Telugu Global
Andhra Pradesh

బాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

విచార‌ణ చేప‌ట్టిన జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం ప్రాథమిక వాదనల అనంతరం కేసును వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చింది.

బాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా
X

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచార‌ణ‌ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. డిసెంబర్‌ 8లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

ఏపీ హైకోర్టు చంద్రబాబుకు మంజూరు చేసిన బెయిల్ ఆదేశాల‌ను రద్దు చేయాలని కోరుతూ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్‌లో దాఖలు చేసింది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం ప్రాథమిక వాదనల అనంతరం కేసును వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చింది.

బెయిల్‌ సందర్భంగా ఏపీ హైకోర్టు విధించిన నిబంధనలన్నీ యధాతథంగా కొనసాగుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్కిల్‌ కుంభకోణం కేసు గురించి చంద్రబాబు ఎలాంటి ప్రకటనలు చేయకూడదని, కేసు వివరాలపై బహిరంగంగా ప్రకటనలు చేయొద్దని ఆదేశించింది.

కేసుకు సంబంధించిన విషయాల గురించి మీడియాలో మాట్లాడ‌కూడ‌ద‌నే షరతుల‌ను గతంలో హైకోర్టు తొలగించగా, ఆ నిబంధ‌న‌ల‌ను తిరిగి కొన‌సాగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. ర్యాలీలు నిర్వహించడం, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయని పేర్కొంది. తదుపరి విచారణ వరకు ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది.

First Published:  28 Nov 2023 12:30 PM GMT
Next Story