Telugu Global
Andhra Pradesh

జగన్ సభపై ఎల్లో మీడియా ఏడుపు..

సభకు వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోతున్నారంటూ ఈనాడులో వచ్చిన ఆర్టికల్ హాస్యాస్పదంగా అనిపిస్తోంది. జగన్ ని చూడటానికి వచ్చినవాళ్లు, స్వచ్ఛందంగా వచ్చిన వాళ్లు.. మధ్యలోనే ఎందుకు వెళ్లిపోతారు..? ఆమాత్రం లాజిక్ ఈనాడుకి ఎందుకు తట్టలేదు.

జగన్ సభపై ఎల్లో మీడియా ఏడుపు..
X

లక్షలమంది తరలి వచ్చి సిద్ధం సభల్ని సూపర్ హిట్ చేస్తేనే.. జనాలు లేరని ఎల్లో మీడియా ఏడుపుగొట్టు వార్తలిచ్చింది. ఇప్పుడు బస్సు యాత్రని సైతం వదిలిపెడుతుందని ఎవరూ అనుకోలేదు. ఆ అంచనాలకు తగ్గట్టే 'జగన్ బస్సు యాత్ర తుస్సు' అంటూ కథనాలు వండి వార్చింది. గతంలో కడప జిల్లాలో ఎప్పుడూ ఈ స్థాయిలో సభ జరగలేదని, ఇంతమంది జనం రాలేదని ప్రొద్దుటూరులో స్వయంగా చెప్పారు సీఎం జగన్. బస్సు యాత్రకు తరలి వచ్చిన జనసందోహాన్ని సోషల్ మీడియా కళ్లకు కట్టింది. కానీ ఎల్లో మీడియాకు మాత్రం అది సరిపోలేదు. ఇడుపుల పాయలో జనాలు లేరని, బస్సు యాత్రలో కూడా జనం కనపడలేదని, చివరకు ప్రొద్దుటూరులో కూడా లేరంటూ తన కడుపుమంట బయటపెట్టుకుంది.

వెళ్లిపోవడానికి వస్తారా..?

పోనీ ప్రభుత్వ కార్యక్రమం అంటే.. వాలంటీర్లను, డ్వాక్రా సిబ్బందిని తరలించారనుకోవచ్చు. ఇప్పుడు జరుగుతోంది పూర్తిగా పార్టీ కార్యక్రమం. తమ అభిమాన నాయకుడు జగన్ ని దగ్గర్నుంచి చూడాలనే ఉద్దేశంతో వైసీపీ అభిమానులు, కారక్యకర్తలు లక్షలాదిగా తరలి వస్తున్నారు. ప్రొద్దుటూరు సభ కూడా అదే స్థాయిలో సక్సెస్ అయిందని అంటున్నారు ఆ పార్టీ నేతలు. అయితే సభకు వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోతున్నారంటూ ఈనాడులో వచ్చిన ఆర్టికల్ మాత్రం హాస్యాస్పదంగా అనిపిస్తోంది. జగన్ ని చూడటానికి వచ్చినవాళ్లు, స్వచ్ఛందంగా వచ్చిన వాళ్లు.. మధ్యలోనే ఎందుకు వెళ్లిపోతారు. ఆమాత్రం లాజిక్ ఈనాడుకి ఎందుకు తట్టలేదు.

ప్రజాగళం సంగతేంటి..?

పలమనేరు ప్రజాగళం మండుటెండలో ప్రారంభమైంది. అరగంటలోనే చంద్రబాబు ప్రసంగం ముగిసింది. అంటే జనం ఏమేరకు వచ్చి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ సోషల్ మీడియాలో మాత్రం జనం గుంపులు గుంపులుగా కనపడ్డారు. కారణం, బ్యానర్ల మధ్య వారిని పోగు చేయడమే. జగన్ పెట్టింది బహిరంగ సభ, చంద్రబాబుది రోడ్లకి ఇరువైపులా బ్యానర్లు కట్టి ఇరుకు సందుల్లా మార్చేసి నిర్వహించిన రోడ్ షో. ఈ రెండిటికీ చాలా తేడా ఉంది. కానీ ఎల్లోమీడియా సెల్ఫ్ డబ్బా మాత్రం ఓ రేంజ్ లో కొట్టుకుంటోంది.

First Published:  28 March 2024 1:45 AM GMT
Next Story