Telugu Global
Andhra Pradesh

2019కంటే బాబుకి ఘోర ఓటమి ఖాయం

సీతను ఎత్తుకుపోయే సమయంలో రావణుడు మారువేషంలో వచ్చినట్టు చంద్రబాబు ఇప్పుడు సాధువు రూపంలో వచ్చి ప్రజల్ని నమ్మించే యత్నం చేస్తున్నారని చెప్పారు సజ్జల. ఏపీ ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

2019కంటే బాబుకి ఘోర ఓటమి ఖాయం
X

2019 ఎన్నికలకంటే టీడీపీ ఈసారి ఘోరంగా ఓడిపోతుందని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఓటమిని గ్రహించే చంద్రబాబు ఎగిరెగిరి పడుతున్నారని, పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగవడం ఖాయమన్నారు సజ్జల. చంద్రబాబు తన కూటమిలోని వాళ్లనే చిన్న చూపు చూస్తున్నారని, ఆయన వల్లే బీజేపీ, జనసేనకు అసలు ఉనికే లేకుండా పోయిందని చెప్పారు. జనసేన, బీజేపీ నేతలు పూర్తి నిరాశలో ఉన్నారని, ఆ పార్టీలో టికెట్లు కూడా చంద్రబాబు తన మనుషులకే ఇప్పించుకున్నారని అన్నారు సజ్జల.

గతంలో చంద్రబాబు ఎన్నికల కమిషనర్ ని బెదిరించిన వీడియోను మరోసారి మీడియాకు చూపించారు సజ్జల. వ్యవస్థలపై ఆయనకు ఎంత గౌరవం ఉందో ఆ వీడియో చూస్తేనే తెలుస్తుందన్నారు. ఇప్పుడు మాత్రం ఈసీకీ ఫిర్యాదులు చేస్తూ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అండ్‌ కో కక్షతో వాలంటీర్‌ వ్యవస్థపై విష ప్రచారం చేసిందని, ఎన్నికల ముందర ఆ వ్యవస్థను దూరం చేసిందని చెప్పారు. వాలంటీర్‌లు ఉండి ఉంటే రెండ్రోజుల్లోనే ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ పూర్తయ్యేదని, ఇప్పుడు ఆలస్యమైందని, దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన పెరుగుతోందని చెప్పారు సజ్జల. దురదృష్టవశాత్తు, ఎండలకు తాళలేక కొందరు చనిపోయారన్నారు. ఆ పాపం చంద్రబాబుని వెంటాడుతుందన్నారు.

పురంధేశ్వరి అహంకారంతో అధికారులపై ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారని, మరిదిని సీఎం చేయాలన్నదే ఆమె తాపత్రయం అన్నారు సజ్జల. చంద్రబాబును సీఎం చేసే వరకు రామోజీ, రాధాకృష్ణ, దత్తపుత్రుడికి మనసు శాంతించదేమోనని కౌంటర్ ఇచ్చారు. సీతను ఎత్తుకుపోయే సమయంలో రావణుడు మారువేషంలో వచ్చినట్టు చంద్రబాబు ఇప్పుడు సాధువు రూపంలో వచ్చి ప్రజల్ని నమ్మించే యత్నం చేస్తున్నారని చెప్పారు సజ్జల. ఏపీ ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

షర్మిల పెయిడ్ ఆర్టిస్ట్..

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పెయిడ్ ఆర్టిస్ట్ లా మారారని చెప్పారు సజ్జల. తెలంగాణ నుంచి హఠాత్తుగా ఆమె ఎందుకు మాయం అయ్యారని, ఇక్కడి కాంగ్రెస్‌ బాధ్యతలు ఆమెకు ఎవరిచ్చారు..? ఆమె ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో కొట్లాడుతానని చెప్పిన షర్మిల, ఇప్పుడు పెయిడ్‌ ఆర్టిస్ట్‌లాగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వివేకా హత్య కేసు గురించి నాలుగేళ్లుగా మౌనంగా ఉన్న షర్మిల, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు సజ్జల.

First Published:  6 April 2024 9:42 AM GMT
Next Story