Telugu Global
Andhra Pradesh

బాబు లాయర్‌ లూథ్రా ట్వీట్‌కి ఆర్‌జీవీ కౌంటర్‌

స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబును కాపాడేందుకు అత్యంత ప్రముఖ, సీనియర్‌ లాయర్లను తీసుకొస్తున్నా స్థానిక న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి సమానంగా నిలవలేకపోతున్నారనేది వర్మ ట్వీట్‌లో సారాంశం

బాబు లాయర్‌ లూథ్రా ట్వీట్‌కి ఆర్‌జీవీ కౌంటర్‌
X

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తరఫున కేసు వాదిస్తున్న సీనియర్‌ లాయర్‌ సిద్ధార్థ లూథ్రా ఎప్పటికప్పుడు ఎక్స్‌ (ట్విట్ట‌ర్‌) వేదికగా పలు రకాల కామెంట్లతో స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో శుక్రవారం చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించడంతో పాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇదే క్రమంలో హైకోర్టులో వేసిన క్వాష్‌ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.


ఈ పరిణామాలపై న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ట్విట్ట‌ర్‌లో మరోసారి స్పందించారు. ‘ప్రతి రాత్రి తర్వాత తెల్లవారుతుంది.. ప్రతి ఉదయం మన జీవితాల్లో వెలుగునిస్తుంది’ అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందించే సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ.. లూథ్రా ట్వీట్‌ను ప్రస్తావిస్తూ కౌంటర్‌ ఇచ్చారు.

ఇంతకీ వర్మ ఏమని ట్వీట్‌ చేశారంటే.. ‘అయితే జైలు గదిలో పగలు, రాత్రి ఒకేలా ఉంటాయ్‌ కదా సర్‌?’ అని. ఇది లూథ్రా ట్వీట్‌కు కొనసాగింపు అన్నట్టుగా ఉండటం గమనార్హం. అంతేకాదు.. ఈ ట్వీట్‌కి ముందు రామ్‌గోపాల్‌వర్మ మరో ట్వీట్‌ కూడా చేశారు. అదేమిటంటే.. ‘సిద్ధార్థ లూథ్రా + సిద్ధార్థ అగర్వాల్‌ x హరీశ్‌ సాల్వే ఈజ్‌ నాట్‌ = (ఈక్వల్‌) పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి’. స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబును కాపాడేందుకు అత్యంత ప్రముఖ, సీనియర్‌ లాయర్లను తీసుకొస్తున్నా స్థానిక న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి సమానంగా నిలవలేకపోతున్నారనేది వర్మ ట్వీట్‌లో సారాంశంగా కనబడుతోంది.

First Published:  23 Sep 2023 1:18 AM GMT
Next Story