Telugu Global
Andhra Pradesh

నన్ను ఇరికిస్తున్నారు.. ఇది నిజం: వైఎస్ అవినాష్ రెడ్డి

వివేకా కుమార్తె సునీత సీబీఐకి మొదట ఇచ్చిన వాంగ్మూలానికి, రెండోసారి ఇచ్చిన వాంగ్మూలానికి చాలా తేడాలున్నాయని చెప్పారు వైఎస్ అవినాష్ రెడ్డి. సునీత స్టేట్ మెంట్ పై అనుమానాలు ఉన్నాయని అన్నారు.

వైఎస్ అవినాష్ రెడ్డి
X

వైఎస్ అవినాష్ రెడ్డి

పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించేందుకు వచ్చిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ వివేకా హత్యకేసు విచారణపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. సీబీఐ ఇప్పటి వరకూ ఒక్క కోణంలోనే దర్యాప్తు చేస్తోందని అన్నారాయన. రెండేళ్లుగా తానీ కేసుని సీరియస్ గా తీసుకోలేదని, కానీ తనకు ఇప్పుడు ఓ విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు అవినాష్ రెడ్డి. కావాలనే తనను ఈ కేసులో ఇరికించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని చెప్పారు. కుట్రపూరితంగా తనను ఈ కేసులో ఇరికిస్తున్నారని మండిపడ్డారు. తనలాంటి ఎంపీనే సీబీఐ ఇలా ఇబ్బంది పెడితే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు అవినాష్ రెడ్డి.

సునీత వాంగ్మూలంపై అనుమానాలు..

వివేకా కుమార్తె సునీత సీబీఐకి మొదట ఇచ్చిన వాంగ్మూలానికి, రెండోసారి ఇచ్చిన వాంగ్మూలానికి చాలా తేడాలున్నాయని చెప్పారు అవినాష్ రెడ్డి. సునీత స్టేట్ మెంట్ పై అనుమానాలు ఉన్నాయని అన్నారు. వివేకా రాసిన లేఖ, సెల్‌ ఫోన్‌ ను సాయంత్రం వరకు దాచిపెట్టి ఆ తర్వాత బయటపెట్టారని, ఆ కోణంలో సీబీఐ ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు అవినాష్ రెడ్డి. లేఖ, సెల్ ఫోన్ ఎందుకు దాచిపెట్టారని వారిని ప్రశ్నించారా అని అడిగారు. వివేకా హత్య కేసులో నిజాలు బయటకు రావాలని కోరుకుంటున్నానని, తాను ఏ తప్పూ చేయలేదని చెప్పారు.

ఆరోజు ఎక్కడున్నానంటే..?

వివేకా హత్య జరిగిన రోజు తాను జమ్మలమడుగు వెళ్తున్నానని చెప్పారు అవినాష్ రెడ్డి. పులివెందుల రింగ్‌ రోడ్డు వరకు వెళ్లాక శివప్రకాశ్‌ రెడ్డి నుంచి ఫోన్‌ వచ్చిందని, ఆ వెంటనే తాను వెనుదిరిగి వచ్చానన్నారు. ఆరోజు తనతోపాటు మరో 20మంది జమ్మలమడుగు వస్తున్నారని, వారిని అడిగినా ఆ విషయం చెబుతారని గుర్తు చేశారు. వివేకా హత్య జరిగిన రోజు తాను ఇంట్లోనే ఉన్నట్టు చూపించి కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అవినాష్ రెడ్డి.

First Published:  25 April 2023 4:36 PM GMT
Next Story