Telugu Global
Andhra Pradesh

ఇడుపులపాయకు సోనియా, రాహుల్?

వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత విజయమ్మ, షర్మిలతో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ సమావేశమవుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇడుపులపాయకు సోనియా, రాహుల్?
X

రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు చాలా స్పీడుగా జరిగిపోతున్నాయి. ఈ నెల 8న పులివెందులలోని ఇడుపులపాయ ఎస్టేట్‌కు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాబోతున్నట్లు సమాచారం. ఇడుపులపాయ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఎస్టేట్ మాత్రమే. జూలై 8 వ తేదీన వైఎస్సార్ జయంతి సందర్భంగా సోనియా, రాహుల్ హాజరవబోతున్నట్లు తెలిసింది. ఈ మధ్యనే సోనియా వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇడుపులపాయలో పర్యటించారట. ఎస్టేట్ అంతా తిరిగి భద్రతా వ్యవహారాలను పరిశీలించి వెళ్ళినట్లు విశ్వసనీయ సమాచారం.

వైఎస్సార్ ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం తెగిపోయి చాలా సంవత్సరాలైంది. అలాంటిది ఇంత హఠాత్తుగా సోనియా, రాహుల్ ఎందుకు ఇడుపులపాయకు వస్తున్నట్లు? వైఎస్సార్ జయంతిలో పాల్గొంటున్నట్లు? ఎందుకంటే వైఎస్సార్ కూతురు వైఎస్ షర్మిల తెలంగాణాలో పెట్టిన వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేయబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఒకవైపు అలాంటిదేమీ లేదని షర్మిల చెబుతున్నారు. అయితే తరచూ ఆమె బెంగుళూరు వెళ్ళి కర్ణాటక పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో భేటీ అవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేయటం ఖాయమనే అందరు అనుకుంటున్నారు. పార్టీ విలీనం అయిపోగానే షర్మిలకు రాజ్యసభ మెంబర్‌ను చేస్తారని, ఏపీ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలిగా చేస్తారనే ప్రచారం అందరికీ తెలిసిందే. వీటన్నింటినీ పక్కనపెట్టేస్తే.. 8వ తేదీన సోనియా, రాహుల్ ఇడుపులపాయకు వస్తుండటం మాత్రం అనూహ్యమనే చెప్పాలి.

వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఇద్దరు విజయమ్మ, షర్మిలతో అక్కడే సమావేశమవుతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శ‌త్రువులు, శాశ్వత మిత్రులుండరన్న నానుడి మరోసారి నిజం కాబోతోందా అనే సందేహం పెరిగిపోతోంది. ఇక్కడ విషయం ఏమిటంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ, షర్మిల పరిస్థితి దాదాపు ఒకేలా ఉంది. అందుకనే కాంగ్రెస్‌తో షర్మిల కలిస్తే ఉభయలాభంగా ఉంటుందని డీకే ఇప్పటికే చాలాసార్లు చెప్పారట. డీకే ప్రతిపాదనకు షర్మిల ఓకే చెప్పారని, అందుకనే సోనియా, రాహుల్ ఇడుపులపాయకు రాబోతున్నారని ప్రచారం మొదలైంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

First Published:  1 July 2023 7:23 AM GMT
Next Story