Telugu Global
Andhra Pradesh

పాపం పవన్.. అన్నయ్య విరాళం పనికిరాకుండా పోయింది

పవన్ కల్యాణ్ కి చిరంజీవి సపోర్ట్ చేస్తారా..? జనసేన తరపున ఆయన ప్రచారం చేస్తారా..? పోనీ రామ్ చరణ్ అయినా బాబాయ్ కోసం పిఠాపురం వస్తారా..? జనసైనికులకే కాదు, సామాన్యుల్లో కూడా ఆసక్తి రేకెత్తించే ప్రశ్నలివి.

పాపం పవన్.. అన్నయ్య విరాళం పనికిరాకుండా పోయింది
X

జనసేనకు చిరంజీవి రూ.5కోట్ల విరాళం అందించారు. అంతే కాదు, సోషల్ మీడియా వేదికగా తమ్ముడిని ఓ రేంజ్ లో పొగిడారు. అందరు అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తామంటారని, కానీ తన తమ్ముడు కష్టపడి సంపాదించిన సొమ్ముని రైతు కూలీల కోసం వినియోగించడం తనకు సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. తన స్వార్జితాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు చిరంజీవి. అంతా బాగానే ఉంది కానీ ఈ ఎపిసోడ్ ఎందుకో అనుకున్న స్థాయిలో రక్తి కట్టలేదు. మామూలుగా అయితే మంచి స్పందన రావాలి, ఎన్నికల సీజన్ కాబట్టి ఇంకా ఎక్కువ రియాక్షన్ రావాలి. కానీ సోషల్ మీడియాలో కూడా పెద్దగా హడావిడి లేదు. జనసేన, చిరు అభిమానులు కూడా లైట్ తీసుకున్నారు.

కారణం ఏంటి..?

పవన్ కల్యాణ్ కి చిరంజీవి సపోర్ట్ చేస్తారా..? జనసేన తరపున ఆయన ప్రచారం చేస్తారా..? పోనీ రామ్ చరణ్ అయినా బాబాయ్ కోసం పిఠాపురం వస్తారా..? జనసైనికులకే కాదు, సామాన్యుల్లో కూడా ఆసక్తి రేకెత్తించే ప్రశ్నలివి. పలు సందర్భాల్లో కూడా చిరంజీవి తన తమ్ముడి రాజకీయ ప్రస్థానాన్ని మెచ్చుకున్నారు. ఇప్పుడు నేరుగా విరాళం ఇచ్చిమరీ ప్రోత్సహించారు. అయితే పవన్ కల్యాణ్ కోసం ప్రచారానికి వచ్చేంత సాహసం చిరంజీవి చేయకపోవచ్చు. ఒకవేళ వస్తే జగన్ ప్రభుత్వాన్ని తిట్టాల్సి ఉంటుంది, జగన్ ని విమర్శించాల్సి ఉంటుంది. రాజకీయాలకు దూరంగా సైలెంట్ గా ఉంటున్న చిరంజీవి సడన్ గా తమ్ముడికోసం వైసీపీతో శతృత్వం పెంచుకుంటారనుకోలేం. చిరంజీవికే లేని బాధ తమకెందుకు అనుకున్నారో ఏమో.. చిరు అభిమానులు కూడా పెద్దగా స్పందించలేదు. అసలు మెగాస్టార్ అభిమానులెవరూ జనసేన కార్యక్రమాల జోలికి కూడా వెళ్లడంలేదు. అందుకే విరాళం ఎపిసోడ్ పెద్దగా పండలేదు.

చిరంజీవి ట్వీట్ అంటే అందరిలో ఎంతో ఆసక్తి ఉంటుంది, ఆయన ఏ సినిమాని మెచ్చుకున్నా, ఎవరి గురించి పొగిడినా.. క్షణాల్లో వైరల్ గా మారడం ఖాయం. కానీ తమ్ముడు పవన్, విశ్వంభర సినిమా షూటింగ్ కి వెళ్లడం, అక్కడ చిరంజీవి కాళ్లకి నమస్కారం చేయడం, వెంటనే రూ.5కోట్ల చెక్ అందుకోవడం.. ఇవన్నీ ఎందుకో సినిమాటిక్ గా అనిపించాయి. అందుకే ఈ విరాళాల ఎపిసోడ్ కి రావాల్సినంత ప్రచారం రాలేదు. మిగతా హీరోలు, సినిమా నటీనటులు కూడా ఎవరూ స్పందించలేదు. మొత్తానికి ఈ విరాళం ప్రచారానికి పనికిరాకుండా పోయిందనమాట.

First Published:  9 April 2024 2:08 PM GMT
Next Story