Telugu Global
Andhra Pradesh

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కేంద్రంలో కీలక హోదా

రాజ్యసభ సభ్యుడు కావడంతో ఆయన పార్లమెంటుకు సంబంధించి రెండు స్టాండింగ్ కమిటీల్లో చైర్మన్‌గా ఉన్నారు.

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కేంద్రంలో కీలక హోదా
X

వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ వి.విజయసాయి రెడ్డికి కీలక హోదా లభించింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా ఆయనను నామినేట్ చేశారు. ఈ మేరకు సాయిరెడ్డి తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు. తాను పీఏసీ సభ్యుడిగా నామినేట్ అయ్యానని.. ఈ అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు పీయుష్ గోయల్, ప్రహ్లాద్ జోషికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆయన ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. వైసీపీ ప్రస్తుతం పార్లమెంటులో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉన్నది. వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా విజయసాయి రెడ్డి రెండో సారి తిరిగి నామినేట్ అయ్యారు.

వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధినేతగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా విజయసాయి రెడ్డి ఢిల్లీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు కావడంతో ఆయన పార్లమెంటుకు సంబంధించి రెండు స్టాండింగ్ కమిటీల్లో చైర్మన్‌గా ఉన్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆన్ టూరిజం అండ్ కల్చర్, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆన్ ట్రాన్స్‌పోర్ట్‌లకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయనకు పీఏసీ సభ్యుడి హోదా కూడా లభించడంతో వైసీపీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఇటీవల ఆయన రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆయన పేరును తొలగించారు. రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ జాబితాను సవరించడంతో విజయసాయిరెడ్డితో పాటు ఎన్సీపీ ఎంపీ వందనా చవాన్, మరో ఎంపీ ఇందు బాల గోపాల స్వామి పేర్లు మాయమయ్యాయి. సాయిరెడ్డి పేరు లిస్టు నుంచి మాయం కావడం వెనుక వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ప్రమేయం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఈ పరిణామంపై ప్రతిపక్ష టీడీపీ కూడా పలు విమర్శలు చేసింది.

అయితే రాజ్యసభ ప్యానెల్ జాబితా నుంచి ఆయన పేరు తొలగించబడిన కొన్ని రోజుల్లోనే కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సభ్యుడి హోదా లభించడం చర్చనీయాంశంగా మారింది. స్వతహాగా చార్టెడ్ అకౌంటెంట్ అయిన సాయిరెడ్డికి ఈ హోదా సరిగా సరిపోతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

First Published:  14 Dec 2022 12:40 AM GMT
Next Story