Telugu Global
Andhra Pradesh

పారిశ్రామిక రంగంలో ఏపీ దూకుడు.. రాష్ట్రానికి తలమానికంగా శ్రీ సిమెంట్స్

ఏడాదికి 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో శ్రీ సిమెంట్స్ దాచేపల్లి ప్లాంట్ పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో దీని సామర్థ్యాన్ని 56.4 మిలియన్ టన్నులకు పెంచేందుకు సదరు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

పారిశ్రామిక రంగంలో ఏపీ దూకుడు.. రాష్ట్రానికి తలమానికంగా శ్రీ సిమెంట్స్
X

ఏపీ నుంచి పరిశ్రమలను తరిమేశారు, రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పడకేసింది అంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. వారికి ఎల్లో మీడియా వంతపాడుతోంది. జాకీని తరిమేశారు, లులూ మాల్ ని పంపించేశారంటూ విషప్రచారం చేస్తోంది. గత చంద్రబాబు ప్రభుత్వానికీ, ఇప్పటి జగన్ సర్కారుకీ ఒకటే తేడా. అప్పట్లో పనితక్కువ-ప్రచారం ఎక్కువ. ఇప్పుడు పని జరుగుతున్నా ప్రచారం చేసుకోవడంపై మాత్రం ఎవరికీ పెద్దగా శ్రద్ధ ఉన్నట్టు తెలియడంలేదు. వాస్తవం ఏంటంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికంటే ఏపీలో జగన్ సీఎం అయ్యాక పారిశ్రామిక రంగం స్థిరమైన అభివృద్ధిని సాధించింది. కరోనా కష్టాలను అధిగమించి మరీ ఏపీలో పరిశ్రమలు మొదలయ్యాయి. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం అవడం కూడా ఎల్లో మీడియాకు కంటగింపుగా మారింది.

తాజా విజయం..

గుంటూరు జిల్లా దాచేపల్లిలో శ్రీ సిమెంట్స్ సంస్థ రూ. 2500 కోట్లతో కొత్త ఇంటిగ్రేటెడ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. వాస్తవానికి ఇది 2024 అక్టోబర్ లో మొదలవుతుందని అనుకున్నారు. కానీ ఆరు నెలల ముందుగానే ఇక్కడ ప్లాంట్ పనిచేయడం ప్రారంభించింది. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఇక్కడ పనులు చకచకా జరిగాయి. అనుకున్నదానికంటే ముందే నిర్మాణం పూర్తయి, ప్లాంట్ పని కూడా మొదలు పెట్టింది.

ఏడాదికి 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో శ్రీ సిమెంట్స్ దాచేపల్లి ప్లాంట్ పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో దీని సామర్థ్యాన్ని 56.4 మిలియన్ టన్నులకు పెంచేందుకు సదరు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.శ్రీ సిమెంట్స్ సంస్థకు ఇది దేశంలోనే ఆరో ఇంటిగ్రేటెడ్ ప్రొడక్షన్ ఫెసిలిటీ ప్లాంట్. దక్షిణాదిలో కర్నాటకలోని కోడ్లా తర్వాత అతి పెద్దది. ఈ సిమెంట్ ప్లాంట్ ఇప్పుడు ఏపీకి తలమానికంగా మారింది.

శ్రీ సిమెంట్స్ కొత్త యూనిట్ వల్ల 700 మందికి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు లభించాయి. మరో 1300 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. అంతే కాదు.. కాలుష్య ఉద్గారాల నియంత్రణలో కూడా ఈ ప్లాంట్ లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం విశేషం. ఈ ప్లాంట్ కోసం స్థానికంగా ఉన్న వ్యర్థాలు, బయోమాస్ వంటి వాటిని 30శాతం వరకు ఉపయోగిస్తారు. అంటే ఆమేర పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించినట్టవుతుంది. పైగా స్థానిక ఆర్థిక అభివృద్ధికి కూడా ఇది ఊతమిస్తోంది.

రూ.2500కోట్ల పరిశ్రమ.. దాదాపుగా 2వేల మందికి ఉపాధి.. ఇలాంటి పరిశ్రమల గురించి ఎల్లో మీడియాకి పట్టదు. ఒకవేళ ప్రభుత్వ గొప్పదనం రాయాలన్నా చేతులు రావు. అందుకే ప్రభుత్వ వ్యతిరేక వార్తలే ఎక్కువగా ఫోకస్ అవుతున్నాయి. విజయాలు మాత్రం మరుగునపడిపోతున్నాయి.

First Published:  3 April 2024 5:15 AM GMT
Next Story