Telugu Global
Andhra Pradesh

వైజాగ్ స్టీల్: బిడ్ దాఖలు చేసిన 29 కంపెనీలు

గతంలో 22 సంస్థలు బిడ్డింగ్ కి రాగా.. గడువు పెంచిన తర్వాత మరో ఏడు సంస్థలు ఆసక్తి చూపించాయి. మొత్తంగా బిడ్డింగ్ కి వచ్చిన 29 సంస్థల్లో ఏడు విదేశీ సంస్థలు ఉండటం విశేషం.

వైజాగ్ స్టీల్: బిడ్ దాఖలు చేసిన 29 కంపెనీలు
X

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యవహారంపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. వర్కింగ్‌ క్యాపిటల్‌, ముడిసరకు కోసం విశాఖ ఉక్కు సంస్థ ఎక్స్‌ ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (EOI) కోరుతూ బిడ్లు ఆహ్వానించిన విషయం తెలిసిందే. గత శనివారంతో గడువు ముగిసినా ఐదు రోజులపాటు దాన్ని పొడిగించారు. ఆ లెక్కన ఈరోజు ఆఖరి రోజు. మధ్యాహ్నం 3 గంటలకు గడువు ముగిసింది. మొత్తంగా 29 సంస్థలు బిడ్ లు దాఖలు చేసినట్టు అధికారులు తెలిపారు. గతంలో 22 సంస్థలు బిడ్డింగ్ కి రాగా.. గడువు పెంచిన తర్వాత మరో ఏడు సంస్థలు ఆసక్తి చూపించాయి. మొత్తంగా బిడ్డింగ్ కి వచ్చిన 29 సంస్థల్లో ఏడు విదేశీ సంస్థలు ఉండటం విశేషం.

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఆసక్తి కనబరచలేదు. తెలంగాణ ప్రభుత్వం ముందు ఆసక్తి చూపించినా.. సింగరేణి కాలరీస్ నుంచి ప్రతిపాదన లేని కారణంగా బిడ్డింగ్ కి రాలేదని తెలుస్తోంది. అయితే EOIకి రాని సంస్థలు కూడా టెండర్లకు వెళ్లే అవకాశం ఉందంటున్నాయి కార్మిక సంఘాలు. టెండర్ ప్రక్రియలో విదేశీ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు.

రాజకీయ పోరాటమే శరణ్యమా..?

విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర ప్రభుత్వం పదే పదే మాట మార్చడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం రాజకీయ ఒత్తిడి పెంచేందుకు నిర్ణయించింది. పార్లమెంట్ లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పింది. విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు కూడా తెలంగాణ ప్రభుత్వ పోరాటాన్ని స్వాగతించాయి. తెలంగాణ ప్రభుత్వం EOIకి వచ్చినా రాకపోయినా పార్లమెంట్ లో ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం కొనసాగించాలని కార్మిక సంఘాలు, పోరాట కమిటీ నాయకులు కోరుతున్నారు.

First Published:  20 April 2023 1:56 PM GMT
Next Story