Telugu Global
Andhra Pradesh

డైరెక్టర్ నోరు జారాడు.. వీరయ్యతో జగన్ కు పేచీ

అందరూ బాగానే మాట్లాడారు. కానీ దర్శకుడు బాబీ ఎందుకో కాస్త భావోద్వేదానికి గురయ్యారు. చిరంజీవిని పొగిడే క్రమంలో, ఆయన పవన్ కల్యాణ్ ని ఆకాశానికెత్తేశారు, పవన్ కల్యాణ్ ని తిట్టేవారిపై సెటైర్లు వేశారు.

డైరెక్టర్ నోరు జారాడు.. వీరయ్యతో జగన్ కు పేచీ
X

వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య. సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్న సినిమాలివి. అయితే ఈ సినిమాలతో ఏపీ సీఎం జగన్ కు పరోక్షంగా లింకు పెడుతూ వార్తలొస్తున్నాయి. ఇటీవల జీవో నెంబర్-1 వల్ల ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు కాస్త ఇబ్బంది పడ్డాయి. ఆ తర్వాత ఎలాగోలా ఆ కార్యక్రమాలు పూర్తయ్యాయనుకోండి. ఇక వీరసింహారెడ్డిలో సీఎం జగన్ ని కావాలనే టార్గెట్ చేసి పొలిటికల్ డైలాగులు పెట్టారని అంటున్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పు వ్యవహారాన్ని అందులో టచ్ చేశారు. ఇప్పుడు వాల్తేరు వీరయ్య కూడా యాంటీ జగన్ అనే అపవాదుని మూటగట్టుకుంటోంది.

కారణం ఏంటి..?

వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో ఘనంగా జరిగింది. అందరూ బాగానే మాట్లాడారు. కానీ దర్శకుడు బాబీ ఎందుకో కాస్త భావోద్వేదానికి గురయ్యారు. చిరంజీవిని పొగిడే క్రమంలో, ఆయన పవన్ కల్యాణ్ ని ఆకాశానికెత్తేశారు, పవన్ కల్యాణ్ ని తిట్టేవారిపై సెటైర్లు వేశారు. చిరంజీవి రాజకీయాలకు సరిపోరని, ఆయన సినిమాల్లోనే ఉండాలని, ఆయన తరపున రాజకీయాల్లో రాణించడానికి పవన్ కల్యాణ్ ఉన్నారని చెప్పారు. ఆయన మాటకు మాట, కత్తికి కత్తి అని పొగిడారు. దేవుడు మీకిచ్చిన తమ్ముడే అన్నీ చూసుకుంటాడని చిరంజీవిని చూపిస్తూ అన్నారు దర్శకుడు బాబీ. పవన్ కల్యాణ్ కి జనాలపై ప్రేమ ఉందని చెప్పారు.


సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినిమా హీరోలు రాజకీయాలు మాట్లాడొచ్చు కానీ, మరీ సినిమా ఫంక్షన్ల ముందు మాట్లాడితే ఏమవుతుందో గతంలో చాలాసార్లు అనుభవంలో ఉన్న విషయమే. అయితే ఇక్కడ చిరంజీవి పాలిటిక్స్ టచ్ చేయలేదు కానీ, దర్శకుడు బాబీ, పవన్ ని మోసేసే క్రమంలో ఏపీ రాజకీయాలను టచ్ చేశారు. పవన్ కత్తికి కత్తి, మాటకు మాట బదులు తీర్చుకునే రకం అన్నారు. పరోక్షంగా పవన్ ని విమర్శించేవారందరిపై బాబీ పంచ్ వేసినట్టుంది.

బాబీ మాట్లాడిన ఆ మాటల్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తోంది వైసీపీ బ్యాచ్. ఇలాంటి వారందిరికీ ముందుంది ముసళ్ల పండగ అంటున్నారు. బాబీ వీడియోని షేర్ చేస్తూ.. ఇంత ఆవేశం అవసరమా అంటూ చురకలంటిస్తున్నారు. ట్రైలర్ లోని డైలాగులతో వీరసింహారెడ్డి ఎలాగూ వైసీపీకి టార్గెట్ అయింది. ఇప్పుడు వాల్తేరు వీరయ్య కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత జగన్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. దీని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

First Published:  9 Jan 2023 5:00 AM GMT
Next Story