Telugu Global
Andhra Pradesh

మంత్రి రోజాకి సెలబ్రిటీల మద్దతు.. టీడీపీకి కొత్త తలనొప్పి!

వాస్తవానికి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఎవరూ సమర్థించేవి కావు. కానీ.. టీడీపీ మాత్రం అతనితో క్షమాపణలు చెప్పించేందుకు రెడీగా లేదు.

మంత్రి రోజాకి సెలబ్రిటీల మద్దతు.. టీడీపీకి కొత్త తలనొప్పి!
X

మంత్రి ఆర్కే రోజాకి సెలబ్రిటీల నుంచి రోజురోజుకీ మద్దతు పెరుగుతోంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఇటీవల రోజా గురించి మీడియా ముందు అస‌భ్య‌క‌రంగా మాట్లాడిన విషయం తెలిసిందే. దాంతో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేసినా.. రోజు వ్యవధిలోనే బెయిల్‌పై బయటికి వచ్చేశారు. ఈ నేపథ్యంలో ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్‌గా మాట్లాడిన‌ రోజా.. కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. దాంతో ఒకప్పుడు రోజాతో కలిసి నటించిన హీరోయిన్స్, యాక్టర్స్ ఆమెకి మద్దతుగా నిలుస్తూ సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేస్తున్నారు.

కవితతో సార్ట్.. ఒకే రోజు ఇద్దరు హీరోయిన్స్

మంత్రి ఆర్కే రోజాపై బండారు వ్యాఖ్యల్ని ఖండిస్తూ టీడీపీ మాజీ నేత‌, సీనియర్ నటి కవిత తొలుత ఒక వీడియోను షేర్ చేయగా.. శుక్రవారం ఒక్కరోజే ఒకప్పటి హీరోయిన్స్ ఖుష్బూ, రాధికా శరత్ కుమార్ కూడా బండారు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రోజాకి మద్దతుగా నిలిచారు. అంతేకాదు.. ఈ ఇష్యూని ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్తామని కూడా ఇద్దరూ చెప్పడం గమనార్హం. రాబోయే రోజుల్లో సెలబ్రిటీలు మరింత మంది స్పందించే అవకాశాలూ లేకపోలేదు.

సమర్థించి.. నాలుక కర్చుకున్న టీడీపీ

బండారు సత్యనారాయణ వ్యాఖ్యల్ని సమర్థిస్తూ.. అతని అరెస్ట్‌ని తొలుత ఖండించిన టీడీపీ ఇప్పుడు అయోమయంలో పడిపోయింది. వైసీపీ మహిళా నేతలు బహిరంగంగానే టీడీపీలోని మహిళా నేతలకి సవాల్ విసురుతున్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అప్పట్లో మీడియా ముందు కత్తెరతో తెగ హడావుడి చేసిన వంగలపూడి అనిత ఇప్పుడు బయటికి రావాలని చెప్తున్నారు. అంతేకాదు.. మహిళలపై మీ ప్రతాపం ఏంటి? అని బాబు అరెస్ట్ తర్వాత సెంటిమెంట్ పండించిన భువనేశ్వరితో పాటు బ్రాహ్మణి కూడా ఈ ఇష్యూపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

క్షమాపణలు చెప్పిస్తారా..? వదిలేస్తారా?

వాస్తవానికి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఎవరూ సమర్థించేవి కావు. కానీ.. టీడీపీ మాత్రం అతనితో క్షమాపణలు చెప్పించేందుకు రెడీగా లేదు. ఒకవేళ చెప్పిస్తే? అప్పుడు వైసీపీ మరింత దూకుడు పెంచే ప్రమాదం ఉంది. ఒకవేళ క్షమాపణలు చెప్పకపోతే.. రోజాకి సెలబ్రిటీల మద్దతు రోజురోజుకీ పెరిగే అవకాశం ఉంది. ఎన్నికల ముందు అది టీడీపీకి మరింత నష్టం చేకూరనుంది. దాంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది టీడీపీ.

అడకత్తెరలో పోకచెక్కలా టీడీపీ

మహిళల గురించి నీచ వ్యాఖ్యలు చేసిన రాజకీయ నాయకులే కాదు.. టాప్ సెలబ్రిటీలు కూడా గతంలో క్షమాపణలు చెప్పిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. ఉమెన్‌ కార్డ్‌ని వాడుకోవడంలోనూ రాజకీయ పార్టీలు ముందుంటాయి. కాబట్టి.. టీడీపీ ఈ ఇష్యూని వీలైనంత త్వరగా పరిష్కరించుకుంటే మంచిదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరీ ముఖ్యంగా.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత సానుభూతి కోసం ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో ఇలాంటి ఇష్యూ ఆ పార్టీకి అడకత్తెరలో పోకచెక్కలా మారింది.

First Published:  7 Oct 2023 5:04 AM GMT
Next Story