో పనిచేస్తూ, సాయంత్రాలు బీదపిల్లలకి ఉచితంగా చదువు చెప్పిస్తుందట. ఆ అమ్మాయి ప్రవర్తనని చూశాక పరంధామయ్య దంపతులకి తమకు కూతురు లేని లోటు పోయిందనిపించింది. తాము చూసి, పెళ్ళి చూసినా ఇంత కన్నా మంచి పిల్ల తమకు కోడలుగా దొరకదంటూ, వెంటనే దగ్గరలోని శ్రీ వేణుగోపాలస్వామి కోవెలలో వారికి నిరాడంబరంగా పెళ్ళి చేశారు. తమ కొడుకు, కోడలు అన్యోన్యాన్ని చూసి మురిసిపోయారు. ఒక వారం తరువాత అందరూ తిరుపతికి బయల్దేరారు ఒక బస్సులో. బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు. వీళ్ళు యెక్కిన బస్సును నడపవలసిన డ్రైవరు భార్య కాన్పు కావడంతో , ఇంతకు ముందు రెండురోజులుగా నిద్రపోకుండా బస్సు నడిపిన వేరే బస్సు డ్రైవరు మకరందానికి బస్సు నడపక తప్పలేదు. అప్పటికీ అప్పుడప్పుడు కళ్ళు కడుక్కుంటూ బస్సు నడిపినా, ఒక్క నిముషం ఆదమరవడంతో ఎదురుగా వచ్చిన లారీని ఢీకొట్టడంతో, బస్సు గల్లంతైంది. డ్రైవరుతో సహా 20 మంది అక్కడికక్కడే మరణించారు. బ్రతికి బయటపడిన వారిలో పరంధామయ్యగారు ఒకరు. అంతవరకు నవ్వులనావ లాగ సాగిన జీవితం కళ్ళెదురుగా తన భార్య, వైవాహిక జీవితంలో తొలి అడుగు పెట్టిన కొడుకు, కోడలు పోవడం పరంధామయ్యగారికి పెద్ద అఘాతం కలిగించింది. బస్సు ప్రమాదం గురించి తెలిసిన ప్రయాణికుల బందువుల, స్నేహితుల రాకతో ఆ స్థలం సందడిగా ఉంది.

అదే బస్సులో హృదయ్ తలిదండ్రులు కూడా ప్రయాణం చేసి, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి దేహాలను గుర్తించి, వారికి చేయవలసిన చివరికార్యాలు చేసాడు హృదయ్. అప్పుడు నిస్సత్తువతో, ఏడవడానికి కూడా శక్తిలేనట్లు కూలబడిపోయిన పరంధామయ్యని చూడడం సంభవించింది. హృదయ్ అతడిలో తన తండ్రిని చూసుకున్నాడు. పరంధామయ్యగారిని తన తండ్రిగా భావించి, తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. అసలు ఏం జరుగుతోందో తెలుసుకునే స్థితిలో లేరు పరంధామయ్యగారు. హృదయ్ భార్య కూడా ఆయనని తన మామగారిలాగా కాదు తండ్రి లాగే ఆదరించింది. వారి శుశ్రూషలో ఆయన త్వరగానే కోలుకున్నారు. ఆ తరువాత హృదయ్ కి కవలపిల్లలు పుట్టారు. వారికి తాతగా తన ప్రేమానురాగాలను పంచుతూ, వారితో పూర్తి సమయం గడుపుతూ, వారికి మన సంస్కృతి, మన భాష, సంస్కారాలను తెలుపుతూ, ఆనందంగా ఆయన తన జీవితం గడుపుతున్నారు.

ఆ దంపతుల ఆప్యాయతకి, ఔన్నత్యానికి, పరంధామయ్యగారి దయనీయమైన గతాన్ని తెలుసుకున్న అ(మలాపురం) జ్ఞానమూర్తి అసలైన జ్ఞానమూర్తిగా మారాడు. అప్పటిదాకా తమవైపునుండే ఆలోచించినవాడు, ఇప్పుడు తన కూతురివైపు నుండి ఆలోచించడం ప్రారంభించాడు. పాపకి ఇష్టమైన సాహిత్యం చదవనీయక, ఇంజనీరింగులో చేర్చటం, ఇంట్లో కొంత సమయం కూడా ఉంచక, ఉన్న అన్ని క్లాసులలో చేర్పించి, తాము కూడా ఉండి వెచ్చించవలసిన అమూల్యమైన సమయాన్ని, ప్రేమానురాగాలని ఇవ్వకపోవడం మూర్తిని తన తప్పు తెలుసుకొనేలా చేసింది. మేఘావృతమైన మనసు నిర్మలమైంది.

ఇంతలో తిరుత్తని వచ్చింది. పరంధామయ్యగారికి తన చిరునామా ఇచ్చి, "బాబాయిగారూ! మీ పరిచయం నాకు కనువిప్పు కలిగించింది. నేను కూడా మీ అబ్బాయినే. మనం తరుచూ కలుస్తూ ఉండాలి. " అంటూ వారిని విడవలేక, విడవలేక బండి దిగాడు

పరంధామయ్య గారి పరిచయం జ్ఞానముర్తిని అసలు సిసలైన ప్రేమమూర్తిగా మార్చిందని ఇక చెప్పక్కరలేదనుకుంటాను.

డా.తిరుమల ఆముక్తమాల్యద - (చెన్నై)

First Published:  4 Nov 2022 6:22 AM GMT
Next Story