Telugu Global
Andhra Pradesh

మీడియా ముసుగులో ఓవర్ యాక్షన్ చేయొచ్చా..?

తెలుగుదేశం పార్టీకి మద్దతుగా అప్పట్లో కాంగ్రెస్ ను, ఇప్పుడు వైసీపీని అదేపనిగా వ్యతిరేకిస్తూ బురదచల్లేస్తున్న ఎల్లోమీడియా ఫోర్త్ పిల్లర్ ఎలాగవుతుంది..?

మీడియా ముసుగులో ఓవర్ యాక్షన్ చేయొచ్చా..?
X

మీడియా ముసుగులో ఎంత ఓవర్ యాక్షన్ చేసినా చెల్లిపోతుందని ఎల్లోమీడియా యాజమాన్యాలు అనుకుంటున్నాయి. అందుకనే ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా దాదాపు 15 ఏళ్ళుగా బురద చల్లేస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ వైసీపీనే గెలుస్తుందనే టెన్షన్‌తో జగన్ తో పాటు మంత్రులు, నేతలపైన కూడా బుర్రకు తోచినట్లు కథనాలు, వార్తలతో బురద చ‌ల్లుతున్నారు. దాని ఫ‌లితమే కర్నూలులో వైసీపీ నేతల దాడి. ‘పత్రికలపై పగబట్టిన వైకాపా’ అనే బ్యానర్ స్టోరీని అచ్చేసుకుంది.

కర్నూలు నడిబొడ్డున ఉన్న ఈనాడు ఆఫీసు మీదకు వైసీపీ కార్యకర్తలు దాడిచేశారని గోలచేసింది. ఫొటోలను కూడా ప్రింట్ చేసింది. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు ఈనాడు ఆఫీసుపై దాడిచేసి బీభ‌త్సం చేశారట. మీడియా అన్నది ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్ అని ఓవర్ యాక్షన్ చేసింది. నిజానికి మీడియా ఫోర్త్ పిల్లర్ అన్నది వాస్తవమే, కానీ ఎప్పుడంటే నిష్పక్షపాతంగా ఉన్నపుడు మాత్రమే. ఫోర్త్ పిల్లర్ అన్నది ఎల్లోమీడియాకు వర్తించదు. ఎందుకంటే తాము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమని చాలాకాలం క్రితమే ఈనాడు ఛైర్మన్ రామోజీరావు స్వయంగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.

తెలుగుదేశం పార్టీకి మద్దతుగా అప్పట్లో కాంగ్రెస్ ను, ఇప్పుడు వైసీపీని అదేపనిగా వ్యతిరేకిస్తూ బురదచల్లేస్తున్న ఎల్లోమీడియా ఫోర్త్ పిల్లర్ ఎలాగవుతుంది..? మీడియా ముసుగులో ఎంత ఓవర్ యాక్షన్ చేసినా చెల్లుబాటు అవుతుందని యాజమాన్యాలు అనుకోవటమే బరితెగింపుప‌కు కారణం. అందుకనే ప్రస్తుత పరిస్థితి దాపురించింది. టార్గెట్ చేసుకుని పదేపదే బురదచల్లేస్తుంటే ఎవరు మాత్రం ఎంతకాలం ఓర్చుకుంటారు..?

మొన్నటి రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్ర‌జ్యోతి ఫొటోగ్రాఫర్ పైన దాడిచేసినట్లు రాశారు. అసలు వైసీపీ సభకు ఎల్లోమీడియా ఫొటో గ్రాఫ‌ర్ ఎందుకు వెళ్ళినట్లు..? తమ సభలు, ప్రెస్ మీట్లకు ఎల్లోమీడియాను రావద్దని వైసీపీ బ్యాన్ చేసింది. 2014 ఎన్నికలకు ముందే సాక్షి మీడియాను చంద్రబాబునాయుడు బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోకి సాక్షి మీడియాకు ఎంట్రీలేదు. ఆ తర్వాత ఎల్లోమీడియాను వైసీపీ బ్యాన్ చేసింది.

అలాంటప్పుడు సిద్ధం సభకు ఎల్లోమీడియా వెళ్ళి డబ్బులిస్తే వచ్చారా..? బిర్యానీ, క్వార్టర్ మందు బాటిల్ తీసుకుని వచ్చారా..? అని గుచ్చిగుచ్చి జనాలను అడగాల్సిన అవసరం ఏమొచ్చింది..? ఎంతచెప్పినా వినకుండా అదే పద్దతిలో సదరు ఫొటో గ్రాఫర్ అడిగారు కాబట్టే దాడి జరిగినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. కాబట్టి పరిమితులు మరచిపోయి మీడియా ముసుగులో ఓవర్ యాక్షన్ చేస్తే ఫలితం ఇలాగే ఉంటుందని వైసీపీ శ్రేణులు చూపించారు.

First Published:  21 Feb 2024 5:55 AM GMT
Next Story