Telugu Global
Andhra Pradesh

ఆ విషయంలో చిరంజీవిని ఇబ్బంది పెట్టా -పవన్

రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది.. బంధుత్వాలు ఉండవని చెప్పారు పవన్. మే 15లోపు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ ని సిద్ధం చేస్తామన్నారు.

ఆ విషయంలో చిరంజీవిని ఇబ్బంది పెట్టా -పవన్
X

పార్టీ పెట్టడానికి సొంత అన్నను కాదనుకొని బయటకు వచ్చానని, ఆ విషయంలో ఆయన్ను ఇబ్బంది పెట్టానని చెప్పారు పవన్ కల్యాణ్. మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుని జనసేనలోకి ఆహ్వానించారు పవన్. మంగళగిరి పార్టీ ఆఫీస్ లో ఆయనకు జనసేన కండువా కప్పారు. భీమవరం టికెట్ పులవర్తికి ఖాయమయ్యే అవకాశాలున్నాయి. అయితే తాను మాత్రం భీమవరం వదిలిపెట్టనంటూ పవన్ స్టేట్ మెంట్ ఇవ్వడం ఇక్కడ విశేషం.


రామాంజనేయులు చేరిక జనసేనకు చాలా కీలకం అన్నారు పవన్. ఎమ్మెల్యేగా ఓడిన వ్యక్తిని కూడా ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలకంగా మారారన్నారు. గతంలో తాను గెలిచి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని, 2019 ఎన్నికల్లో ఓడినా జనం గుండెల్లో స్థానం తనకు మరింత బలాన్నిచ్చిందని చెప్పారు. భీమవరంలో ఓడిపోయిన వ్యక్తి.. కూటమిని ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా మారాడంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు.

రౌడీల చేతుల్లో బందీ..

కుబేరులు ఉండే భీమవరం పట్టణం ఒక రౌడీ చేతిలో బందీ అయిందని అన్నారు పవన్ కల్యాణ్. ఇక్కడి నుంచి రౌడీయిజం తీసేస్తామన్నారు. జనసేన గెలిస్తే భీమవరంలో డంపింగ్‌ యార్డ్‌ను సరిచేస్తామని హామీ ఇచ్చారు. భీమవరంలో ఉండే జలగను తీసిపారేస్తామన్నారు పవన్.

యుద్ధాన్నే ఇద్దాం..

రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది.. బంధుత్వాలు ఉండవని చెప్పారు పవన్. మే 15లోపు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ ని సిద్ధం చేస్తామన్నారు. సిద్ధం.. సిద్ధం అని కోకిలలా కూస్తున్న వ్యక్తికి యుద్ధాన్ని ఇద్దామని చెప్పారు. దాడులపై పోరాడకపోతే మనది కూడా తప్పు అవుతుందని, యుద్ధం తాలూకూ అంతిమ లక్ష్యం.. ప్రభుత్వాన్ని మార్చేలా చేయడం అని అన్నారు పవన్.

First Published:  12 March 2024 2:30 PM GMT
Next Story