Telugu Global
Andhra Pradesh

మళ్లీ ఒక్కటైన మిత్రులు.. బయోగ్రఫీ రాసే బాధ్యత యండమూరికి అప్ప‌గింత‌

విశాఖపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి, ఏఎన్ఆర్ శత జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి పాల్గొన్నారు.

మళ్లీ ఒక్కటైన మిత్రులు.. బయోగ్రఫీ రాసే బాధ్యత యండమూరికి అప్ప‌గింత‌
X

కొన్నేళ్లుగా దూరమైన మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ మళ్లీ ఒక్కటయ్యారు. తన జీవిత చరిత్ర పుస్తకం రాసే బాధ్యతను చిరంజీవి యండమూరికి అప్పగించారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి వెల్లడించారు. 80వ దశకంలో చిరంజీవి -యండమూరి కాంబినేషన్లో పలు హిట్ చిత్రాలు వచ్చాయి. చిరంజీవి, యండమూరి ఎంతో సన్నిహితులుగా మెలిగేవారు. కాగా, 8 ఏళ్ల కిందట చిత్తూరు జిల్లాలోని ఓ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న యండమూరి వీరేంద్రనాథ్.. హీరో రామ్ చరణ్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

మెగా బ్రదర్ నాగబాబు యండమూరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి నాగబాబు -యండమూరి కొద్దిరోజుల పాటు పరస్పరం దూషించుకున్నారు. అప్పటినుంచి చిరంజీవి, యండమూరికి మధ్య దూరం పెరిగింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరూ మళ్లీ క‌లిసిపోయారు.

ఇవాళ విశాఖపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి, ఏఎన్ఆర్ శత జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యండమూరి వీరేంద్రనాథ్ ను చిరంజీవి సత్కరించి సాహిత్య పురస్కారం అందజేశారు. కార్యక్రమంలో చిరంజీవి ప్రసంగిస్తూ.. తన జీవిత చరిత్ర పుస్తకం రాసే బాధ్యతను యండమూరికి అప్పగిస్తున్నట్లు సభా వేదికగా ప్రకటించారు.

ఈ సందర్భంగా యండమూరి కూడా చిరంజీవిని ప్రశంసించారు. సినీ రంగంలో నెంబర్ వన్ అవడం కాదు.. నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టమని చెప్పారు. చిరంజీవి కష్టపడి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. ఇన్నేళ్ల తర్వాత మిత్రులు మళ్లీ ఒక్కటవడం ఆ ఇద్దరి అభిమానుల్లో ఆనందం నింపింది.

First Published:  20 Jan 2024 11:01 AM GMT
Next Story