Telugu Global
Andhra Pradesh

కుప్పంలో బీసీకి టికెట్ ఇస్తారా..? నెటిజన్లు ఫైర్

పులివెందుల విషయంలో జగన్‌కు చేసిన సవాల్‌ను ముందు కుప్పంలో చంద్రబాబు ఆచరణలోకి తీసుకురావాలని డిమాండ్లు పెరిగిపోతున్నాయి. జగన్ రాజకీయ జీవితం మొదలుపెట్టింది కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ నుంచే అని అందరికీ తెలిసిందే.

కుప్పంలో బీసీకి టికెట్ ఇస్తారా..? నెటిజన్లు ఫైర్
X

నిజంగానే బీసీ సామాజికవర్గం మీద చిత్తశుద్ది ఉంటే జగన్మోహన్ రెడ్డి పులివెందులలో బీసీ నేతకు టికెట్ ఇచ్చి పోటీచేయించాలని చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేశారు. ఈ ఛాలెంజ్‌ను జగన్ స్వీక‌రిస్తారా..? లేకపోతే ఇగ్నోర్ చేస్తారా..? అన్నది తనిష్టం. అయితే ఇదే ఛాలెంజ్ చంద్రబాబుకు ఎదురు తగులుతోందిప్పుడు. ఎలాగంటే.. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని చంద్రబాబు చాలా సందర్భాల్లో చెప్పారు. బీసీలను ఉద్ధరించేందుకే టీడీపీ ఉన్నట్లుగా ఎన్నోసార్లు చెప్పుకున్నారు.

ఎన్టీఆర్ టీడీపీని మొదలుపెట్టిన తర్వాతే బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత పెరిగిందని ఎన్నో బహిరంగ సభల్లో చెప్పారు. మరి టీడీపీ అంటేనే బీసీల పార్టీ అన్నప్పుడు కుప్పంలో ఒక బీసీ నేతకు టికెట్ ఎందుకు ఇవ్వకూడదని ఇప్పుడు నెటిజన్లు చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నారు. పులివెందులలో బీసీ నేతకు టికెట్ ఇవ్వమని చెప్పటం కన్నా కుప్పంలో బీసీ నేతకు టికెట్ ఇవ్వటం చంద్రబాబు చేతిలోనే ఉన్న విషయాన్ని సోషల్ మీడియా గుర్తుచేస్తోంది.

పులివెందుల విషయంలో జగన్‌కు చేసిన సవాల్‌ను ముందు కుప్పంలో చంద్రబాబు ఆచరణలోకి తీసుకురావాలని డిమాండ్లు పెరిగిపోతున్నాయి. జగన్ రాజకీయ జీవితం మొదలుపెట్టింది కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ నుంచే అని అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు రాజకీయ జీవితం మొదలుపెట్టింది, కుప్పం నుంచి కాదు. సొంత నియోజకవర్గం చంద్రగిరి నుంచి రాజకీయ జీవితం మొదలుపెట్టారు. 1983లో చంద్రగిరిలో ఓడిపోయిన తర్వాత సొంత నియోజకవర్గంలో మళ్ళీ గెలుస్తామని నమ్మకంలేకపోవటంతోనే ఎక్కడో మారుమూల వెనుకబడిపోయిన నియోజకవర్గమైన కుప్పంను ఎంచుకున్నారు.

1989 ఎన్నికల నుంచి కుప్పంలోనే చంద్రబాబు పోటీచేస్తున్నారు. తాను కుప్పంను బీసీ నేతకు వదిలేసి ఇంకెక్కడైనా పోటీచేస్తానని కాబట్టి జగన్ కూడా పులివెందులలో బీసీని పోటీచేయించాలని చంద్రబాబు అంటే అర్థ‌ముంది. ఛాలెంజ్ విసరటమే కానీ, స్వీకరించేంత ధైర్యం చంద్రబాబుకు లేదని అందరికీ తెలుసు. అందుకనే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎదురు ఛాలెంజ్‌కు చంద్రబాబు సమాధానం చెప్పటంలేదు.

First Published:  16 Dec 2023 6:00 AM GMT
Next Story