Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు వ్యూహ కమిటీలో వైసీపీ ఎంపీ?

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవటానికి శనివారం రాత్రి చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయ‌న‌ను రిసీవ్ చేసుకున్న టీడీపీ ఎంపీలతో పాటు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ‌రాజు కూడా ఉన్నారు.

చంద్రబాబు వ్యూహ కమిటీలో వైసీపీ ఎంపీ?
X

చంద్రబాబు నాయుడు వ్యూహ కమిటీలో వైసీపీ ఎంపీ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. చంద్రబాబు ఢిల్లీ టూర్‌లో ఈ విషయం చాలా స్పష్టంగా బయటపడింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవటానికి శనివారం రాత్రి చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయ‌న‌ను రిసీవ్ చేసుకున్న టీడీపీ ఎంపీలతో పాటు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ‌రాజు కూడా ఉన్నారు. చంద్రబాబును రిసీవ్ చేసుకోవటమే కాకుండా వాళ్ళతోనే కలిసి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఇంటికి వెళ్ళారు.

అక్కడే ఎంపీలు, మాజీ ఎంపీలతో చంద్రబాబు గంటపాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో కూడా రఘురామ‌రాజు పాల్గొన్నారు. అమిత్ షాతో మాట్లాడాల్సిన పాయింట్లపై అందరూ కలిసి చర్చించుకున్నారట. అంటే చంద్రబాబు వ్యూహ కమిటీలో వైసీపీ ఎంపీ కూడా కీలకంగా ఉన్నట్లు అర్థ‌మవుతోంది. నిజానికి సొంత పార్టీతో చెడిన తర్వాత చంద్రబాబు కోసం రఘురామ‌రాజు పనిచేస్తున్న విష‌యం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టడమే టార్గెట్‌గా రెబల్ ఎంపీ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. అక్రమార్జన కేసుల్లో జగన్ బెయిల్ రద్దు చేయించాలని పోరాటం చేశారు. వైసీపీ గుర్తింపు రద్దు చేయాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. జగన్ ప్రభుత్వానికి సహకరించవద్దని కేంద్రంలోని మంత్రులకు లేఖలు రాస్తున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షాను కలిసినప్పుడ‌ల్లా జగన్‌పై ఫిర్యాదులు చేస్తున్నారు. పనిలోపనిగా టీడీపీతో పొత్తు కోసం ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నారు.

మొత్తానికి ఎవరి కృషి ఫలించిందో.. లేకపోతే కర్నాటక ఎన్నికల్లో ఓటమి ప్రభావమో గానీ అమిత్ షా-చంద్రబాబు భేటీ అయ్యారు. వీళ్ళ భేటీ తర్వాత చంద్రబాబు మళ్ళీ గుంటూరు ఎంపీ జయదేవ్ క్వార్టర్స్‌కే చేరుకున్నారు. అమిత్ షాతో సమావేశం వివరాలను చంద్రబాబు వివరించారు. ఈ భేటీలో కూడా రఘురామ‌రాజు ఉన్నారు. జరిగింది చూసిన తర్వాత చంద్రబాబు వ్యూహ కమిటీలో వైసీపీ ఎంపీ కీలక పాత్ర పోషిస్తున్నట్లు అర్థ‌మవుతోంది. ఈయన సమస్య ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా మళ్ళీ గెలవటమే. టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తేనే సాధ్యమవుతుందని రెబల్ ఎంపీ అనుకుంటున్నారు. ఎంపీగా గెలవకపోతే రఘురామ‌రాజ పరిస్థితి ఘోరంగా తయారవుతుంది. అందుకనే తన అవసరాల కోసమే రెబల్ ఎంపీ ఇంతగా కష్టపడుతున్నది.

First Published:  4 Jun 2023 5:31 AM GMT
Next Story