Telugu Global
Andhra Pradesh

రన్నింగ్ వెహికల్ లో పేకాట.. 16 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

కూడేరు ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు జల్లిపల్లి టోల్ గేట్ వద్ద బొలెరో వాహనంతో సహా ఏకంగా 16 మంది పేకాటరాయుళ్లను పట్టుకున్నారు.

రన్నింగ్ వెహికల్ లో పేకాట.. 16 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్
X

మొబైల్ క్యాంటీన్ తెలుసు, మొబైల్ ఏటీఎం తెలుసు, మరీ బాగా ఆలోచిస్తే మొబైల్‌ లైబ్రరీ కూడా విన్నాం.. కానీ, మీరు ఎప్పుడైనా మొబైల్ గ్యాంబ్లింగ్ సెంటర్‌ చూశారా.. పోనీ విన్నారా.. అనంతపురంలో ఓ వ్యక్తి ఇలాంటి అద్భుతమైన ఆలోచన చేశాడు. పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు ఎక్కువ అవడంతో ఏకంగా తన వాహనాన్ని మొబైల్ గ్యాంబ్లింగ్ సెంటర్‌గా మార్చాడు. బొలెరో వాహనం చుట్టూ టార్పాలిన్ కట్టి.. రన్నింగ్ వాహనంలోనే ఏకంగా పేకాట క్లబ్ నిర్వహిస్తున్నాడు. అనంతపురం జిల్లా జల్లిపల్లి టోల్ గేట్ వద్ద పోలీసుల తనిఖీలతో ఈ మొబైల్ గ్యాబ్లింగ్ గుట్టు రట్టయింది.

బొలెరో వాహనం నగర వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. లోపల పేకాట రాయుళ్లు పేకాట ఆడుతుంటారు. అటు ఆట ఆగదు, ఇటు వాహనం కూడా ఆగదు. రన్నింగ్ బొలెరో వాహనంలో పేకాట ఆడుతున్నారని ఓ గుర్తు తెలియని వ్యక్తి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

కూడేరు ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు జల్లిపల్లి టోల్ గేట్ వద్ద బొలెరో వాహనంతో సహా ఏకంగా 16 మంది పేకాటరాయుళ్లను పట్టుకున్నారు. బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లికి చెందిన రమణ ఇందులో కీలకమైన నిందితుడని పోలీసులు చెబుతున్నారు. ఇతను తన సొంత బొలెరో వాహనానికి టార్పాలిన్ పట్టా కట్టి మొబైల్ గ్యాంబ్లింగ్ కు ఉపయోగిస్తున్నాడు. పేకాటరాయుళ్లను అరెస్టు చేసిన పోలీసులు వాహనంతో సహా రూ.1,44,680 నగదు, 16 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

First Published:  29 Dec 2023 2:41 AM GMT
Next Story