Telugu Global
Andhra Pradesh

లంక గ్రామాల్లో కాదు.. శ్రీలంకలో పర్యటిస్తే బాబుకు ప్రచారం.. విజయ్ సాయి ఫైర్..!

ఎంపీ విజయ్ సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ప్ర‌తిప‌క్ష నేత‌ చంద్రబాబుపై విమర్శలు చేశారు. వరద రాజకీయాలు ఆపాలని మండిపడ్డారు.

లంక గ్రామాల్లో కాదు.. శ్రీలంకలో పర్యటిస్తే బాబుకు ప్రచారం.. విజయ్ సాయి ఫైర్..!
X

రాష్ట్రంలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాల్లో వరద సంభవించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. కాగా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలను ప్రభుత్వం కొద్ది రోజులుగా ముమ్మరంగా చేపడుతోంది. వరదలు సంభవించడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు వారిని పునరావాస కేంద్రాలకు తరలించింది. పునరావాస కేంద్రాల్లో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఆహారంతోపాటు ఉల్లిపాయలు, బియ్యం, బంగాళదుంపలు, వంటనూనె, తాగునీరు, దుస్తులు అందజేసింది.

తక్షణ సాయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒక్కో కుటుంబానికి రూ. రెండు వేల చొప్పున పంపిణీ చేసింది. అయితే ప్రభుత్వం వరదలు సంభవించిన ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో మునిగి ఉండగా ప్రతిపక్షాలు మాత్రం వరదలతో అల్లాడుతున్న ప్రజలకు సాయం అందించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శలు చేస్తున్నాయి. నిన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతిపక్షనేత చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు పర్యటించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వరద బాధితులకు రూ.రెండు వేలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం ఏంటని, రూ.10 వేలు సాయం చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకుండా హెలికాప్టర్ లో గాల్లో తిరిగి వెళ్లిపోయారని విమర్శించారు. కాగా చంద్రబాబు, ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై వైసీపీ నేతలు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. వరద రాజకీయాలు ఆపాలని మండిపడ్డారు. తాజాగా ఎంపీ విజయ్ సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు చేశారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించిన సమయంలో ప్రభుత్వం తమకు భోజనం, మంచినీళ్లు, వసతి కల్పిస్తోందని ప్రజలు చెప్పడంతో చంద్రబాబు దిగ్భ్రాంతికి గురయ్యారన్నారు. ప్రభుత్వం తమకు సాయం చేస్తోందని ప్రజలు చెప్పడంతో చేసేదేమీ లేక టీడీపీ నేతలు పడవపై నుంచి కిందకు దూకి హడావుడి, హైడ్రామా చేశారని విమర్శించారు. చంద్రబాబు లంక గ్రామంలో కాకుండా శ్రీలంకలో పర్యటిస్తే ఇంతకంటే ఎక్కువ ప్రచారం వచ్చేదని ఎద్దేవా చేశారు.

First Published:  22 July 2022 7:07 AM GMT
Next Story