Telugu Global
Andhra Pradesh

దిష్టిబొమ్మల దహనం, చెప్పులతో సత్కారం.. ఎల్లో మీడియా అవస్థ‌లు

పవన్‌పైన జనాగ్రహం బయటపడకుండా ఉండటం కోసం ఎల్లో మీడియా నానా అవస్థ‌లు పడింది. వలంటీర్ల నిరసనల గురించి ఎల్లో మీడియా ఒక్కటంటే ఒక్క వార్త కూడా కవర్ చేయలేదు. పైగా దీన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్‌వాడీ కార్తకర్తలు, ఆయాల ధర్నాలను బాగా హైలైట్ చేసింది.

దిష్టిబొమ్మల దహనం, చెప్పులతో సత్కారం.. ఎల్లో మీడియా అవస్థ‌లు
X

వ‌లంటీర్‌ వ్యవస్థ‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. చాలా చోట్ల పవన్‌కు వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు, దిష్టిబొమ్మల దహనం లాంటి కార్యక్రమాలతో వలంటీర్లు రెచ్చిపోయారు. పవన్ పోస్టర్లను మహిళా వలంటీర్లు చెప్పులతో కొట్టారు. పవన్‌కు వ్యతిరేకంగా పబ్లిక్‌లో ఇలాంటి నెగిటివ్ రియాక్షన్ రావటం బహుశా ఇదే మొదటిసారి. అందుకనే జనసేన నేతలకు ఏం మాట్లాడాలో కూడా అర్థంకాక దిక్కులు చూస్తున్నారు.

పవన్‌పైన జనాగ్రహం బయటపడకుండా ఉండటం కోసం ఎల్లో మీడియా నానా అవస్థ‌లు పడింది. వలంటీర్ల నిరసనల గురించి ఎల్లో మీడియా ఒక్కటంటే ఒక్క వార్త కూడా కవర్ చేయలేదు. పైగా దీన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్‌వాడీ కార్తకర్తలు, ఆయాల ధర్నాలను బాగా హైలైట్ చేసింది. తన ఆరోపణలపై వలంటీర్లలో ఈ స్థాయి నిరసనలు మొదలవుతాయని ఆలోచించలేదా లేకపోతే తెలిసీ కావాలనే పవన్ ఆరోపణలు చేశారా అన్నది అర్థంకావటంలేదు.

రాష్ట్రంలో 30 వేల మంది ఆడవాళ్ళు మిస్సయ్యారని, హ్యూమన్ ట్రాఫికింగ్‌కు వలంటీర్లే కారణమని ఏలూరు సభలో పవన్ ఆరోపించారు. అక్కడి నుండి వలంటీర్లు బాగా మండిపోతున్నారు. 2.5 లక్షల మంది వలంటీర్ల సేవల విషయంలో మెజారిటీ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య వలంటీర్లు వార‌ధిలా పనిచేస్తున్నారు. కరోనా లాంటి సమయంలో కూడా వలంటీర్లు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఇలాంటి వ్యవస్థ‌పై పవన్ నోరుపారేసుకోవటంతో వలంటీర్లు ఆగ్రహంతో రెచ్చిపోయారు.

పవన్ వ్యాఖ్యలతో జరిగే డ్యామేజ్‌ని కంట్రోల్ చేయటానికి ఎల్లో మీడియా రంగంలోకి దిగింది. పవన్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, ఆందోళనలకు ఎల్లో మీడియా ప్రాధాన్యత ఇవ్వలేదు. పవన్ ఆరోపణలకు మద్దతుగా మిగిలిన ప్రతిపక్షాలు కూడా ఎక్కడా నోరు విప్పలేదు. సినీ నటడిగా అభిమానుల నుండి కటౌట్లు, పోస్టర్లపై పూలవర్షం, పాలాభిషేకాలను మాత్రమే ఎంజాయ్ చేసిన పవన్‌కు ఇప్పుడు దిష్టిబొమ్మల దహనం, చెప్పులతో సత్కారం జరుగుతోంది. తన ఆరోపణలను ఉపసంహరించుకుంటారని అనుకుంటే మరోసారి అవే వ్యాఖ్యలు చేసి వలంటీర్లను మరింతగా రెచ్చగొట్టారు. మరీ వివాదం ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి.

First Published:  11 July 2023 5:35 AM GMT
Next Story