Telugu Global
Andhra Pradesh

వైసీపీ విజయం సుస్పష్టం.. - తేల్చిచెప్పిన మరో సర్వే

అసెంబ్లీ సీట్లపైనే సర్వే నిర్వహించిన ఈ సంస్థ రాష్ట్రంలోని 175 సీట్లలో 121 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. ఇక టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి 54 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశముందని స్పష్టం చేసింది.

వైసీపీ విజయం సుస్పష్టం.. - తేల్చిచెప్పిన మరో సర్వే
X

రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం సుస్పష్టమని తాజాగా విడుదలైన మరో సర్వే కూడా వెల్లడించింది. పొలిటికల్‌ క్రిటిక్‌ నిర్వహించిన ఈ సర్వే రిపోర్ట్‌ను ఆ సంస్థ ప్రతినిధులు గురువారం విడుదల చేశారు. రాష్ట్రమంతటా ఫ్యాన్‌ గాలే వీస్తోందని తమ సర్వేలో తేలిందని ఈ సందర్భంగా ఆ సంస్థ స్పష్టం చేసింది. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి జతకట్టి బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఈ సర్వే నిర్వహించగా, వైసీపీకి తిరుగులేదని తేలిందని పేర్కొంది.

అసెంబ్లీ సీట్లపైనే సర్వే నిర్వహించిన ఈ సంస్థ రాష్ట్రంలోని 175 సీట్లలో 121 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. ఇక టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి 54 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశముందని స్పష్టం చేసింది. ఈ సర్వే ఫలితాలను ఒక్కసారి పరిశీలిస్తే.. వైసీపీ 121 +/– 5, టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి 54 +/– 5 సీట్లు గెలుచుకునే అవకాశముందని అర్థమవుతోంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ, ఇతరులు ఒక్క స్థానాన్ని కూడా పొందే అవకాశం లేదని సర్వే స్పష్టం చేసింది.


ఇక ఆయా పార్టీలకు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే ఓట్ల శాతాన్ని అంచనా వేయగా.. వైసీపీ 49.5 శాతం, టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి 43 శాతం, కాంగ్రెస్‌ 2.5 శాతం, ఇతరులు 5 శాతం ఓట్లు సాధించుకునే అవకాశముందని సంస్థ పేర్కొంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కోవిడ్‌ సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చూపిన చిత్తశుద్ధి వంటి అంశాల్లో జనం పూర్తిస్థాయిలో సంతృప్తిగా ఉన్నట్టు పొలిటికల్‌ క్రిటిక్‌ సంస్థ సర్వేలో తేలినట్టు సమాచారం.

First Published:  15 March 2024 2:49 AM GMT
Next Story