Telugu Global
Andhra Pradesh

ఎన్నికల సంఘానికి టీడీపీ తప్పులు కనపడటం లేదా..?

నారా భువనేశ్వరి 3 లక్షల రూపాయల చెక్కులు పంచుతూ రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తుంటే ఎన్నికల సంఘం ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు పేర్ని నాని.

ఎన్నికల సంఘానికి టీడీపీ తప్పులు కనపడటం లేదా..?
X

ఈనాడులో సీఎం జగన్‌పై తప్పుడు వార్తలు రాస్తుంటే ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్నికల సంఘం ఈనాడుకు ఎందుకు లొంగిపోయిందని నిలదీశారాయన. ఈనాడులో వార్త వచ్చిన వెంటనే, దానిపై ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకుంటోందని, చంద్రబాబు ఆఫీసు ఎదుట అడ్డగోలుగా ఫ్లెక్సీలు పెడితే మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కూడా నారా భువనేశ్వరి 3 లక్షల రూపాయల చెక్కులు పంచుతూ రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తుంటే ఎన్నికల సంఘం ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. ఈ వ్యవహారంపై తాము ఫిర్యాదు చేస్తే, కనీసం నోటీసులు కూడా ఎందుకు ఇవ్వడంలేదన్నారు. ఎన్నికల సంఘాన్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు నాని. ఈసీ ఈ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

వాలంటీర్లు పెన్షన్లు పంచకుండా అడ్డుపడిన సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనేది చంద్రబాబు జేబు సంస్థ అని అన్నారు పేర్ని నాని. ఆ సంస్థ అధ్యక్షుడు జస్టిస్‌ భవానీ ప్రసాద్.. చంద్రబాబు హయాంలో పదవులు పొందారని, ఆ సంస్థ కార్యదర్శిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమిషనర్‌గా ఉండి సుజనాచౌదరి, కామినేని శ్రీనివాసరావుతో రహస్యంగా హోటల్లో కలిశారని విమర్శించారు. వీరంతా కలసి పేదవాడి పెన్షన్ ఇంటికి చేరకుండా కేసులు వేశారని, జగన్ ప్రభుత్వం మేలైన సేవలు అందిస్తుంటే వారందరికీ కడుపు మంట అని చెప్పారు పేర్ని నాని.

పవన్ పై పేర్ని పంచ్ లు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ ప్రచారంపై కూడా పంచ్ లు పేల్చారు పేర్ని నాని. గతంలో భీమవరంలో కూడా పవన్ ఇలాగే ప్రచారం చేశారని, ఓడిపోయినా అక్కడే ఉంటానన్నారని.. ఇప్పుడు పిఠాపురంలో కూడా అదే డ్రామా మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే అయితే చాలని పవన్ ఫిక్స్ అయ్యారని, అందుకే తనను గెలిపించాలని పిఠాపురం వాసుల్ని బతిమిలాడుకుంటున్నారని అన్నారు. మళ్లీ జగన్ ప్రభుత్వం వస్తుందని పవన్ కి అర్థమైందని, అందుకే కేవలం తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజల్ని వేడుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు. ఎంత మంది కలిసొచ్చినా జగన్‌ మళ్లీ సీఎం అవడం ఖాయమన్నారు పేర్ని నాని.

First Published:  31 March 2024 3:53 PM GMT
Next Story