Telugu Global
Andhra Pradesh

మార్గదర్శిపై ఉండవల్లి ఆరోపణలు నిజమేనా..?

ఉండవల్లి ఎన్నిసార్లు ప్రయత్నాలుచేసినా ఇప్పటికీ డిపాజిట్ దారుల వివరాలను మాత్రం రామోజీ ప్రకటించలేదు. ఇక్కడే ఉండవల్లి చేసిన బ్లాక్ మనీ ఆరోపణలు నిజమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

మార్గదర్శిపై ఉండవల్లి ఆరోపణలు నిజమేనా..?
X

మార్గదర్శి చిట్ ఫండ్స్ నిధుల విషయమై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా కాలంగా చేస్తున్న ఆరోపణలే నిజమయ్యేట్లుగా ఉన్నాయి. దశాబ్దాలుగా కోర్టుల్లో నానుతున్న మార్గదర్శి కేసు తొందరలో తుదిద‌శ‌కు చేరేలా కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఉండవల్లి చెబుతున్న మాటలకు మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు వైఖరికి సరిగ్గా సరిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. మార్గదర్శి చిట్ ఫండ్స్ ముసుగులో రామోజీ వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీని సర్క్యులేట్ చేస్తున్నారన్నది ఉండవల్లి ఆరోపణ.

ఎందుకంటే.. మార్గదర్శి చిట్ ఫండ్స్ ముసుగులో హెచ్యూఎఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా డిపాజిట్లు వసూలు చేయటం తప్పని ఇప్పటికే తేలిపోయింది. అందుకనే డిపాజిట్లన్నింటినీ వెనక్కు ఇచ్చేయమని కోర్టు ఆదేశించింది. కొంతకాలం విచారణ తర్వాత రామోజీ సేకరించిన డిపాజిట్లన్నింటినీ వెనక్కిచ్చేసినట్లు చెప్పారు. అయితే ఉండవల్లి సీన్లోకి ఎంటరై మార్గదర్శి వెనక్కిచ్చేసిన డిపాజిట్ దారుల వివరాలను తనకు ఇవ్వమని అడిగారు. అలాగే ఈనాడు పత్రికలోనే డిపాజిట్ దారుల వివరాలను ప్రకటించేట్లుగా ఆదేశించాలని కోర్టును కోరారు.

అయితే ఉండవల్లి ఎన్నిసార్లు ప్రయత్నాలుచేసినా ఇప్పటికీ డిపాజిట్ దారుల వివరాలను మాత్రం రామోజీ ప్రకటించలేదు. ఇక్కడే ఉండవల్లి చేసిన బ్లాక్ మనీ ఆరోపణలు నిజమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. సేకరించిన రూ. 2,600 కోట్లు అచ్చంగా నిజమైన డిపాజిట్ దారుల నుండే అయితే వాళ్ళ వివరాలను పేపర్లో ప్రకటించటానికి అభ్యంతరం ఏమిటన్నది ప్రశ్న. వివరాలను రామోజీ ప్రకటిస్తే అందులో నిజమైన డిపాజిట్ దారులు ఎవరు..? బోగస్ ఎవరన్న విషయం ప్రపంచానికి తెలిసిపోతుంది. ఉండవల్లి ఆరోపణల ప్రకారం చాలామంది బిగ్ షాట్స్ తమ బ్లాక్ మనీని మార్గదర్శిలో దాచుకున్నారట. మార్గదర్శి ముసుగులో రామోజీ చేస్తున్నది చిట్ ఫండ్స్ వ్యాపారం కాదని అసలు వ్యవహారం బ్లాక్ మనీ సర్క్యులేషనే అని చాలాసార్లు ఆరోపించారు.

మాజీ ఎంపీ అంచనాల ప్రకారం మార్గదర్శిలో వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీ సర్క్యులేట్ అవుతోందట. అందులో బ్లాక్ మనీని దాచుకున్న బడాబాబుల బండారమంతా బయటపడుతుందనే డిపాజిట్ దారుల వివరాలను రామోజీ ప్రకటించటంలేదని చాలాసార్లు ఉండవల్లి ఆరోపించారు. మరి కేసు క్లైమ్యాక్స్ కు వస్తున్న సమయంలో అయినా డిపాజిట్ దారుల వివరాలను రామోజీ పేపర్లలో ప్రకటిస్తారా ? ప్రకటించేట్లు కోర్టు ఆదేశిస్తుందా..?

First Published:  23 Feb 2024 5:31 AM GMT
Next Story