Telugu Global
Andhra Pradesh

భూమా ఫ్యామిలీకి అప్పట్లో ఏవీ సుబ్బారెడ్డి ఓ కట్టప్ప.. ఇప్పుడు సీన్ రివర్స్

భూమా దంపతుల మరణం తర్వాత వారి పిల్లలతో ఏవీ సుబ్బారెడ్డికి విభేదాలు మొదలయ్యాయి. భూమా నాగిరెడ్డి బతికి ఉన్నప్పుడు కొన్ని ఆస్తుల్ని ఏవీ సుబ్బారెడ్డి పేరుపై ఉంచారని.. కానీ అతను తిరిగి వాటిని అప్పగించడం లేదనేది ప్రధాన ఆరోపణ.

భూమా ఫ్యామిలీకి అప్పట్లో ఏవీ సుబ్బారెడ్డి ఓ కట్టప్ప.. ఇప్పుడు సీన్ రివర్స్
X

కర్నూలులో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా హింసాత్మక ఘటనకి దారితీశాయి. భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి దంపతులు బతికి ఉన్నంతకాలం వారికి నమ్మిన బంటులా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి.. ఇప్పుడు వారి ఫ్యామిలీకి ప్రధాన రాజకీయ శత్రువుగా మారిపోయారు.

నంద్యాలలోని కొత్తపల్లి వద్ద నారా లోకేష్‌కి స్వాగతం పలికేందుకు పోటీపడిన భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు చివరికి బాహాబాహీకి దిగారు. ఈ క్రమంలో ఏవీ సుబ్బారెడ్డిని రక్తం వచ్చేలా భూమా వర్గీయులు కొట్టారు. దాంతో సుబ్బారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అఖిల ప్రియతో పాటు 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అందర్నీ అరెస్ట్ చేశారు. ఇందులో అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ కూడా ఉన్నారు.

అసలు ఏంటి ఈ గొడవ..?

భూమా దంపతుల మరణం తర్వాత వారి పిల్లలతో ఏవీ సుబ్బారెడ్డికి విభేదాలు మొదలయ్యాయి. భూమా నాగిరెడ్డి బతికి ఉన్నప్పుడు కొన్ని ఆస్తుల్ని ఏవీ సుబ్బారెడ్డి పేరుపై ఉంచారని.. కానీ అతను తిరిగి వాటిని అప్పగించడం లేదనేది ప్రధాన ఆరోపణ. దాంతో నెమ్మదిగా భూమా ఫ్యామిలీకి దూరంగా వెళ్లిపోయిన ఏవీ సుబ్బారెడ్డి ఇప్పుడు నంద్యాలలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేయాలని ఆశిస్తున్నారు. ఇది భూమా ఫ్యామిలీకి మరింత కోపం తెప్పిస్తోంది.

2019 ఎన్నికల తరహాలో మరోసారి ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ, నంద్యాలలో భూమా బ్రహ్మానంద రెడ్డి పోటీ చేయాలనేది భూమా ఫ్యామిలీ ప్లాన్. కానీ ఇప్పుడు నంద్యాల నియోజకవర్గానికి ఏవీ సుబ్బారెడ్డి కూడా రేసులో ఉన్నాడు. ఈ క్రమంలో నంద్యాలలో నారా లోకేష్‌కి ఘన స్వాగతం పలికి తన బలాన్ని చాటుకోవాలని ఏవీ సుబ్బారెడ్డి ఆశించారు. దాంతో చిర్రెత్తిపోయిన అఖిల ప్రియ వర్గం అతనిపై భౌతిక దాడికి దిగింది.

వాస్తవానికి 2019 ఎన్నికలకి ముందు చంద్రబాబు మాటల్ని నమ్మి వైసీపీ నుంచి టీడీపీలోకి భూమా అఖిల ప్రియ వెళ్లింది. అక్కడ చంద్రబాబు మంత్రి పదవిని ఆఫర్ చేయగా.. అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీపడిన అఖిల ప్రియ వైసీపీ అభ్యర్థి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. అప్పట్లో అఖిల ప్రియకి 70,292 ఓట్లు పడగా.. వైసీపీ అభ్యర్థికి 1,05,905 ఓట్లు వచ్చాయి. దాంతో తత్వం బోధపడటంతో అఖిల ప్రియ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘నేను ప్రత్యర్థిపై పోటీ చేస్తున్నాని అనుకున్నా. కానీ వైఎస్ జగన్‌తో అని తర్వాత అర్థమైంది’’ అని పశ్చాతాపం వ్యక్తం చేసింది.

వాస్తవానికి భూమా ఫ్యామిలీ అప్పట్లో వైఎస్‌ కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ వైసీపీలోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ లేదు. దాంతో నంద్యాల, ఆళ్లగడ్డపై మళ్లీ పట్టు కోసం భూమా ఫ్యామిలీ ట్రై చేస్తోంది. ఈ క్రమంలో రెండు నియోజకవర్గాల్లోనూ తమ ఫ్యామిలీ మెంబర్స్ నిలబడి గెలవాలని ఆశిస్తోంది. కానీ ఇప్పుడు ఏవీ సుబ్బారెడ్డి తీరు వారికి పెద్ద తలనొప్పిగా మారింది. దాంతో అతడ్ని అడ్డు తొలగించాలని ఇటీవల హత్యకి కూడా అఖిల ప్రియ భర్త ప్లాన్ చేసినట్లు కడప పోలీసులు గుర్తించి కేసులు నమోదు చేశారు. తాజాగా ఒకరికొకరు ఎదురుపడటం గొడవకి దారితీసింది.

ఒక్క ఫ్యామిలీకి ఒక్కటే టికెట్ అని చంద్రబాబు చెప్పినట్లు ప్రచారం చేసిన ఏవీ సుబ్బారెడ్డి వర్గం.. నారా లోకేష్ పాదయాత్రలోనే నంద్యాల అభ్యర్థిపై ప్రకటన చేయించుకోవాలని పావులు కదిపారు. ఈ క్రమంలోనే బలనిరూపణ కోసం ట్రై చేయగా.. అది కాస్తా వివాదంగా మారిపోయింది.

First Published:  17 May 2023 6:03 AM GMT
Next Story