Telugu Global
Andhra Pradesh

జగన్ కి జై కొట్టిన టీచర్లు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు వైసీపీకే

మొత్తమ్మీద ఈ విజయం వైసీపీకి కొండంత బలాన్నిచ్చింది. ఉపాధ్యాయ వర్గాలు తమకి అనుకూలంగానే ఉన్నాయనే ధైర్యాన్ని వారికి ఇచ్చింది.

జగన్ కి జై కొట్టిన టీచర్లు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు వైసీపీకే
X

ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండింటినీ వైసీపీ గెలుచుకుంది. టీచర్లంతా జగన్ కే జై కొట్టారు, వైసీపీ బలపరచిన అభ్యర్థుల్ని గెలిపించారు. తూర్పు రాయలసీమ నియోజకవర్గంలో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గెలుపొందగా, పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో ఎం.వి. రామచంద్రారెడ్డి విజయం సాధించారు. మొత్తమ్మీద టీచర్ నియోజకవర్గంలో తొలిసారిగా అభ్యర్థుల్ని నిలబెట్టి, విజయం అందుకుని వైసీపీ రికార్డ్ సృష్టించింది.

పోరుబాట, ఉద్యమబాట.. ఏమయ్యాయి..?

సీపీఎస్ రద్దుకోసం రాష్ట్రం అట్టుడికిపోయేలా ఆందోళనలు చేశారు టీచర్లు. వేషాలు మార్చి రైళ్లలో, బస్సుల్లో విజయవాడకు వెళ్లారు, ధర్నాలు చేశారు, అరెస్ట్ లు అయ్యారు, ఇప్పటికీ కేసులు ఎదుర్కొంటున్నారు. పీఆర్సీ పిసరంతే అంటూ నొచ్చుకున్నారు. బకాయిలు విడుదల కావడంలేదంటూ గొడవ గొడవ చేశారు. ఫేస్ యాప్ పెట్టారని, మరుగుదొడ్లు ఫొటోలు తీసి పెట్టాలంటున్నారని, కోడిగుడ్లు, కొత్త షూస్.. అన్నిటికీ తమకే బాధ్యత అప్పగించారని తెగ ఇదైపోయారు టీచర్లు. తీరా చివరికి జగన్ కే జై కొట్టారు. అంటే ఉపాధ్యాయుల్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత లేనట్టే అని తేలిపోయింది.

ప్రైవేటు ఓట్లు కీలకం..

ఈసారి ప్రైవేటు టీచర్లకి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వచ్చాయి. వైసీపీ నిలబెట్టిన అభ్యర్థులు కూడా ప్రైవేట్ విద్యా సంస్థల్లో మంచి బలుకుబడి ఉన్న వ్యక్తులే. అలాంటి వారికి ప్రైవేటు ఓట్లన్నీ గుంపగుత్తగా వెళ్లాయనుకున్నా.. ప్రభుత్వ ఓట్లు పడకపోతే వారి విజయం సాధ్యమయ్యేది కాదు. ఓటుకి రూ.5వేలు లెక్కగట్టారనే విమర్శలున్నా.. టీచర్లు ఆత్మప్రభోదానుసారం ఓటు వేస్తారనే అంచనాలు మాత్రం ఉన్నాయి. చివరకు వారు అదే చేశారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీకి విజయం అందించారు.

అన్నిటికీ ఒప్పుకున్నట్టేనా..?

ఎన్నికల్లో మీకే మద్దతిచ్చాం కదా మా సీపీఎస్ సంగతేంటి అని ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రశ్నించగలరా..? ఒకవేళ ప్రశ్నించినా ప్రభుత్వం సానుకూలంగా వింటుందా..? మొత్తమ్మీద ఈ విజయం వైసీపీకి కొండంత బలాన్నిచ్చింది. ఉపాధ్యాయ వర్గాలు తమకి అనుకూలంగానే ఉన్నాయనే ధైర్యాన్ని వారికి ఇచ్చింది.

First Published:  17 March 2023 2:39 AM GMT
Next Story