Telugu Global
Andhra Pradesh

సుప్రీంలో అవినాష్ రెడ్డికి షాక్.. అరెస్ట్ ఖాయమేనా..?

అరెస్ట్ చేయకూడదు అనే నిబంధనలేవీ లేకపోవడంతో ఇక అవినాష్ రెడ్డి అరెస్ట్ లాంఛనమేననే వాదనలు వినపడుతున్నాయి. సీబీఐ రేపు అవినాష్ రెడ్డిని విచారణకు పిలిస్తే ఉత్కంఠ మొదలవుతుందనే చెప్పాలి.

సుప్రీంలో అవినాష్ రెడ్డికి షాక్.. అరెస్ట్ ఖాయమేనా..?
X

సుప్రీంలో అవినాష్ రెడ్డికి షాక్.. అరెస్ట్ ఖాయమేనా..?

ఈనెల 25 వరకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ని సీబీఐ అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్ట్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. అసలు సీబీఐ విచారణ జరుపుతుండగా.. అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులివ్వడం సరికాదని పేర్కొంది. హైకోర్టు ఆదేశాల వల్ల సీబీఐ దర్యాప్తుపైనా ప్రభావం పడుతుందని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. వివేకా హత్య కేసులో జూన్‌ నెలాఖరు వరకు సీబీఐ దర్యాప్తు గడువును పొడిగించింది.

హైకోర్టులో విచారణ ఉందని చెప్పినా..

తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులివ్వడంతోపాటు, తుది తీర్పు ఈనెల 25న ఇస్తామని చెప్పింది. ఇదే విషయాన్ని అవినాష్ తరపు న్యాయవాదులు సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. కనీసం అప్పటి వరకయినా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేయకుండా ఉండాలని కోరారు. అయినా సుప్రీం కోర్టు ధర్మాసనం ససేమిరా అన్నది. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ విజ్ఞప్తిని మన్నిస్తే ఉత్తర్వులు పరస్పరం విరుద్ధంగా ఉంటాయన్నారు.

నెగ్గిన సునీత..

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న దశలో ఆయన ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులివ్వడంతో ఈనెల 25 వరకు అరెస్ట్ ఉండదు అనుకున్నారంతా. కానీ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టు మెట్లెక్కారు. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్ని సవాల్ చేశారు. సుప్రీంకోర్టులో సునీత వాదనే నెగ్గింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు పూర్తిగా పక్కన పెట్టింది. అవినాష్‌ ని అరెస్ట్ చేయొద్దంటూ సీబీఐకి తెలంగాణ హైకోర్ట్ ఆదేశాలివ్వజాలదని స్పష్టం చేసింది.

అరెస్ట్ ఖాయమేనా..?

అరెస్ట్ చేయకూడదు అనే నిబంధనలేవీ లేకపోవడంతో ఇక అవినాష్ రెడ్డి అరెస్ట్ లాంఛనమేననే వాదనలు వినపడుతున్నాయి. సీబీఐ రేపు అవినాష్ రెడ్డిని విచారణకు పిలిస్తే ఉత్కంఠ మొదలవుతుందనే చెప్పాలి. సుప్రీం క్లారిటీ ఇవ్వడంతో రేపు తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై తుదితీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

First Published:  24 April 2023 10:48 AM GMT
Next Story