Telugu Global
Andhra Pradesh

పులివెందులపై తనకు పక్కా సమాచారం ఉందంటున్న డీఎల్‌

జనవరి 3న సుప్రీంకోర్టులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు రాబోతోందని, ఆరోజు వివేకా కేసుకు సంబంధించిన సంచలనమైన అంశాలను కోర్టుకు సీబీఐ సమర్పించబోతుందన్నారు.

పులివెందులపై తనకు పక్కా సమాచారం ఉందంటున్న డీఎల్‌
X

జగన్‌ ప్రభుత్వంపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వరుసగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వైసీపీ చేరిన ఆయన్ను పెద్దగా పార్టీ పట్టించుకోకపోవడంతో అసంతృప్తితో ఉన్నా ఆయన.. సొంత పార్టీపైనే విమర్శలు చేస్తున్నారు. ఒక చానల్‌ వద్ద ఆయన జగన్ పాలనపై కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో పరిస్థితి ఎలా ఉందో తన అభిప్రాయం చెప్పారు.

జగన్‌ పాలనలో ఏపీ శ్మశానం అయిపోయిందన్నారు. వర్షాలు ఎక్కువై కడప జిల్లాలో పంటలు కూడా పండని స్థితి వచ్చినా ఏ ఒక్క నాయకుడు వచ్చి పరిశీలించడం లేదన్నారు. జనవరి 3న సుప్రీంకోర్టులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు రాబోతోందని, ఆరోజు వివేకా కేసుకు సంబంధించిన సంచలనమైన అంశాలను కోర్టుకు సీబీఐ సమర్పించబోతుందన్నారు. సీబీఐ నివేదికలో ఊహించని వ్యక్తుల పేర్లు కూడా బయటకు రాబోతున్నాయన్నారు. నిందితుల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్న వ్యక్తులు ఎవరు అన్న దానిపై సీబీఐ వివరాలను సిద్ధం చేసిందన్నారు. తాడేపల్లి పెద్దల వివరాలు కూడా జనవరి 3న బయటకు వస్తాయన్నారు.

బీజేపీకి కూడా గ్రౌండ్ రియాలిటీ అర్థ‌మైందని, అందుకే ఇక వైసీపీ నేతలను వెనుకేసుకొచ్చే పరిస్థితి లేదని.. సీబీఐకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా తనకు సమాచారం ఉందన్నారు. గత విచారణ సందర్భంగానే సుప్రీంకోర్టు ధర్మాసనం వివేకా హత్య వెనుక ఉన్న అసలైన శక్తులను వెలికి తీయాలని చెప్పిందన్నారు. తప్పకుండా వైఎస్ సునీత పోరాటానికి న్యాయం జరుగుతుందన్నారు.

పత్రికల్లో వస్తున్న విషయాలన్నీ వాస్తవమేనని.. కానీ వాటిని అవాస్తవం అని నమ్మించేందుకు నిత్యం పత్రికలపై జగన్‌మోహన్ రెడ్డి రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని డీఎల్ వ్యాఖ్యానించారు. తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్‌ లాంటి విఫల ముఖ్యమంత్రిని తాను చూడలేదన్నారు. జగన్ అప్పు చేసి పప్పు కూడు పెడుతున్నారన్నది జనానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోందన్నారు.

ఈసారి ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ సరైన అభ్యర్థులను నిలిపితే 10 స్థానాలకు ఆరు స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. డబ్బులు ఖర్చు చేసినా వైసీపీ గెలిచే పరిస్థితి లేదన్నారు. టీడీపీ- జనసేన కలిస్తే మాత్రం వైసీపీ సింగిల్ డిజిట్‌కు పరిమితం అవుతుందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఆరెండు పార్టీలు కలవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో తాను కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలకు ఇన్‌చార్జ్‌ మంత్రిగా పనిచేశానని.. ఆ పరిచయాలు ఉన్నాయని.. తన మీడియా సమావేశం ముగిసిన తర్వాత ఆ జిల్లాల నుంచి పలువురు ఫోన్లు చేసి.. లోకల్‌లో ఇప్పటికే టీడీపీ- జనసేన శ్రేణులు జగన్‌ను ఓడించేందుకు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారన్నారు.

టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ కలిస్తే ఓటింగ్ పరంగా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు గానీ.. ఎన్నికల్లో వైసీపీ ఆగడాలను ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుందన్నారు. పులివెందులలో కూడా జగన్‌కు పరిస్థితి అనుకూలంగా లేదని.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విష‌యంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. పులివెందుల నియోజకవర్గంలో తనకు బంధుత్వాలు ఉన్నాయని.. పక్కా సమాచారం తనకు ఉందని.. వైఎస్ అనివాష్ రెడ్డి రోజూ ఉదయమే గ్రామాలకు వెళ్లి ఎక్కడైతే వైసీపీ నేతలు అసంతృప్తితో ఉన్నారో వారికి నేరుగా డబ్బులు ఇచ్చి బుజ్జగించే పనులు చేస్తున్నారని డీఎల్ రవీంద్రారెడ్డి చెప్పారు.

జగనే ఒక పెద్ద పెత్తందారి అని.. లక్ష కోట్లు సంపాదించి తిరిగి ఆయనే పేదలకు పెత్తందార్లకు మధ్య రాష్ట్రంలో పోరు నడుస్తోందని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అనేక ఆర్థిక ఇబ్బందులు పడ్డారని అయినా సరే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం ఏనాడు డబ్బు కోసం కక్కుర్తి పడలేదన్నారు. జగన్‌ వచ్చిన తర్వాతే విచ్చలవిడి తనానికి దారి తీసిందన్నారు.

First Published:  22 Dec 2022 3:53 AM GMT
Next Story