Telugu Global
Arts & Literature

సెల్ఫీ (కవిత)

Rajeshwari Diwakarlas Telugu Poem Selfie
X

సెల్ఫీ (కవిత)

నాన్నమ్మ ఫోటో ఒకటి

నలుపు తెలుపు మరకల

చారికలు కట్టింది.

కళ్ళ బెజ్జాల సూది కాంతి తో

మమతల దారాలను

గుచ్చుతునే ఉంది.

ఫోటో అంటే చాలు

తనకెందుకంటూ

ఆమడల దూరం

ఎటో తొలగి పోతుంది.

లక్ష వత్తుల నోముకు

విడదీసిన మెత్తని

పత్తి తెరల పోగులో

గతం నేపథ్యాలకు తరలి వెళ్ళినప్పుడు

ఉత్తుత్తి మాటలలో ముంచి

చిన్నాన్న ఎప్పుడో తీసినది.

తల మీంచి

కొంగు జారిపోకుండా

తొలి నుదుటి రేఖ వరకు లాగుకుంటుంది.

రవికె తొడగని ఎదకు

తొమ్మిది గజాల ఏక వస్త్రం చీర

గుండె చెరువు తడిని

ఒత్తుకుంటుంది.

అనుభవాల ఆత్మ దర్శనానికి

గొంతు ముడత జారి

గుటక మింగింది

వదులు చర్మం ఊగుతోందని

దిగులు పడని చేతి నరం

ఉబ్బు కొచ్చింది.

అందం అచ్చి రాదనుకుంది.

అద్దానికి కొట్టిన మేకును

గుండె గోడకు అడ్డంగా ఆన్చింది.

ఎదురు రానంటుంది

బరువు భుజాల ఎత్తు కష్టాలకు

ఎదురు నిలిచింది.

పాత ఆల్బం పెళ్ళి పేరంటాలలో

వెతికినా కన పడని నాన్నమ్మ

పుత్ర కామేష్టి

ప్రతిఫలాల పాయసాల గిన్నె.

మా జన్మ రాశుల భవితవ్యాలకు

ఎగిరే రెక్కలను అద్దిన

మోటబావి గట్టు.

బంక మట్టి దిన్నె.

అంతర్జాలాల సెల్ఫీలకు అందని

అల్లెత్రాటి కనుమ.

మా జ్ఞాపకాల నిధుల తవ్వకాలలో

కరగని కన్నీటి చెమ్మ.

మా ఊపిరి విశ్వాసాలలో

చెదిరి పోని స్పర్శల

అపురూపమైన భ్రమ.

వెతికి వెతికి దొరక పుచ్చుకున్న

నాన్నమ్మ ఛాయా చిత్రం

మా ఇంటి చదరపు వైశాల్యం

దీపం సెమ్మె.

మరక లంటని మనసు ఫ్రేములో

నిజ చర్మ కాంతుల

లామినేషన్ బొమ్మ..

- రాజేశ్వరి దివాకర్ల

(బెంగళూరు)

First Published:  29 Dec 2022 6:50 AM GMT
Next Story