Telugu Global
Andhra Pradesh

షర్మిలది పిచ్చి లాజిక్కేనా?

ఎమ్మెల్యేలు అయినా, మంత్రులకు అయినా ప్రోటోకాల్ ప్రకారమే భద్రత ఉంటుంది. అలాగే ప్రతిపక్షాల నేతలకు కూడా భద్రత ఒక లెక్కప్రకారమే కల్పిస్తుంది. తమకు ప్రాణాపాయం ఉందని ఎవరికైనా అనిపిస్తే వాళ్ళు ప్రభుత్వానికి లేఖ రాస్తారు.

షర్మిలది పిచ్చి లాజిక్కేనా?
X

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది తాను ఏమి మాట్లాడుతున్నారో కూడా షర్మిలకు అర్థ‌మవుతున్నట్లు లేదు. జగన్మోహన్ రెడ్డిపైన వ్యక్తిగతంగాను, ప్రభుత్వంపైన ఎలాంటి ఆరోపణలు చేస్తే బాగా ప్రచారం వస్తుందో అలాగే మాట్లాడుతున్నారు. దాంతో జగన్‌పైన‌ ఎవరు బురద చ‌ల్లుతారా అని ఎదురు చూస్తున్న ఎల్లో మీడియా రెచ్చిపోయి బాగా ప్రయారిటి ఇస్తుంది. ఇపుడు విషయం ఏమిటంటే షర్మిల మాట్లాడుతూ.. తనకు సరైన భద్రత కల్పించలేదంటే తన చెడు కోరుకున్నట్లే అని తేల్చేశారు.

ఆమె మాటల్లో అర్థం ఏమిటంటే తన అన్న జగన్ తనకు చెడు జరగాలని కోరుకుంటున్నారని. ఎందుకంటే జగన్‌పై షర్మిల ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఆమెకు ప్రాణభయం ఉందట. తనపై ఎవరైనా దాడి చేస్తారని షర్మిల ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఈ విషయాన్ని హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తనతో పాటు షర్మిల అంతు చూస్తామని ఫేస్ బుక్ లో బెదిరిస్తున్నట్లు సునీత చెప్పారు. దాంతో వెంటనే షర్మిల తనకు ప్రాణాపాయం అని అందుకున్నారు.

ప్రతిపక్షాల నేతలకు రక్షణ, భ‌ద్ర‌త‌ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందని షర్మిల గుర్తుచేశారు. పీసీసీ అధ్యక్షురాలి హోదాలో తాను రాష్ట్రమంతా పర్యటిస్తుంటే ప్రభుత్వం కల్పించాల్సిన భ‌ద్ర‌త‌ కల్పించటంలేదని ఆమె జగన్ పై రెచ్చిపోయారు. తనకు సరైన భ‌ద్ర‌త‌ కల్పించటంలేదంటే అర్థం తన చెడు కోరుకుంటున్నట్లే అని ఆమె నిర్ణయించేసుకుని అదే విషయాన్ని ప్రకటించేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజకీయ కుటుంబంలో పుట్టి పెరిగిన షర్మిలకు ప్రభుత్వం ఎవరెవరికి భ‌ద్ర‌త‌ కల్పిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు.

ఎమ్మెల్యేలు అయినా, మంత్రులకు అయినా ప్రోటోకాల్ ప్రకారమే భద్రత ఉంటుంది. అలాగే ప్రతిపక్షాల నేతలకు కూడా భద్రత ఒక లెక్కప్రకారమే కల్పిస్తుంది. తమకు ప్రాణాపాయం ఉందని ఎవరికైనా అనిపిస్తే వాళ్ళు ప్రభుత్వానికి లేఖ రాస్తారు. ఆ లేఖను పరిశీలించిన ప్రభుత్వం అవసరం అనుకుంటే అదనపు భద్రత కల్పిస్తుంది లేకపోతే లేదు. ప్రభుత్వ నిర్ణయంతో ఎవరైనా విభేదిస్తే అలాంటి వాళ్ళు కోర్టుకెళ్ళి ఆదేశాలు తెచ్చుకుంటారు. ఇదంతా రెగ్యులర్‌గా జరుగుతున్నదే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిలకు ఉండే భద్రతేదో ఉండే ఉంటుంది. అదనపు భద్రత కావాలంటే ఆ విషయాన్ని ప్రభుత్వంతో చెప్పచ్చు. అంతేకాని తనకు భద్రత కల్పించలేదంటే చెడు కోరుకుంటున్నట్లే అని పిచ్చి లాజిక్కులు చెప్పటం షర్మిలకే చెల్లింది.

First Published:  8 Feb 2024 5:45 AM GMT
Next Story